నేత్రానందంగా స్నపన తిరుమంజనం

ABN , First Publish Date - 2022-09-29T06:28:25+05:30 IST

శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో బుధవారం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది.

నేత్రానందంగా స్నపన తిరుమంజనం

తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో  బుధవారం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో అలానే ఈ ఏడాది జపాన్‌ నుంచి యాపిల్స్‌, మస్కట్‌ నుంచి ద్రాక్ష, కొరియా నుంచి పియర్స్‌, థాయ్‌లాండ్‌ నుంచి మామిడి, అమెరికా నుంచి చెర్రీస్‌ కూడా స్వామి సేవలో తరించాయి.టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్‌ఫ్లవర్స్‌, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా మలయప్పస్వామికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మొదటిసారిగా రాగులతో చేసిన మాలలు, పచ్చని పవిత్రాలు, పగడపు మాలలతో పాటు స్నపన తిరుమంజనంలో ఏలకలు, వట్టివేరు, ద్రాక్ష, తులసి దండలు కూడా స్వామి అమ్మవార్లకు అలంకరించారు.థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్‌, ఆస్ర్టేలియన్‌ పింక్‌, బ్లాక్‌ గ్రేప్స్‌, వివిధ దేశాలకు చెందిన పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లు గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తెలిపారు. నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన కళాకారులు ఈ ప్రత్యేక అలంకరణలు చేశారు.    


Read more