అయ్యా... మేలుపట్ల చెరువును కాపాడండి!

ABN , First Publish Date - 2022-10-01T05:21:44+05:30 IST

మేలుపట్ల చెరువులో భారీగా జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాలని పలమనేరు ఆర్డీవో శివయ్యకు బీజేపీ నేతలు విన్నవించారు.

అయ్యా... మేలుపట్ల చెరువును కాపాడండి!
మేలుపట్ల చెరువును కాపాడాలని ఆర్డీవో శివయ్యకు వినతి చేస్తున్న బీజేపీ నాయకులు

పుంగనూరు, సెప్టెంబరు 30: మేలుపట్ల చెరువులో భారీగా జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాలని పలమనేరు ఆర్డీవో శివయ్యకు బీజేపీ నేతలు విన్నవించారు. శుక్రవారం  తహసీల్దార్‌ కార్యాలయంలో  ప్రధానమంత్రి జన్‌కళ్యాణకారి యోజన రాష్ట్ర అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్‌, బోయకొండ ఆలయ పాలకమండలి మాజీ సభ్యుడు రాజాజెట్టి, నాయకులు గణేశ్‌, మల్లికారాణి, నరసింహులు, బాబు తదితరులు ప్లకార్డులు పట్టుకుని ఆర్డీవో శివయ్యకు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... మేలుపట్ల చెరువు ప్రమాదకరంగా మారిందని, విచ్చలవిడిగా ఎక్స్‌కవేటర్లతో ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి, ఇసుకు తరలిస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ఆయకట్టు రైతులు, మహిళలు, స్థానికులు 6గంటల పాటు ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను చెరువులో అడ్డుకుని ధర్నా, నిరసనలు చేసినా అధికారులు స్పందించ లేదని,  వాల్టా చట్టం   పుంగనూరులో అమలు కావడంలేదన్నారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, ఇసుక, మట్టి మాఫియా చెరువును ధ్వసం చేశారని, తమ చెరువును కాపాడాలని రైతులు ముందుకొచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. దీనికి పరోక్షంగా సహకరిస్తూ ఫిర్యాదులు చేసినా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సామాన్యులపై విరుచుకుపడే అధికారులు మేలుపట్ల చెరువు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇకనైనా చెరువును కాపాడేలా కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌తో మాట్లాడి విచారణ చేయిస్తానని, రెండు రోజుల్లో తానే పరిశీలించి చర్య తీసుకుంటానని ఆర్డీవో తెలిపారు. 


Read more