ఒక్క క్షణం చాలు స్వామీ!

ABN , First Publish Date - 2022-04-24T08:37:42+05:30 IST

ఒక్క క్షణం చాలు స్వామీ! కనులారా దర్శించుకుంటాం. మదినిండా నీ రూపు నింపుకుంటాం’’ అంటూ వేడుకుంటారు తిరుమల కొండకు వచ్చే భక్తులు.

ఒక్క క్షణం చాలు స్వామీ!

రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ

ఏ విధానం అమలుచేయాలని సతమతమవుతున్న టీటీడీ


తిరుమల, ఆంధ్రజ్యోతి: ‘‘రెప్ప తెరిచి వాల్చే ఆ ఒక్క క్షణం చాలు స్వామీ! కనులారా దర్శించుకుంటాం.  మదినిండా నీ రూపు నింపుకుంటాం’’  అంటూ వేడుకుంటారు తిరుమల కొండకు వచ్చే భక్తులు.   అయితే కోరుకున్నంత సులువు కాదు స్వామి దర్శనం. ఒక్క నిముషకాలమైనా స్వామి దర్శనం కల్పించడం పెద్ద సవాలుగా మారుతోంది తిరుమల తిరుపతి దేవస్థానాలకు.  తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడాది పెరిగిపోతూనే ఉండడం అందుకు కారణం.లాగేయకుండా, నెట్టేయకుండా, తొక్కిసలాటకు తావు లేకుండా ప్రతి భక్తుడూ, భక్తురాలూ స్వామిని దర్శించుకునేలా ఏర్పాటు చేయడానికి టీటీడీ నిరంతరం రకరకాల ప్రణాళికలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కొవిడ్‌ నిబంధనలు సడలించిన తర్వాత విపరీతంగా పెరిగిన భక్తుల సంఖ్య తాజాగా టీటీడీని కలవరపెడుతోంది. ఇటీవల తిరుపతిలో క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాట మరోమారు దర్శనాలను చర్చకు తెచ్చింది. ఈ నేపథ్యంలో.. తిరుమల దర్శనాల చరిత్రనూ, పెరుగుతున్న సవాళ్లనూ, అధికారుల ప్రణాళికలనూ, అమలులో ఎదురవుతున్న అవరోధాలనూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంగా అందిస్తోంది. నేత్రద్వార దర్శనం

దర్శనాల ఒత్తిడి వల్ల కాలక్రమంలో భక్తులకూ భగవంతుడికీ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. స్వామికి వరపడి వచ్చే భక్తులు అసంఖ్యాకంగా వుండడంతో అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించడంపై ఎప్పటికప్పుడు కసరత్తు జరుగుతూనే ఉంది. ప్రతిసారీ నేత్రద్వార దర్శనం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. 2006లో టీటీడీకి అడ్వైజర్‌గా ఉన్న పీవీఆర్కే ప్రసాద్‌ రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని సలహాలను టీటీడీకి అందజేశారు. అందులో  నేత్రద్వార దర్శనం విధానం ముఖ్యమైనది. అదేంటంటే ‘మహాద్వారాన్ని వదిలేసి, కుడివైపు ఓ ద్వారం, ఎడమవైపు మరో ద్వారాన్ని ఏర్పాటు చేసి ఓ ద్వారం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలి. తర్వాత గర్భాలయంలోని కొలువులో ఎడమవైపు మరో ద్వారాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకుని కొలువుమండపంలోని ఈ మార్గం ద్వారా వైకుంఠ ద్వారం ముందు నుంచి వెలుపలకు వస్తారు. ఆ తర్వాత ప్రదక్షిణగా హుండీలో కానుకలు సమర్పించి మహాద్వారం ఎడమవైపు వద్ద ఏర్పాటు చేసే మార్గం నుంచి పూర్తిగా వెలుపలకు వస్తారు’. ఈ విధానం పూర్తిగా వన్‌వే ట్రాఫిక్‌గా మారుతుంది. తద్వారా రోజుకు దాదాపు 2.50 లక్షల మందికి వరకు దర్శనం చేయించవచ్చని పీవీఆర్కే ప్రసాద్‌ అంచనా వేసి టీటీడీకి సూచించారు. అయితే ఆలయంలో వివిధ ప్రదేశాల్లో ద్వారాలు ఏర్పాటు చేయడం అనే దానిమీద వ్యతిరేకత వచ్చింది. ఆగమాలు అడ్డురావడంతో నేత్రద్వార దర్శనం చర్చలకే పరిమితమైంది. 
వర్చువల్‌ క్యూలైన్‌

