చిత్తూరు జిల్లాలో ఏడుగురు హోంగార్డులు అరెస్టు

ABN , First Publish Date - 2022-12-13T03:23:55+05:30 IST

చిత్తూరు జిల్లాలో నకిలీ డీవో (డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌)లతో ఉద్యోగాల్లో చేరిన వ్యవహారంలో ఏడుగురు హోంగార్డులను అరెస్టు చేశారు.

చిత్తూరు జిల్లాలో ఏడుగురు హోంగార్డులు అరెస్టు

నకిలీ డీవోల వ్యవహారంలో చర్యలు

నకిలీ పత్రాలతో రూ.2 నుంచి 5 లక్షలు వసూలుచేసినట్టు గుర్తింపు

చిత్తూరు, డిసెంబరు 12: చిత్తూరు జిల్లాలో నకిలీ డీవో (డిపార్ట్‌మెంటల్‌ ఆర్డర్‌)లతో ఉద్యోగాల్లో చేరిన వ్యవహారంలో ఏడుగురు హోంగార్డులను అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది అరెస్టయ్యే అవకాశాలున్నాయి. 2014-19 మధ్యకాలంలో నకిలీ డీవోలతో చాలా మంది హోంగార్డు ఉద్యోగాల్లో చేరారని పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపట్టి 87 మంది ప్రభుత్వ అనుమతి లేకుండానే విధుల్లో చేరారని తేల్చారు. రెండు రోజుల క్రితం వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌ పేమెంట్‌ విఽభాగంలో ఏపీఎస్‌ ఆర్టీసీ, ఆర్‌పీఎఫ్‌, ఫైర్‌, కాణిపాకం ఆలయం, టీటీడీ, ఆర్టీఏ, జైళ్లశాఖ, ఏపీఎస్పీడీసీఎల్‌, ఎఫ్‌సీఐ శాఖల్లో నుంచి జీతాలను నేరుగా హోంగార్డు బ్యాంకు ఖాతాలకే జమచేస్తారు. ఈ రెండు విభాగాల్లో ఖాళీలను భర్తీచేయడానికి ఎస్పీ అనుమతి తప్పనిసరి. అయితే ఆన్‌ పేమెంట్‌ విభాగంలో ఎస్పీకి తెలియకుండానే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ముందుగానే తెలుసుకుని హోంగార్డు రైటర్‌ మణికంఠన్‌, హోంగార్డు ఇన్‌చార్జి కానిస్టేబుల్‌ జయకుమార్‌, డీపీవో హోంగార్డు గుమస్తా సహాయకుడిగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌ కలిసి నకిలీ డ్యూటీ పత్రాలు సృష్టించారు. తమకు పరిచయమున్న వారి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలవరకు డబ్బులు తీసుకుని నకిలీ డ్యూటీ పత్రాలు అందించి వివిధ శాఖలకు డ్యూటీలు వేశారు. ఈ ముగ్గురితో పాటు ఇందులో ప్రమేయమున్న హోంగార్డులు యువరాజ్‌, సుల్తాన్‌, సలీంబాషా, చిరంజీవిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

Updated Date - 2022-12-13T03:23:56+05:30 IST