పాపవినాశనంలో పుట్టుకొస్తున్న దుకాణాలు

ABN , First Publish Date - 2022-11-21T01:34:19+05:30 IST

తిరుమలలోని పాపవినాశనంలో నూతన దుకాణాలు పుట్టుకొస్తున్నాయి.

పాపవినాశనంలో పుట్టుకొస్తున్న దుకాణాలు

తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని పాపవినాశనంలో నూతన దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. తిరుమలలోని పాపవినాశనం ప్రదేశం ప్రభుత్వ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్కడున్న దుకాణాలన్నీ టీటీడీ పరిధిలోకి రావని, అద్దెలను తమకే చెల్లించాలంటూ కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ ఫారెస్ట్‌ విభాగం దుకాణదారులకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే పాపవినాశనంలోని అన్ని దుకాణాలు ప్రభుత్వ ఫారెస్ట్‌ పరిధిలోకి వెళ్లాయి. టీటీడీ నుంచి ఆ ప్రాంతం వేరైన క్రమంలో కొంతమంది అక్రమార్కులు రాజకీయనాయకుల అండదండలతో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కొన్నేళ్లుగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ ఓ దుకాణ నిర్మాణానికి ట్రాక్టర్ల ద్వారా రాళ్లు, ఇసుక, రేకులు తెచ్చే క్రమంలో అక్కడున్న షికారీలు అడ్డుకుని ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ వ్యాపారాలను దెబ్బతీసేలా పాపవినాశనంలో అక్రమంగా దుకాణాలు నిర్మిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా తాము పాపవినాశనాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడే బతుకుతున్న క్రమంలో తమ వ్యాపారాలను నాశనం చేసేలా అధికారులు దుకాణాల నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ట్రాక్టర్లు అప్పట్లో వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా మరో రెండు దుకాణాలను అత్యంత వేగంగా నిర్మించి ఏకంగా పూజలు చేశారు. భక్తులు స్నానమాచరించే నీటిధారకు అత్యంత సమీపంలో ఈ దుకాణాలను నిర్మించడం గమనార్హం. అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉండటంతోనే అటవీ అధికారులు మౌనంగా ఉన్నారంటూ అక్కడి వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-11-21T01:34:22+05:30 IST