రూ.6 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-11-24T00:40:10+05:30 IST

కర్ణాటక నుంచి కారులో అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న ఒకరు.. దీనికి పైలెట్‌గా ద్విచక్ర వాహనంలో వచ్చిన మరొకరు.. వీరిద్దరినీ అరెస్టు చేసి రూ.6 లక్షల మద్యాన్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.6 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం
పట్టుబడిన కర్ణాటక మద్యం, నిందితులను మీడియాకు చూపిస్తున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి

ఇద్దరు నిందితుల అరెస్టు

చిత్తూరు, నవంబరు 23: కర్ణాటక నుంచి కారులో అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న ఒకరు.. దీనికి పైలెట్‌గా ద్విచక్ర వాహనంలో వచ్చిన మరొకరు.. వీరిద్దరినీ అరెస్టు చేసి రూ.6 లక్షల మద్యాన్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను బుధవారం వెస్ట్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. కర్ణాటక నుంచి కొంతకాలంగా విచ్చలవిడిగా మద్యాన్ని తీసుకొన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టి ఎక్కడికక్కడ అరెస్టు చేయిస్తున్నారు. ఈ క్రమంలో గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బందితో కలిసి బుధవారం చిత్తూరు-వేలూరు రోడ్డులోని గొల్లమడుగు క్రాస్‌రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. వేలూరు వైపు నుంచి ఒక మోటార్‌ సైకిల్‌, దాని వెనుక ఓ కారు వచ్చింది. పోలీసులకు అనుమానం వచ్చి వీటిని ఆపారు. కారులో ఉన్న లాలూగార్డెన్‌ అన్వర్‌ బాషా(24), పైలట్‌గా ముందు ద్విచక్ర వాహనంలో వస్తున్న తవణంపల్లె మండలం అరగొండ పైమాఘంకు చెందిన అనంతరాజు(23)ను అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా రూ.6 లక్షల విలువ చేసే 4464 టెట్రా ప్యాకెట్లు దొరికాయి. వీటితోపాటు కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వాహనంలో ఒక్కడే వచ్చాడా?

కర్ణాటక నుంచి రూ.6లక్షల విలువ చేసే మద్యంతో కారులో ఒక్కడే వచ్చాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కారులో ముగ్గురు, ద్విచక్ర వాహనంలో ఇద్దరు వచ్చారని.. కొంత దూరంలో పోలీసులు ఉన్నారని తెలిసి కారులో నుంచి ఇద్దరు, ద్విచక్ర వాహనం నుంచి ఒక్కడు దిగిపారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పైలట్‌గా ద్విచక్రవాహనంలో ఒక్క వ్యక్తి, కారును నడుపుకుంటూ ఇంకొకడే వచ్చాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. కాగా, పారిపోయిన వ్యక్తుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతని చెల్లె పేరుమీదనే ద్విచక్ర వాహనం రిజిస్ర్టేషన్‌ అయింది. అతడే సంతపేట, మంగసముద్రం తదితర ప్రాంతాల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ను విక్రయించే వాడని సమాచారం. పారిపోయిన వారి ఊసెత్తకుండా పోలీసులు ఇద్దరినే ప్రస్తావించి, అరెస్టు చూపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఒత్తిడి ఉందన్న ప్రచారం సాగుతోంది.

Updated Date - 2022-11-24T00:40:13+05:30 IST