పులికాట్‌ను గుల్ల చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-08T06:43:32+05:30 IST

స్మగ్లర్ల ఖజానాగా మారింది తిరుపతి జిల్లా. ఎర్రచందనం మొదలు వానపాముల దాకా ప్రతిదీ దొంగరవాణాతో కోట్లు పండిస్తోంది. నవరత్నాలతో మురిసిపోతున్న ప్రభుత్వం దొంగదారుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

పులికాట్‌ను గుల్ల చేస్తున్నారు
- పులికాట్‌ ఒడ్డున గుట్టగా పోసి ఉన్న సున్నపుగుల్ల

 భారీగా సాగుతున్న నత్తగుల్ల స్మగ్లింగ్‌


స్మగ్లర్ల ఖజానాగా మారింది తిరుపతి జిల్లా. ఎర్రచందనం మొదలు వానపాముల దాకా ప్రతిదీ దొంగరవాణాతో కోట్లు పండిస్తోంది. నవరత్నాలతో మురిసిపోతున్న ప్రభుత్వం దొంగదారుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సర్వం స్వాహా అవుతోంది. తాజాగా పులికాట్‌ సరస్సులోనూ, బకింగ్‌హామ్‌ కాలువలోనూ విస్తారంగా లభించే సున్నపు నత్తగుల్లను తవ్వి తరలించేస్తున్నారు. పట్టపగలే టన్నులకు టన్నులు తరలిస్తూ పులికాట్‌ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నా పట్టించుకునే వాళ్లే లేరు. 


తడ: 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండే పులికాట్‌ సరస్సులోనూ, దానికి సమాంతరంగా కాకినాడ నుంచి చెన్నైదాకా ఉండే బకింగ్‌హామ్‌ కెనాల్‌లోనూ నాణ్యమైన సున్నపుగుల్ల, వానపాములు విస్తారంగా ఉంటాయి. సాధారణంగా సముద్రతీరాల్లోనే సున్నపు నత్తగుల్ల లభిస్తుంది. అయితే బంగాళాఖాతంలో కలిసి ఉండడం వల్ల పులికాట్‌ సరస్సులోనూ గుల్ల లభిస్తోంది. అదేవిధంగా పులికాట్‌తో అనుసంధానమై ఉండే బకింగ్‌హామ్‌ కెనాల్‌లోనూ గుల్ల దొరుకుతోంది. ఇందుకు ప్రధాన కారణం సముద్ర జలాలు పులికాట్‌లోకీ, అక్కడి నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌లోకీ ప్రవేశిస్తుండడమే. ఒకప్పుడు స్థానిక అవసరాలకు మాత్రమే దీనిని వినియోగించేవారు. ఈ గుల్లతో సున్నం చేసుకుని ఇళ్లకు వేసుకునేవారు. పులికాట్‌ పట్టపుపాళేల వారే వీటిని సేకరించి.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో విక్రయించేవారు. సంక్రాంతి నెలలోనే ఎక్కువగా అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా స్మగ్లర్ల కన్ను గుల్లపై పడింది. ఇందుకు కారణం సున్నపు నత్త గుల్ల మాంసాన్ని రొయ్యల చెరువుల్లో దాణాగా వినియోగిస్తుండడమే. 

తడ మండలం వేనాడు, వాటంబేడు, ఇరకం, తడ, వాకాడు మండలం రాయదొరువు ప్రాంతాలతోపాటు తమిళనాడు పరిఽధిలోకి వచ్చే సున్నాంబకులం, పలవర్‌కాడు ప్రాంతాలలో కూడా సున్నపుగుల్లను కూలీలు సేకరిస్తారు. వీటిని పడవల ద్వారా తమిళనాడు సున్నాంబకులంలోని సున్నపుగుల్లను పొడిగా మార్చే పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడ గుల్లను పొడిచేసి, ప్రత్యేక గోతాలలో ప్యాక్‌ చేస్తారు. విజయవాడ, పిడుగురాళ్ల, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని మధురై ప్రాంతాలకు తరలిస్తారు. సున్నపు గుల్లను సున్నాంబకులంకు తరలించేందుకు  తడ మండలంలో  ప్రత్యేకంగా రెండు పడవలను వినియోగిస్తారు. రోజుకు ఒక టన్ను గుల్ల తరలివెళ్తుందని అంచనా. 


‘‘లోతు ఎక్కువగా ఉండని విశాలమైన ఉప్పునీటి సరస్సు పులికాట్‌. ఇక్కడ మూడు నాలుగు అడుగుల లోతులోని మట్టిలో నత్తలుంటాయి. మట్టితో సహా వీటిని బయటకు తీస్తారు. ప్రత్యేక జల్లెడలను ఉపయోగించి వీటిని మట్టి నుంచి వేరు చేస్తారు. గుల్ల నుంచి నత్తను వేరు చేసి మాంసం తీస్తారు. గుల్లను కాల్చి సున్నంగా మారుస్తారు. నత్త మాంసాన్నీ, గుల్లనూ కూడా కోళ్ల ఫారాల్లోనూ, రొయ్యల చెరువుల్లోనూ మేతగా వినియోగిస్తారు. పేపర్‌ పరిశ్రమల్లోనూ గుల్ల పొడిని వినియోగిస్తారు.’’

 

బకింగ్‌హామ్‌ కెనాల్‌ను కొల్లగొడుతున్నారు


కోట: బకింగ్‌హామ్‌ కెనాల్‌ను కూడా స్మగ్లర్లు గుల్ల చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చిల్లకూరు మండలం తమ్మినపట్టణం నుంచి కోట మండలం గోవిందపల్లిపాళెం మీదుగా వాకాడు మండలం పూడిరాయదొరువు వద్ద వరకు బకింగ్‌హామ్‌ కెనాల్‌ 45 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. పూడిరాయదొరువు నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌ పులికాట్‌ సరస్సులో కలిసిపోతుంది. కోట మండలం గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం గ్రామాల సమీపంలో గుల్ల్లను కూలీలతో బయటకు తీయిస్తున్నారు. మినీలారీలు, వ్యాన్‌లలో గుట్టుచప్పుడు కాకుండా ప్రకాశంజిల్లా చీమకుర్తితోపాటు బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తున్నారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌ సమీపంలోని కొన్ని రహస్యప్రాంతాలలో  నత్తగుల్ల నుంచి మాంసం తీస్తారు. ఆ మాంసాన్ని టన్నుల లెక్కన మినీవ్యాన్‌లలో నెల్లూరుతోపాటు పుదుచ్చేరి, బెంగళూరు, చెన్నైలోని పలు ప్రాంతాలకు తరలిస్తారు. రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు, హేచరీల్లోని రొయ్యపిల్లలకు ఆహారంగా వీటిని వినియోగిస్తారు. నత్తగుల్ల నుంచి కిలో మాంసం తీస్తే కూలీకి 120 రూపాయలు ఇస్తారు. బయటి ప్రాంతంలో దీనిని రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తారు. మాంసం తీసేసిన గుల్లను సున్నం తయారీకి వాడతారు. ఇక్కడ గంప గుల్ల 100 రూపాయలు పలుకుతుంది. 


Read more