వద్దంటున్నా.. ముందుకే..!

ABN , First Publish Date - 2022-05-30T07:22:52+05:30 IST

రైతులు వద్దంటున్నా.. ఆందోళన చెందుతున్నా.. ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోంది. వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్లు మిగించే దిశగా చర్యలు చేపడుతోంది.

వద్దంటున్నా.. ముందుకే..!

‘వ్యవసాయ’ మీటర్లకోసం రైతుల పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాలు 

వివరాలు నమోదు చేస్తున్న అధికారులు 

ఆపై దశలవారీగా మీటర్ల ఏర్పాటు 


చిత్తూరు రూరల్‌, మే 29: రైతులు వద్దంటున్నా.. ఆందోళన చెందుతున్నా.. ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోంది. వ్యవసాయ విద్యుత్తు సర్వీసులకు మీటర్లు మిగించే దిశగా చర్యలు చేపడుతోంది. శనివారం నుంచి సదరన్‌ డిస్కం అధికారులు రైతుల పేర్లపై డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) స్కీమ్‌ కింద బ్యాంకు అకౌంటర్లను ప్రారంభించడం మొదలు పెట్టారు. దశల వారీగా మీటర్లు అమర్చడానికి ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్మార్టు మీటర్ల కొనుగోలుకు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి ఏజెన్సీలను ఖరారు చేసి వారి ద్వారానే అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

రైతులు వ్వవసాయ రంగానికి ఏళ్లతరబడి ఉచిత విద్యుత్తును వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు ఎలాంటి నియంత్రణ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నగదు బదిలీ కింద మీటర్లు పెడతామని చెబుతోంది. రైతులు వినియోగించే విద్యుత్తుకు తామే నగదు చెల్లిస్తామని...ఆలస్యమైనా తామే పూచీ ఉంటామని ప్రభుత్వం అంటోంది. దీనిపై అన్నదాతలు ఎన్నో అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ముందడుగే వేస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ నగదు బదిలీ పథకంలో బాగంగా శనివారం నుంచి రైతుల చేత సదరన్‌ డిస్కం అధికారులు ఓ కొత్త బ్యాంకు అకౌంటును తెరిపించే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే రెండు, మూడు ఖాతాలున్న రైతులు అందులో ఒక దానిని ఈ పథకం కోసం కేటాయించినట్లు ఆమోద పత్రం తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వేలపైగా బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి నెలా విద్యుత్తు వాడకాన్ని బట్టి వచ్చిన కరెంటు బిల్లు డబ్బులను రైతులు కేటాయించిన ఖాతాలో ప్రభుత్వం వేస్తుందని.. ఈ నగదు రైతుల అకౌంట్‌ నుంచి ఎస్పీడీసీఎల్‌కు జమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నగదును రైతులు తీసుకునే అవకాశం కానీ, మరో ఖాతాకు బదలాయించే వీలు కానీ ఉండదు. ఆయా రైతులు ఎన్ని యూనిట్ల విద్యుత్తు వాడారు? ఎంత నగదు అకౌంట్‌లో జమ అయింది అనే మేసేజ్‌లు మాత్రం ఫోన్‌ నెంబర్లకు వస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ అన్నదాతల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. యూనిట్ల లెక్కింపుతో భవిష్యత్తులో ఎలాంటి ముకుతాడు వేస్తారోననే భయం వెంటాడుతోంది. 


ఉమ్మడి జిల్లాలో 3,01,688 వ్యవసాయ విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. ఇందులో 95 శాతం వరకు వ్యవసాయ సర్వీసులను మ్యాపింగ్‌ చేశారు. మిగిలిన ఐదు శాతానికి సంబంధించి.. సర్వీసులు పొందిన రైతులు చనిపోవడం, భూములు విక్రయించడం తదితర పరిణామాలతో మార్పులు, చేర్పులు అనివార్యమయ్యాయి. వీటిని కూడా సరిచేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 


రెండు రోజుల్లో వివరాల నమోదు పూర్తి చేయాలి 

వ్యవసాయ విద్యుత్తు నగదు బదిలీ పథకంలో భాగంగా ప్రతి రైతుకు ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిపించనున్నాం. రెండు, మూడు ఖాతాలుంటే వారి అనుమతితో ఒకదానిని ఈ పథకానికి వినియోగించుకోవచ్చు. ఈనెలాఖరులోపు అకౌంట్‌ ఓపినింగ్‌, వివరాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ఇప్పటికే వ్యవసాయ కనెక్షన్లకు అమర్చనున్న మీటర్లపై రైతులకు అవగాహన కూడా కల్పించాం. 

- అమర్‌బాబు, ఈఈ, చిత్తూరు డివిజన్‌

Updated Date - 2022-05-30T07:22:52+05:30 IST