మైదానంలోని మెలకువలతో వృత్తిలో రాణింపు

ABN , First Publish Date - 2022-02-16T07:26:26+05:30 IST

క్రీడా మైదానంలో నేర్చుకున్న మెలకువలతో వృత్తిలో మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (డీఎండీ) ఓంప్రకాష్‌ మిశ్రా అన్నారు.

మైదానంలోని మెలకువలతో వృత్తిలో రాణింపు
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఓంప్రకాష్‌ మిశ్రా - గెలుపొందిన అమరావతి సర్కిల్‌ జట్టు

ఎస్బీఐ ఉద్యోగుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో డీఎండీ ఓంప్రకాష్‌ మిశ్రా 


తిరుపతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): క్రీడా మైదానంలో నేర్చుకున్న మెలకువలతో వృత్తిలో మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (డీఎండీ) ఓంప్రకాష్‌ మిశ్రా అన్నారు. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్‌ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్‌ సర్కిల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ మంగళవారం ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిశ్రా మాట్లాడుతూ.. సమూహంగా ఆడే ఏ క్రీడలోనైనా సమష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందన్నారు. క్రీడాకారుడిగా మైదానంలో నేర్చుకున్న మెలకువలతో యుద్ధరంగంలో విజయం సాధించానని..నెపోలియన్‌ను ఓడించిన డ్యూక్‌ రాజు చెప్పారంటూ గుర్తుచేశారు. బ్యాంకింగ్‌ రంగంలోనూ ఇదే వర్తిస్తుందన్నారు. కబడ్డీ టోర్నీలో పాల్గొనేవారందరూ ఎస్బీఐ కుటుంబ సభ్యులేనని, ఎవరు గెలిచినా క్రీడా స్ఫూర్తిని నింపుకోవాలని సూచించారు. ఎస్బీఐ అమరావతి సర్కిల్‌ చీఫ్‌ మేనేజర్‌ సంజయ్‌ సహాయ్‌ మాట్లాడుతూ.. తిరుపతి పుణ్యక్షేత్రంలో టోర్నమెంట్‌ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముంబై కార్పొరేట్‌ ఆఫీస్‌ జీఎం సంజయ్‌ ప్రకాష్‌, ఏఐఎ్‌సబీఐవోఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సౌమ్యదత్త, ఏఐఎ్‌సబీఐఎ్‌సఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ బండ్లీష్‌, ఉద్యోగ సంఘనేతలు కిషోర్‌ కుమార్‌, కిరణ్‌కుమార్‌ రెడ్డి, సూర్యకుమార్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస కల్యాణం నృత్యరూపకం అలరించింది. 


అమరావతి జట్టు విజయం 

తిరుపతి(కొర్లగుంట): ఎస్వీయూ మైదానంలో మంగళవారం సాయంత్రం ఎస్బీఐ ఉద్యోగుల ఆలిండియా కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించగా ఛండీఘర్‌పై పాట్నా జట్టు.. కోల్‌కత్తాపై అమరావతి.. బెంగళూరుపై ఢిల్లీ.. భోపాల్‌పై జైపూర్‌ జట్లు గెలుపొందాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 13 రాష్ట్రాల నుంచి 13 జట్లు వచ్చాయి. 

Read more