రూ.1.50 కోట్ల ఎర్రచందనం, వాహనాల స్వాధీనం

ABN , First Publish Date - 2022-10-02T05:15:47+05:30 IST

చిత్తూరు శివారులో పోలీసులు శనివారం ఎర్రచందనం దుంగలను, వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.1.50 కోట్ల ఎర్రచందనం, వాహనాల స్వాధీనం
నిందితులు, ఎర్రచందనం దుంగలు, వాహనాలను మీడియా చూపిస్తున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

- ఎనిమిది మంది అరెస్టు

- మీడియా సమావేశంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడి

చిత్తూరు, అక్టోబరు 1: చిత్తూరు శివారులో పోలీసులు శనివారం ఎర్రచందనం దుంగలను, వాటిని తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో కలిసి ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. రహస్య సమాచారం మేరకు తాలూకా సీఐ మద్దయ్య ఆచ్చారి, ఎస్‌ఐలు రామకృష్ణ, ప్రతాప్‌రెడ్డి సిబ్బంది తో కలిసి శనివారం మురకంబట్టు-చెర్లోపల్లె బైపాస్‌ రోడ్డులో (హయ్యత్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద) వాహనాల తనిఖీ చేపట్టారు. మురకంబట్టు వైపు నుంచి వస్తున్న ఈచర్‌ లారీ, రెండు కార్లు, మోటార్‌ సైకిల్‌ను ఆపారు. జీడీ నెల్లూరు మండలం ఠాణా చెక్‌ పోస్టుకు చెందిన డ్రైవర్‌ గజేంద్ర(36), యాదమరి మండలం కాశిరాళ్లకు చెందిన కేవీ  కిశోర్‌కుమార్‌(37), కుక్కలపల్లెకు చెందిన శివరామ్‌(36), టి.జనార్దన్‌(20), చిత్తూరు కట్టమంచి వినాయకగుడి వీధికి చెందిన నాగరాజు(39), తోటపాళ్యంకు చెందిన లోకేష్‌(39), అరవింద్‌(33),  తవణంపల్లె మండలం చారాలకు చెందిన హరీష్‌ (22)ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల మేరకు.. రూ. 1.20 కోట్ల విలువైన 122 ఎర్రచందనం దుంగలను, రూ.30 లక్షల విలువ చేసే ఈచర్‌ లారీ, మారుతి స్విప్ట్‌, టొయోటో ఎతియాస్‌, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ఎర్రచందనం దుంగలను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

పరారీలో ఉన్న నిందితుడిపై పలు కేసులు

పరారీలో ఉన్న తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన తంజిపై ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో 24 కేసులు నమోదై ఉన్నా యి. గుర్రంకొండ, పెనుమూరు, వాయల్పాడు, గుడిపాల, భాకరాపేట, కేవీపల్లె, తవణంపల్లె, ఎన్‌ఆర్‌పేట, రొంపిచెర్ల, ముదివేడు, మదనపల్లె తాలూకా, ఎస్‌ఆర్‌పురం, ఎర్రావారి పాళ్యం, పూతలపట్టు, చిత్తూరు తాలూకా, చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. త్వరలో తంజిని అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.

Read more