పిల్లల్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2022-04-10T06:35:21+05:30 IST

పలమనేరులో గత నెలలో జరిగిన పదోతరగతి విద్యార్ధిని మిస్బా ఆత్మహత్య అందరినీ కలచివేసింది.

పిల్లల్ని కాపాడుకుందాం

తూనీగల్లా ఎగురుతూ, సీతాకోకచిలుకల్లా కళకళలాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ 

ఆడుతూ ఆనందంగా గడపాల్సిన పిల్లలు ఎందుకిలా మారిపోతున్నారు? ఎండకు వాడిన 

పూలలా ఎందుకు వాలిపోతున్నారు?చిన్న విషయాలకే రెచ్చిపోతున్నారెందుకు? మందలిస్తే  

చావును  ఎందుకు ఆశ్రయిస్తున్నారు?  తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇటీవల జరుగుతున్న 

సంఘటనలు రేపుతున్న ప్రశ్నలివి. కొవిడ్‌ తర్వాత పిల్లల శారీరక, మానసిక స్థితిలో వచ్చిన మార్పులను 

అర్థం చేసుకోలేకపోతున్నామా? కొవిడ్‌ కాలపు చదువులు చేస్తున్న చేటును కనిపెట్టలేకపోతున్నామా? 

ఆన్‌లైన్‌ పేరుతో పిల్లల అరచేతిలోకి వచ్చిన మొబైల్‌ సృష్టిస్తున్న  మానసిక కల్లోలతుఫాన్‌ను 

పసిగట్టలేకపోయామా? ఇంటర్నెట్‌ ప్రపంచం పెద్దలకూ పిల్లలకూ నడుమ అగాధాన్ని పెంచుతోందా? 


ఈ సందేహాలకు కొందరు నిపుణుల సమాధానాలు ఈ ఆదివారం ప్రత్యేకం. 


పిల్లల్లో పెరిగిన శారీరక సమస్యలు

మానసిక ఆందోళనలో టీనేజి పిల్లలు

మొరటుగా వ్యవహరిస్తున్న టీచర్లు, తల్లిదండ్రులు

డిప్రెషన్‌తో చావును వెతుక్కుంటున్న పిల్లలు


తిరుపతి సిటీ/నేరవిభాగం, ఏప్రిల్‌ 9: పలమనేరులో గత నెలలో జరిగిన పదోతరగతి విద్యార్ధిని మిస్బా ఆత్మహత్య అందరినీ కలచివేసింది. చదువుతో ముడిపడిన ఆందోళన ప్రాణస్నేహితుల మధ్యే  పెను అగాధంగా మారింది. ఈ పరిస్థితిని గమనించి సున్నితంగా సరిదిద్దాల్సిన స్థానంలో ఉండే గురువులు, తల్లిదండ్రులు కూడా సకాలంలో సరైన పద్ధతిలో స్పందించలేకపోయారు. అసలీ అంశం మరణం దాకా దారి తీస్తుందనే ఊహించలేకపోయారు. మిస్బా, ఆమె స్నేహితురాలు..ఇద్దరూ మానసిక కుంగుబాటుకు గురైన స్థితిని వెంటనే గుర్తించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. తనకు అండగా ఎవరూ లేరన్న ఒంటరితనపు మానసిక స్థితి ప్రమాదకరమైనది. ఈ స్థితిలో ఉన్నవారితో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలో తెలియకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని మిస్బా సంఘటన నిరూపించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇటీవల జరుగుతున్న అనేక సంఘటనలు సమాజానికే సవాలుగా మారుతున్నాయి. కొవిడ్‌ కాలంలో  పిల్లలకు ఆన్‌లైన్‌ చదువులు ఎంత అర్థమయ్యాయో తెలీదు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో వారిలో ఆందోళన పెరుగుతోంది. ఈ సమయంలో స్కూళ్లు, కాలేజీల నుంచీ, తల్లిదండ్రులు బంధుమిత్రుల నుంచీ ఒత్తిడి పెరిగితే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. దీన్ని గ్రహించకపోవడం వల్ల అనర్థం జరుగుతోందని నిపుణులు అంటున్నారు. 


