సోమవారోత్సవానికి పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2022-09-20T05:12:00+05:30 IST

రామకుప్పం పట్టణ శివార్లలోనివళ్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్షిక మూడో సోమవారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు

సోమవారోత్సవానికి పోటెత్తిన జనం
ఆలయం వద్ద భక్త జన సందోహం

రామకుప్పం, సెప్టెంబరు 19:  పట్టణ శివార్లలోని వళ్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్షిక మూడో సోమవారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. అనంతరం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్ల ప్రాకారోత్సవం నిర్వహించారు. ఉదయం 6 నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కులమతాలకు అతీతంగా ఎప్పటిలాగే జనం ఆలయానికి చేరుకుని క్యూలైన్‌లో వేచిఉండి స్వామివారిని దర్శించుకున్నారు.  కళ్లు, చెవులకు సంబంధించి దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు స్వామివారికి  వెండి కళ్లు, చెవులు, నాగపడిగలను హుండీలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో ఈశ్యాన్య దిక్కులో ఉన్న రావి, వేప వృక్షాలకు పూజలు చేసి సంతానం కోసం జోలెలు కట్టారు.  కొందరు భక్తులు వీపు తేర్లు సమర్పించగా మరికొందరు దవడలకు శూలాలు, శరీరానికి నిమ్మకాయలు గుచ్చుకుని వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో నాగుల ముద్దమ్మ, శనీశ్వర, పద్మావతి, వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయం వద్ద  పండరి భజనలు, హరికథ, భక్తి గీతాలాపన కార్యక్రమాలు  విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో కుప్పం రూరల్‌ పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Read more