సర్పంచుల సమరశంఖం

ABN , First Publish Date - 2022-11-30T03:30:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను మళ్లించినందుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ‘సర్పంచుల సమర శంఖారావం’ పేరిట మంగళవారం తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు.

సర్పంచుల సమరశంఖం

అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర

అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు

దేవుడినీ వేడుకోనివ్వరా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం

అరెస్టులను ఖండించిన చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు

తిరుపతి/అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను మళ్లించినందుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో ‘సర్పంచుల సమర శంఖారావం’ పేరిట మంగళవారం తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. శాంతియుతంగా తిరుమలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సర్చంచులను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసుల కళ్లుకప్పి రుయా ఆస్పత్రి వద్ద ఉన్నవారినికూడా వదిలిపెట్టకుండా వెంబడించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద అలజడి నెలకొంది. తెల్లచొక్కా వేసుకున్న వారందరూ సర్పంచులని భావించి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పలువురు వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తమ సమస్యలను దేవుడితో చెప్పుకొందామని, ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా తిరుమలకు బయలుదేరితే అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం వైసీపీ ప్రభుత్వానికి తగదని సూచించారు. ఎలాగైనా దైవ దర్శనానికి వెళ్లితీరుతామని, తమ 12 డిమాండ్లు నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామిని వేడుకుంటామన్నారు. వారికి సంఘీభావంగా టీడీపీ నేతలు, సీపీఐ నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. సర్పంచులను అరెస్టు చేయడం సిగ్గుచేటని, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. సాయం త్రం 6గంటల తరువాత పోలీస్‌ స్టేషన్ల నుంచి సర్పంచులను విడిచిపెట్టారు. కాగా.. సర్పంచుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. గ్రామాల అభివృద్ధి గురించి జగన్‌రెడ్డి పట్టించుకోకుండా రూ. 8,660 కోట్ల నిధులను దారి మళ్లించారు, కాబట్టే సర్పంచులంతా రోడ్డెక్కారని తెలిపారు. ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్న సర్పంచుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

సర్పంచులపై సర్పంలా బుస కొడుతున్న జగన్‌కు పతనం తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. పంచాయతీల నిధులు, విధులను మింగేసిన సర్కారు.. సర్పంచులపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. హక్కుల కోసం పార్టీలకతీతంగా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ చాంబర్‌ చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్‌రెడ్డి పాలనలో సర్పంచులు దగాపడ్డారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.8,608 కోట్లను సర్కారు దారి మళ్లించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,918 పంచాయతీల సర్పంచులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం ఉక్కపాదంతో అణగదొక్కుతోందని విమర్శించారు. అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టి, తమ సమస్యలను వేంకటేశ్వరస్వామికి చెప్పుకొనేందుకు బయల్దేరిన సర్పంచులను, సర్పంచుల సంఘ నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-11-30T03:30:07+05:30 IST

Read more