ఆన్‌లైన్‌ అనర్థం : ఆన్‌లైన్‌ చదువుల వల్ల పిల్లలకు అనివార్యంగా మొబైల్‌ ఇవ్వాల్సి వచ్చింది. ఇంటర్నెట్‌ అవసరం ఏర్పడింది. ఇది పాఠాలకే పరిమితం కాదు. నిరంతర నిఘా అసాధ్యం. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివాటిల్లో పిల్లలు కుటుంబ సభ్యులతోనో, మిత్రులతోనో సరదాగా మొదలుపెట్టిన చాటింగ్‌లు ఒక దశదాటాక పరిచయం లేని కొత్త వారితోనూ కొనసాగాయి. మెయిల్‌, సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఏర్పడిన పరిచయాలు ఒక్కోసారి ఎక్కడికో దారితీస్తున్నాయి. నకిలీ పేర్లతో, అబద్ధపు వ్యక్తిగత సమాచారంతో కొందరేమో ఆడపిల్లలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. కట్‌, పేస్ట్‌ మెసేజిలతో, రీల్స్‌ షేరింగులతో అన్‌లైన్‌ బంధం ఏర్పడుతోంది. వీటిని ఏదో ఒక దశలో తల్లిదండ్రులో,టీచర్లో గుర్తించి అడ్డుకోవడానికి ప్రయత్నించినపుడు పిల్లలు వేదనకు గురవుతున్నారు. తిరగబడుతున్నారు. తల్లిదండ్రులు కూడా కోపంతో కొట్టడమో, తిట్టడమో చేస్తుండడంతో పెద్ద అగాధం ఏర్పడుతోంది.ఇంట్లో వాళ్లతో మాట్లాడడం కూ డా తగ్గించేస్తున్నారు.కుటుంబసభ్యులతో గాకుండా విడిగా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం తమమీద కక్షగట్టిందని నమ్ముతున్నారు. ఇంట్లో వేధింపులు భరించలేకపోతున్నామని అపరిచితులతో చాటింగుల్లో బాధను పంచుకుంటున్నారు.పరిస్థితి చేయిదాటిందని తల్లిదండ్రులు కోప్పడితే, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. ఒక్కోసారి చచ్చిపోతున్నారు. ప్రేమలు, చదువులు, స్నేహాలు.. టీనేజ్‌ పిల్లల్లో భావోద్వేగాలకు కారణాలవుతున్నాయి. 


మానసిక మారణహోమం


సెల్‌ఫోను ఎక్కువసేపు చూడొద్దని తల్లి మందలించిందనే కారణంతో, ఇంటర్‌ విద్యార్థి ఇంట్లోనే గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గత నెల 4న తిరుపతిలోని కొర్లగుంటలో చోటుచేసుకుంది.

చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న కడప ప్రకాశంనగర్‌కు చెందిన వాసంతి (17)నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అధ్యాపకులు తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన కళాశాలకు వచ్చారు. తండ్రి ఆమెను కలిసేలోపే ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది.గతేడాది డిసెంబరులో ఈ సంఘటన జరిగింది.

తిరుపతి  ఎస్పీడబ్ల్యు జూనియర్‌ కళాశాలలో  ఓ విద్యార్థిని గత వారం ఆత్మహత్య చేసుకుంది. కేవీపల్లె మండలం మొగల్రాజుపల్లెకు చెందిన విష్ణుప్రియ (17) తల్లిదండ్రులు సరస్వతి, చిన్నరెడ్డెప్ప బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లారు.విష్ణుప్రియ తిరుపతి ఎస్పీడబ్ల్యు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉండేది.వేరే కులానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో మనస్తాపం చెందింది.సహ విద్యార్థులందరూ భోజనానికి వెళ్లిన సమయంలో రూములో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో వెతికిన పోలీసులకు తనపేరు, ప్రేమికుడి పేరుతో తనే రాసుకున్న పెళ్లిపత్రికలు లభించాయి.

ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందనే మనస్తాపంతో ఓ విద్యార్థి తిరుపతిలోని బీసీ హాస్టల్‌ ఐదో అంతస్తు నుంచి దూకి గత వారం ఆత్మహత్య చేసుకున్నాడు.పుంగనూరు మండలం భీమగాని పల్లెకు చెందిన విశ్వనాథ్‌, రేణుక దంపతుల ఏకైక కుమారుడు నాగేంద్రబాబు (20) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ అమరావతీనగర్‌లోని బీసీ వెల్ఫేర్‌ హాస్టల్లో ఉండేవాడు.సహ విద్యార్థినితో ప్రేమలో పడ్డ నాగేంద్రబాబు ఆమె అభిప్రాయ బేధాల కారణంగా దూరమవడం భరించలేకపోయాడు.హాస్టల్‌ భవనం ఐదో అంతస్థునుంచి కిందకు దూకి మృతిచెందాడు.


ఏం చేయాలి?