నిర్దేశిత సమయం కేటాయించడం వల్ల దర్శనానికి గంటల తరబడి, రోజుల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదని టీటీడీ భావించింది. దీంతో 2009 నాటికే పెయిడ్‌ దర్శనాలన్నీ టైంస్లాట్‌ విఽధానానికి వెళ్లిపోయాయి. వీఐపీ బ్రేక్‌, రూ.300 దర్శనాలు, ఆర్జితసేవా టికెట్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి వస్తే గంట నుంచి గంటన్నర వ్యవధిలో శ్రీవారిని దర్శించుకునే విధానం అమల్లోకి వచ్చింది. అయితే సర్వదర్శనం భక్తుల నిరీక్షణ సమయం తగ్గించడమే సవాలుగా మారింది.  దీంతో 2011లో తొలిదశగా ‘దివ్యదర్శనం’ పేరుతో కాలినడకన వచ్చే భక్తులకు రోజుకు 20వేల టోకెన్లు ఇచ్చి, టైంస్లాట్‌ ప్రకారం దర్శనం చేయించే విధానానికి శ్రీకారం చుట్టారు.ఆ తర్వాత 2016 నుంచి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రోజుకు 20 వేల టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు ఇచ్చే విధానాన్ని అమలుచేశారు. దీంతో రోజుకు 40 వేల మందికి సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ ప్రకారం దర్శనం చేసే విధానం అమల్లోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 20 వేలు, దివ్యదర్శనం భక్తులకు రూ.20 వేల టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు 20 వేల చొప్పున మొత్తం 60 వేల మందికి వర్చువల్‌ క్యూలైన్‌ ద్వారా దర్శనం కల్పించే విధానం కొవిడ్‌ ముందు వరకు అమలుచేశారు.ఇక వీఐపీ బ్రేక్‌, ఆర్జితసేవలన్నీ కలిపి దాదాపు 10 వేల మంది కూడా టైంస్లాట్‌ ప్రకారం దర్శనం చేసుకుంటున్నారు. అంటే 70 వేల మంది స్లాట్‌ ప్రకారం దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనాన్ని రోజుకు 85 వేల నుంచి 90వేల మందికి కల్పించే వ్యవస్థ ఉంది. మిగిలిన 10 నుంచి 15 వేల మంది మాత్రమే టోకెన్‌ రహిత సర్వదర్శనాలకు వెళ్లేవారన్నమాట.వీరికి కూడా టోకెన్ల ద్వారా దర్శనం కల్పించడానికి టీటీడీ ప్రయత్నించింది. తిరుపతిలో మూడు చోట్ల టోకెన్లు కేటాయిస్తోంది. టోకెన్‌ ఉన్నవారిని మాత్రమే తిరుమల కొండమీదకు అనుమతించాలన్నది టీటీడీ అధికారుల ఆలోచన. ఇందువల్ల తిరుమలలో ఒత్తిడి తగ్గుతుందని భావించారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు టోకెన్లు ఇవ్వలేకపోవడంతో ఈ నెల 12వ తేదీన తొక్కిసలాట జరిగింది. ఈ విధానం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు భక్తులను తిరుమల కొండకు అనుమతించకపోవడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. దీంతో టోకెన్లు కేటాయించే విధానంలో మార్పుల దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.తిరుమలలోనూ, తిరుపతిలోనూ, ఇంకా టీటీడీ కేంద్రాలున్న ప్రతి చోటా సర్వదర్శనం టోకెన్లు కేటాయించగలిగితే ఒత్తిడి ఉండదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల టోకెన్‌ లభించినవారు మాత్రమే తిరుమలకు ప్రయాణం పెట్టుకుంటారు. లభించని వారు కొండకు వచ్చినా, మునుపటిలా అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి దణ్ణం పెట్టుకుని వెళ్లిపోతారు. 1933 టీటీడీ ఏర్పడింది. అప్పట్లో నడచి కొండకు చేరుకునే భక్తుల సంఖ్య వందల్లోనే ఉండేది. దర్శనం చేసుకుని కొండదిగేయాల్సి వచ్చేది. టీటీడీ ఆవిర్భావంతో తిరుమలలో వసతులు మెరుగయ్యాయి.  


