-
-
Home » Andhra Pradesh » Chittoor » Protest against NTR name change of Health University-NGTS-AndhraPradesh
-
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై నిరసన దీక్ష
ABN , First Publish Date - 2022-10-01T06:46:02+05:30 IST
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం పలమనేరులో టీడీపీ ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మార్కెట్ కమిటీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక దీక్షలో కూర్చున్నారు.

పలమనేరు, సెప్టెంబరు 30: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం పలమనేరులో టీడీపీ ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మార్కెట్ కమిటీ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు మార్పును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని పనిని.. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. వైఎస్ డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామంటున్న మంత్రి రజని.. ఏ ఆరోగ్య పట్టా ఉందని ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు మార్పును షర్మిల తప్పని చెబుతుంటే.. ఎన్టీఆర్ భార్య అని చెప్పుకొనే ఒక నీచమైన వ్యక్తి సమర్థించడం దారుణమన్నారు. ఇలాంటి వారు బతికేందుకు అర్హులు కాదన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పును ప్రశ్నించలేని నేతలు వైసీపీలో కొనసాగే కంటే చావడం మేలన్నారు. ‘ఇలాగైతే భవిష్యత్తులో మేమేం చేయాలి. వైఎస్సార్ విగ్రహాలను బంగాళాఖాతంలో కలపమంటారా? అయినా, అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు ఆందోళన కొనసాగిస్తాం’ అని చెప్పారు. దీక్ష అనంతరం సాయంత్రం మళ్లీ అమర్ ప్రసంగించారు. ఎన్టీఆర్ పేరును తిరిగి పెట్టేవరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన దీక్షలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంతకాల సేకరణ ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఈ దీక్షలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.