వెక్కిరిస్తున్న జాతీయ రహదారి

ABN , First Publish Date - 2022-09-19T06:06:53+05:30 IST

చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-140) పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. 90శాతానికి పైగా పూర్తయిన పనులతో, ఆరు వరుసల మార్గం విశాలంగా ఉంది. దానికి అనుగుణంగా వాహనాలూ వేగంతో వెళతాయి. ఒక్కసారిగా ఆగిన పనుల కారణంగా ఆరు వరుసల రోడ్డు కాస్త రెండు వరుసలుగా మారింది. ఇలా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వెక్కిరిస్తున్న జాతీయ రహదారి
పనపాకం వద్ద ఆగిన బ్రిడ్జి నిర్మాణ పనులు.. ఇటీవల ప్రారంభించారు

రూ.1730 కోట్లు.. 61 కిలోమీటర్లు..


90 శాతానికిపైగా పనులు పూర్తి


పరిహారం విషయంలో సయోధ్య కుదరక మిగతా పనుల పెండింగ్‌


చిత్తూరు, ఆంధ్రజ్యోతి


టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ముంబై నుంచి అహ్మదాబాదు ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ముంబై నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, విశాలమైన జాతీయ రహదారి మీద ఆయన ఖరీదైన కారు వేగంగా వెళుతోంది. వంతెన రావడంతో విశాలమైన రోడ్డు కాస్త సన్నబడింది. కారు అదే వేగంతో ప్రయాణించి ప్రమాదానికి గురైంది. దీంతో మిస్త్రీ అక్కడికక్కడే మరణించారు. చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-140) పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. 90శాతానికి పైగా పూర్తయిన పనులతో, ఆరు వరుసల మార్గం విశాలంగా ఉంది. దానికి అనుగుణంగా వాహనాలూ వేగంతో వెళతాయి. ఒక్కసారిగా ఆగిన పనుల కారణంగా ఆరు వరుసల రోడ్డు కాస్త రెండు వరుసలుగా మారింది. ఇలా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు జాతీయ రహదారిగా ఆరు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం నిధుల్ని మంజూరు చేసింది. చిత్తూరు సమీప కుక్కలపల్లె క్రాస్‌ నుంచి తిరుపతి సమీప మల్లవరం క్రాస్‌ వరకు ఓ ప్రాజెక్టుగా, రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు మరో ప్రాజెక్టుగా విభజించి పనులు ప్రారంభించారు. రూ.1730.07 కోట్ల నిధులు.. 61.128 కిలోమీటర్ల దూరంతో 2019 జనవరిలో ప్రారంభమైన చిత్తూరు- తిరుపతి ప్రాజెక్టు పనులు 2021 మే నెలలోనే 90శాతానికి పైగా పూర్తయ్యాయి. అప్పటి నుంచి వాహన రాకపోకలకు అనుమతిచ్చి, గాదంకి వద్ద టోల్‌ప్లాజాను ఏర్పాటుచేసి వసూళ్లు చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు సరైన పరిహారం ఇవ్వడం లేదని, అలైన్‌మెంట్‌ మార్పును ప్రశ్నిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధానంగా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లె నుంచి బోడంబాయి వరకు మూడు చోట్ల, పనపాకం వద్ద రెండు చోట్ల, పూతలపట్టు మండలం పి.కొత్తకోటలో మరోచోట ఈ ఏడాది జూన్‌ వరకు రోడ్డు పనులు ఆగిపోయాయి.


కేంద్ర మంత్రి ఆదేశాలతో కాస్త కదలిక..

చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జూన్‌లో ఆదేశించారు. దీంతో అధికారులు హడావిడిగా పనులు మొదలు పెట్టారు. కోర్టుకు వెళ్లిన రైతులు లొంగకపోయేసరికి కొన్నిచోట్ల బెదిరించి, మరికొన్నిచోట్ల బుజ్జగించి పనులను ప్రారంభించారు. ఈ ఏడాది జూలైలో రెవెన్యూ, నేషనల్‌ హైవే అధికారులు, కాంట్రాక్టరు, పోలీసుల సాయంతో ఎం.కొంగవారిపల్లె వద్దకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌తో పనులు ప్రారంభించారు. అడ్డుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎం.కొంగరపల్లెలోని పెండింగు పనులు ఓ దశకు వచ్చాయి. పూతలపట్టు మండలం పి.కొత్తకోటలోనూ ఒక రైతును పోలీసుల సాయంతో హెచ్చరించి పనులు పూర్తి చేశారు. అయినా, పనపాకం, రమణప్పగారిపల్లె తదితర ప్రాంతాల్లో పనులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర మంత్రి ఆదేశాలు అమలయ్యేలా లేవని స్పష్టంగా అర్థమవుతోంది.


18 మంది పరిహారం సరిపోదంటున్నారు 


చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి పెండింగు పనుల మీద మూడు నెలలుగా పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. ఇటీవలే సుమారు ఆరు చోట్ల పెండింగు వర్కుల్ని క్లియర్‌ చేశాం. పనపాకం వద్ద పనులు కాస్త పెండింగులో ఉన్నాయి. ఆ ప్రాంతంలో తమ ఇళ్లకు పరిహారం సరిపోవడం లేదని 18 మంది అంగీకరించడం లేదు. ఇప్పటికే వారితో రెండు మూడుసార్లు ఒప్పించే ప్రయత్నాలు చేశాం. మళ్లీ ప్రయత్నాలు చేసి కేంద్ర మంత్రి ఆదేశాలనుసారం నెలాఖరు నాటికి సమస్యను పరిష్కరిస్తాం.

- వెంకటేశ్వర్‌, జేసీ 


Read more