1950 నాటికి భక్తుల సంఖ్య 10వేలకు చేరింది. ఆలయం లోపలే సంపంగిప్రాకారం (ప్రస్తుతం కల్యాణం జరిగేచోటు)వద్ద క్యూలైన్లు ఏర్పాటుచేసి దర్శనానికి అనుమతించేవారు.దీంతో ఆలయం లోపల క్యూలైన్ల నిర్వహణ భారం కావడంతో,ఆలయం వెలుపల ప్రాకారానికి ఆనుకుని దక్షిణమాడవీధి వరకు క్యూలైను ఏర్పాటు చేశారు.


1960ల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.పాత పుష్కరిణి కాటేజీ ప్రాంతంలో భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. 


1974లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తవడంతో భక్తులు రాక బాగా పెరిగింది.


1980నాటికి 30వేలమంది దాకా రోజూ కొండకు వచ్చేవారు. 1983లో ఈవో పీవీఆర్కే ప్రసాద్‌ ‘లఘుదర్శన’ విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూలైన్ల నిర్వహణ భారమవడంతో 1985లో మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు. 


1990ల మొదట్లోనే భక్తుల సంఖ్య 50వేలకు చేరింది. భక్తులు కులశేఖరపడి దాకా వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. 


2000వ సంవత్సరానికి దర్శనాల సంఖ్య 60వేలు దాటింది. క్యూకాంప్లెక్స్‌ దాటి వెలుపలకు క్యూలైను వ్యాపించింది. దీంతో 2002లో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు.అయినా నిరీక్షణ సమయం బాగా పెరగడంతో 2006లో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. రద్దీ సమయాల్లోనే దీనిని అమలు చేసేవారు. మిగిలిన సమయాల్లో లఘుదర్శనం నడిచేది.


2010కి భక్తుల సంఖ్య రద్దీ రోజుల్లో దాదాపు లక్షకు చేరుకుంది. రెండు కాంప్లెక్సులు నిండిపోయేవి. బయట క్యూలైన్లు కిలోమీటర్ల వరకు వ్యాపించేవి.దర్శనం కోసం క్యూలో రెండు రోజులు వేచివుండే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో భక్తులు తమ సహానాన్ని కోల్పోయి కంపార్టుమెంట్ల గేట్లు కూడా విరగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మహాలఘు దర్శనాన్ని శాశ్వతంగా అమలు చేశారు.


2020 కొవిడ్‌, తిరుమల దర్శనాల మీద తీవ్ర ప్రభావం చూపించింది. నిమిషానికి 89 మందికి దర్శనం

రోజుకు 16 గంటల పాటు భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. విపరీతంగా పెరిగిపోతున్న సంఖ్య వల్ల గర్భగుడిలోని మూర్తిని దర్శించుకునే సమయం తగ్గిపోతూ వస్తోంది. భక్తుల సంఖ్యను, దర్శనాల సమయంతో పోల్చి లెక్కిస్తే ఒక భక్తుడు లేదా భక్తురాలికి స్వామిని దర్శించుకోవడానికి దక్కుతున్న సమయం ఒక సెకనుకు మించి లేదు.అయితే ఇది స్వామి ముందు నిలబడే సమయం మాత్రమే. నిజానికి ఆలయంలో లోపలికి అడుగుపెట్టాక ఒకరివెనుక ఒకరు వరుసగా కదులుతూ నిలువెత్తు స్వామిని కనులారా దర్శించుకుంటారు.ఈ సమయమంతా కూడా స్వామిని దర్శించుకుంటూనే నడుస్తారు కాబట్టి ఒక సెకను మాత్రమే అనే అభిప్రాయం భక్తులకు కలగదు.  ప్రస్తుతం నిమిషానికి 89 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగితే.. ఎలా అన్నదే సమస్య.

ఏడాది             నిమిషానికి    

1980               31 మంది

1990               52 మంది

2000               62 మంది

2010               83 మంది

2019               89 మంది

Read more