సర్కారు బడిలో పెచ్చులూడిన స్లాబ్‌

ABN , First Publish Date - 2022-09-08T06:36:38+05:30 IST

తిరుపతి బైరాగిపట్టెడలో ఉన్న ఎంజీఎం నగరపాలక ఉన్నత పాఠశాలలోని ఫిజిక్స్‌ లేబొరేటరీలో స్లాబ్‌ పెచ్చులూడి పడటంతో ఓ విద్యార్థికి తీవ్రగాయాలవగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది.

సర్కారు బడిలో పెచ్చులూడిన స్లాబ్‌
తరగతి గదిలో స్లాబ్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు

ఓ విద్యార్థికి తీవ్రగాయాలు

స్వల్పంగా గాయపడ్డ మరో ముగ్గురు


తిరుపతి(విద్య), సెప్టెంబరు 7: తిరుపతి బైరాగిపట్టెడలో ఉన్న ఎంజీఎం నగరపాలక ఉన్నత పాఠశాలలోని ఫిజిక్స్‌ లేబొరేటరీలో స్లాబ్‌ పెచ్చులూడి పడటంతో ఓ విద్యార్థికి తీవ్రగాయాలవగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. అక్కడి టీచర్ల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్కూల్‌లో తొమ్మిదో తరగతి బీ సెక్షన్‌ చదివే విద్యార్థులకు ఉదయం సెషన్‌లో ఫిజిక్స్‌ లేబొరేటరీలో తరగతులు నిర్వహించారు. ఇంటర్వెల్‌లో విద్యార్థులందరూ బయటకు వెళ్లగా.. జశ్వంత్‌(14), తేజ్‌ప్రభావ్‌, సంతోష్‌, మోహిత్‌కుమార్‌ అనే నలుగురు విద్యార్థులు తరగతి గదిలోనే కూర్చొని నోట్సు రాసుకుంటున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి స్లాబ్‌ పెచ్చులూడి వీరిపై పడింది. జశ్వంత్‌ తీవ్రంగా, మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అక్కడున్న ఉపాధ్యాయులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని స్విమ్స్‌కు తరలించారు. స్వల్ప గాయాలైన వారికి స్కూల్‌లోనే ప్రాథమిక వైద్యసేవలు అందించారు. సమాచారం అందుకున్న కార్పొరేషన్‌ కమిషనర్‌ అనుపమ అంజలి, డీఈవో శేఖర్‌లు పాఠశాలకొచ్చి పరిస్థితిని సమీక్షించారు. 


ప్రాణాపాయం తప్పిందంటున్న వైద్యులు


 విద్యార్థి జశ్వంత్‌ తలకు  బలమైన గాయమైనట్టు గుర్తించిన స్విమ్స్‌ వైద్యులు వెంటనే ఈడీహెచ్‌ (ఎన్‌ ఎపిడ్యూరల్‌ హెమటోమా) సర్జరీ చేశారు. అనంతరం న్యూరోసర్జరీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. కానీ విద్యార్థి బాగా భయపడి పోయాడని.. చికిత్సకు కూడా చాలా సమయం సహకరించలేదని తెలిపారు. జశ్వంత్‌ను కమిషనర్‌ అనుపమ అంజలి పరామర్శించారు. ఈ పరిస్థితికి పాఠశాల సిబ్బందే కారణమని ఆ విద్యార్థి కుటుంబీకులు కమిషనర్‌ ఎదుట వాపోయారు. 


‘నాడు-నేడు’ స్కూళ్లు భద్రమేనా?

తిరుపతి ఎంజీఎం పాఠశాల ఘటనతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు

పెనుప్రమాదాన్ని తప్పించిన ఇంటర్వెల్‌


మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు-నేడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని ఊదరగొట్టింది. అయితే బుధవారం తిరుపతి బైరాగిపట్టెడలోని ఎంజీఎం స్కూల్‌ ఘటన చూస్తుంటే తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగిస్తోంది. తరగతి గది పైకప్పు పెచ్చులూడి కింద పడడంతో ఓ విద్యార్థికి తీవ్రగాయంతోపాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం ఇంటర్వెల్‌ సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి పెనుప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 


కొరవడిన పర్యవేక్షణ


తిరుపతి అర్బన్‌లో నాడు-నేడు కింద తొలిదశలో 16 మున్సిపల్‌ హైస్కూల్స్‌, నాలుగు జడ్పీ, మండల స్కూళ్లు,  ఒక్కొక్కటి చొప్పున బాలికల హైస్కూల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ మొత్తం 22 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో తొమ్మిది రకాల వసతుల కోసం రూ.7.30కోట్లు వెచ్చించారు. అదేవిధంగా నాడు-నేడు రెండో దశలో 40 స్కూళ్లు ఎంపిక చేశారు. వీటిలో 25 మున్సిపల్‌ స్కూల్స్‌ ఉండగా పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఎంజీఎం స్కూల్లో పెచ్చులూడిన తరగతి గదిని తొలి దశ నాడు-నేడులో పూర్తిచేశారు. దాదాపు రూ.45లక్షల బడ్జెట్‌ను ఈస్కూలుకు విడుదలచేస్తే, చిన్న చిన్న సివిల్‌ పనులకే సుమారు రూ.16లక్షలు కేటాయించారు. పనులను పేరెంట్స్‌ కమిటీకి అప్పగించారు. దాంతో అనుభవంలేని కాంట్రాక్టర్లు చొరబడి పనులు చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే నాసిరకంగా పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 


నివేదిక ఇవ్వండి : కమిషనర్‌ 


ఎంజీఎం పాఠశాలను ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి నగరపాలక సంస్థ కమిషనర్‌ అనుపమ అంజలి పరిశీలించారు. స్కూల్లోని ఇతర తరగతి గదులనూ తనిఖీ చేశారు. స్లాబ్‌ ఎందుకు పెచ్చులూడిందో నివేదిక ఇవ్వాలని, అలాగే నాడు-నేడు కింద పనులు జరిగిన ఇతర భవనాలపై కూడా తమకు స్పష్టతకావాలని అధికారులను ఆదేశించారు. అలాగే టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహయాదవ్‌, హేమంత్‌ రాయల్‌ తదితరులు కూడా పాఠశాల భవనాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన నాసిరకం పనుల వల్లే  ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-08T06:36:38+05:30 IST