ఇది పరీక్షల కాలం.. పిల్లల్ని చదవండి అంటూ మరీ వెంటబడి వేధించవద్దు. వారితో ఎక్కువ సమయం తల్లిదండ్రులు గడపాలి. స్నేహంగా ఉండాలి. ప్రేమను పంచాలి. ఫ పిల్లల్లో శారీరకంగా వస్తున్న మార్పులు గుర్తించాలి. ఆన్‌లైన్‌ చదువుల వల్ల మంచం దిగడం లేదు. వ్యాయామం లేక అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కొవిడ్‌కి గురైన పిల్లల్లో మరీ ఎక్కువ ఉంటున్నాయి. విపరీతంగా తినడం, లావు అయిపోవడం జరుగుతోంది. చిన్నవాటికీ విసుక్కుంటున్నారు. తల్లిదండ్రులు ఈ లక్షణాలు గమనించి వైద్యుల సాయం తీసుకోవాలి. ఫ మొరటుగా పిల్లల జంక్‌ఫుడ్‌ను ఆపేయడం గాక, నెమ్మదిగా వారికి నచ్చేలా ఇంట్లో వండి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం అందివ్వాలి. ఫ పిల్లలు మరీ ఒంటరిగా ఉండకుండా చూడండిఫ అవసరమైతే మానసిక నిపుణుల వద్దకు కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్లండి.


చదువు పేరుతో భయపెట్టకండి!


 టెన్త్‌, ఇంటర్‌ చదివే పిల్లల్ని పెద్దలు పలకరించే తీరు మారాలి. పుస్తకం చేతిలో లేకుండా కనిపిస్తేనో, టీవీ ముందు ఉంటేనో వెంటనే ‘పరీక్షలు పెట్టుకుని ఇదేమిటి.. భయం లేదా?’ అని  తీవ్ర స్వరంతో అరుస్తారు. మందలించడం, హెచ్చరించడం అని పెద్దలు అనుకుంటారు. కానీ అది పరీక్షల మీద పిల్లల్లో భయాన్ని పెంచుతుంది. వారికి చదువు ప్రాముఖ్యత, దాని వలన వచ్చే ప్రయోజనాలను వివరిస్తే చాలు వారే చదువుపై శ్రద్ధ పెడతారు. ఇందుకు ఓపికగా వ్యవహరించాలి తల్లిదండ్రులు. పరీక్షలపై ఉన్న భయాన్ని మొదట వారిలో  పోగొట్టాలి. ఒత్తిడి లేనపుడే చదివినదాన్ని అర్థం చేసుకోగలుగుతారు. 

- వంశీరాజు, జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఎం.ఆర్‌.పల్లె,తిరుపతితల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌


మనసెరిగి వ్యవహరించాలి! 


అసలే ఇది పరీక్షల సమయం. ప్రతీ విద్యార్థి లోపల భయంతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమయంలో వారిని మరింత ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి. మెల్లగా మంచి చెడులను వివరించాలి. వారు మానసికంగా ఏవైనా సమస్యలను  ఎదుర్కొంటున్నారేమో గుర్తించాలి.పెత్తనంతో కాకుండా, స్నేహంతో వ్యవహరించాలి.  చదువుకోవడం వలన భవిష్యత్తు ఎలా ఉంటుందో వారికి సున్నితంగా వివరిస్తూనే, వారి కోసం తల్లిదండ్రులుగా మీరు పడుతున్న కష్టాన్ని, వారిపై ఉన్న ప్రేమను తెలియజెప్పాలి. అప్పుడే వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు.

- డాక్టర్‌ మానస, మానసిక వైద్య నిపుణురాలు, రుయాస్పత్రి,తిరుపతి


నెల రోజులుగా నేను అనేక బడుల్లో పిల్లల్ని కలుస్తున్నాను. 


ఈ రెండేళ్ల కాలం వాళ్ల మీద ఎంత దుర్మార్గమైన ప్రభావం చూపిందో అర్థమవుతోంది. మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా ఆడపిల్లలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పీరియడ్స్‌ సకాలంలో రాకపోవడం, డయాబెటిక్‌ కావడం, థైరాయిడ్‌ పెరగడం, పీసీవోడీ వంటివి చాలా మందిలో కనిపిస్తున్నాయి. పిల్లలు డిప్రెషన్‌కి గురవుతున్నారు. వారి ప్రవర్తన విపరీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు దీన్ని ఆరోగ్యసమస్యగా గుర్తించక మొరటుగా వ్యవహరించినపుడు పిల్లలు బాగా ఆందోళన చెందుతున్నారు. అవి మరణాల దాకా వెళ్తున్నాయి. ఇది గతంలో మనం ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితి. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ అవసరం. ప్రతి బడిలో, కాలేజీలో వారంలో ఒక్కరోజు అయినా సాయంత్రం రెండు గంటలపాటు సైకాలజి్‌స్టలు, ఆనుభవజ్ఞులైన టీచర్లతో పిల్లల్ని మాట్లాడించాలి. వారి సమస్యలు విని కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. 

- డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతి, ఫిజీషియన్‌, తిరుపతి

Updated Date - 2022-04-10T06:35:21+05:30 IST