గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-09T06:56:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దీన్ని గుర్తించి లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం: కలెక్టర్‌
జక్కిదొనలో గృహ నిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

వెదురుకుప్పం, జూన్‌ 8: రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దీన్ని గుర్తించి లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వెదురుకుప్పం మండలంలోని జక్కిదొనలో గృహ నిర్మాణాలను పరిశీలించారు. గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదని, ప్రస్తుతం అవి తొలగిపోవడం వల్ల పనులు వేగంగా చేస్తున్నామని లబ్ధిదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గృహ నిర్మాణాలకు నీటి వసతి కోసం బోరు వేశారని, కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు గిట్టుబాటు అయ్యేలా చూడాలని, అదే సమయంలో చేపట్టే పనులు పది మందికి ఉపయోగపడేలా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. జక్కిదొన నుంచి నాలుగు గ్రామాలకు సంబంధించిన చెరువులకు వెళ్లే సప్లయ్‌ చానల్‌ పనులను పరిశీలించారు. తహసీల్దార్‌ పుల్లారెడ్డి, ఎంపీడీవో సుధాకర్‌రావు, ఏపీవో ఇందు, హౌసింగ్‌ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ ఏఈ మురళి ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2022-06-09T06:56:54+05:30 IST