రిజిస్ర్టేషన్లపై ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2022-02-23T06:52:48+05:30 IST

లే అవుట్‌(ఎల్‌పీ) నెంబరు లింకుతో రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇళ్ల స్థలాలు, ఖాళీ నివేశన స్థలాల రిజిస్ర్టేషన్‌ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు గందరగోళంగా మారాయి.

రిజిస్ర్టేషన్లపై ప్రతిష్టంభన

రోజుకు సరాసరిన కోల్పోతున్న 

రూ.50లక్షల ఆదాయం

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22: లే అవుట్‌(ఎల్‌పీ) నెంబరు లింకుతో రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇళ్ల స్థలాలు, ఖాళీ నివేశన స్థలాల రిజిస్ర్టేషన్‌ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు గందరగోళంగా మారాయి. డీటీసీపీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి ఉన్న ఇళ్ల స్థలాలను మాత్రమే రిజిస్ర్టేషన్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దాంతో అనుమతుల్లేని వాటి రిజిస్ర్టేషన్లను నిలిపేశారు. అలాగే గ్రామకంఠ స్థలాల రిజిస్ర్టేషన్లు కూడా  ఆపేశారు. డీటీసీపీ అప్రూవల్‌ ఉండాలంటే జిల్లా వ్యాప్తంగా 95 శాతానికిపైగా ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు జరగదు. సోమవారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినా.. ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ర్టేషన్లు చేస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. దీనివల్ల ఇంటి స్థలాల రిజిస్ర్టేషన్లవైపు సబ్‌ రిజిస్ర్టార్లు కన్నెత్తి చూడటం లేదు. ఈ కారణంగా జిల్లాలో సరాసరి రోజుకు రూ.50 లక్షలకుపైగా ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే రిజిస్ర్టేషన్ల లక్ష్యం ఏ మేరకు సాధించాలంటూ సబ్‌ రిజిస్ర్టార్లు ప్రశ్నిస్తున్నారు.


సర్వర్ల స్తంభన

సర్వర్లు మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తిగా స్తంభించగా ఆ తర్వాత కూడా నెమ్మదిగా పనిచేశాయి. దాంతో రిజిస్ర్టేషన్లకు వచ్చినవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికే గంట పడుతుందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని చిత్తూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మంగళవారం 10 రిజిస్ర్టేషన్లు జరిగాయి. కుప్పంలో అయితే ఒక్కటీ జరగలేదు. జిల్లాలో 25 సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలుండగా.. సగటున రోజుకు 120-130 రిజిస్ర్టేషన్లు జరిగేవి. మంగళవారం 45 రిజిస్ర్టేషన్లు మాత్రమే జరిగినట్లు తెలిసింది.

Updated Date - 2022-02-23T06:52:48+05:30 IST