తిరుమలలో వసతి గదులు పరిమితం

ABN , First Publish Date - 2022-09-11T06:31:03+05:30 IST

తిరుమలలో వసతి గదులు పరిమితంగా ఉన్నాయని, భక్తులు తిరుపతిలో బస చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో వసతి గదులు పరిమితం
భక్తులకు ప్రశ్నలకు సమాధానాలిస్తున్న ఈవో ధర్మారెడ్డి

తిరుపతిలోనే బస చేయండి

డయల్‌ యువర్‌ టీటీడీ ఈవోలో భక్తులకు ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి


తిరుమల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వసతి గదులు పరిమితంగా ఉన్నాయని, భక్తులు తిరుపతిలో బస చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండపై వసతి గదులు దొరక్క ఇబ్బంది పడుతున్నామని, పీఏసీలోని మరుగుదొడ్లలో పారిశుధ్య నిర్వహణ బాగా లేదని నర్సింగారావు(వైజాగ్‌), శ్రీహరి (పలమనేరు) ఈవో దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఏడు వేల గదులు మాత్రమే ఉన్నాయని, ఇందులో దాదాపు 25వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉందని చెప్పారు. అధిక రద్దీకారణంగా గదులను రోజుకు రెండు మూడు సార్లు కేటాయిస్తున్నామన్నారు. పీఏసీలో పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పలువురు భక్తులు తమ సూచనలు, ఫిర్యాదులను ఈవోకు తెలియజేశారు. ప్రధానంగా.. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉన్న లడ్డూకవర్‌ తీసుకున్నాక చిల్లర ఇవ్వడం లేదంటూ రవికుమార్‌ (తిరుపతి) ఫిర్యాదు చేశారు. ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్నవారు కూడా ఎక్కువ సమయం దర్శనానికి వేచి ఉండాల్సి వస్తోందని, క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయని హరిముత్తు(తమిళనాడు) తెలిపారు. రద్దీ ఉన్నప్పుడు ధ్వజస్తంభం కుడివైపు నుంచి అప్రదక్షిణగా ఆలయంలోకి భక్తులను పంపుతున్నారని శ్రీహరి (హైదరాబాద్‌) చెప్పారు. టీటీడీ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం ఇస్తున్న దాతలను కూడా దర్శనానికి వెళ్లినప్పుడు నెట్టివేస్తున్నారని అశోక్‌ (తిరుపతి) ఆవేదన వ్యక్తం చేశారు. తిరుత్తణిలో గతంలో టీటీడీ కల్యాణ మండపం  ఉండిన స్థలాన్ని చుట్టుపక్కల వారు ఆక్రమిస్తున్నారని నాగరాజు(నగిరి) తెలియజేశారు. ఎస్వీబీసీలో ప్రసారం అవుతున్న యోగదర్శని కార్యక్రమ ఆడియో బాగాలేదని కనకదుర్గ (ఖమ్మం), సుబ్రహ్మణ్యం(హైదరాబాద్‌) తెలిపారు. లడ్డూలో చక్కెర ఎక్కువ ఉంటోందని దశరథ రామయ్య(గుంటూరు), జీఎన్సీ వద్ద కొందరు వ్యక్తులు అన్యమత ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని వెంకటే్‌ష(బెంగళూరు), శ్రీవారి సేవకు డబ్బులు అడుగుతున్నారని సారంగపాణి (వరంగల్‌), కుమార్‌ (ఖమ్మం) ఫిర్యాదు చేశారు. యాదాద్రిలో అభివృద్ధి చేసినట్టు తిరుమలలో కూడా చేయండని వినయ్‌(వరంగల్‌) సూచించారు. కొండపై సిబ్బంది ప్రతిదానికీ డబ్బులు అడుగుతున్నారని రాజే్‌ష(నిజామాబాద్‌), క్యూలైన్‌లో ప్రసాదాలు ఇవ్వడం లేదని బాబ్జి (చేబ్రోలు) ఫిర్యాదు చేశారు. తమ దృష్టికి వచ్చిన సూచనలు, ఫిర్యాదులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని భక్తులకు ఈవో బదులిచ్చారు. 

Updated Date - 2022-09-11T06:31:03+05:30 IST