మంగళం ఆర్టీసీ డిపో వద్ద రూ.1.5కోట్లతో మినీ బస్టాండు

ABN , First Publish Date - 2022-12-10T00:26:41+05:30 IST

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్సుస్టేషన్‌ నిర్మాణ విషయంలో ముందడుగు పడుతుండటంతో ఆర్టీసీ యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. బహుళ ప్రదేశాల్లో మినీ లేక తాత్కాలిక బస్టాండుల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు.

మంగళం ఆర్టీసీ డిపో వద్ద రూ.1.5కోట్లతో మినీ బస్టాండు
కరకంబాడిరోడ్డులో మినీ బస్టాండు నిర్మించే స్థలం

తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 9: తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్సుస్టేషన్‌ నిర్మాణ విషయంలో ముందడుగు పడుతుండటంతో ఆర్టీసీ యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. నిర్మాణానికి ఆమోదం లభిస్తే ఇప్పుడున్న సెంట్రల్‌ బస్సుస్టేషన్‌, కార్యాలయాలు, డిపో, గ్యారేజీ తదితరాలను ఖాళీ చేయాలి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. బహుళ ప్రదేశాల్లో మినీ లేక తాత్కాలిక బస్టాండుల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరకంబాడి రోడ్డుకు ఆనుకునిమంగళం ఆర్టీసీ డిపో(ఇప్పటి వరకు బస్టాండు లేని జిల్లాలోనే ఏకైక డిపో)కు ముందున్న రెండెకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో మినీ బస్టాండు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇంజనీరింగ్‌ నిపుణులు సమగ్రంగా సర్వే నిర్వహించి గ్రౌండ్‌లో 13ప్లాట్‌ఫామ్స్‌, బస్సుల రాకపోకలకు కాంక్రీట్‌ ప్రాంగణం, ప్రవేశ, నిష్క్రమణకు వేర్వేరుగా మార్గాలు, టాయిలెట్స్‌ సదుపాయాలు కల్పించనున్నారు. మొదటి అంతస్తులో కార్యాలయాలు, సిబ్బందికి రెస్ట్‌, వాష్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌హాల్‌ వంటి నిర్మాణాలతో నమూనాను తయారు చేశారు. ప్రస్తుతానికి రెండంతస్తుల వరకే రూ.1.5కోట్ల వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను జిల్లా ప్రజారవాణాధికారి ఆధ్వర్యంలో గత నెల్లో విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపారు. 2023 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తక్షణమే మినీ బస్టాండు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే చంద్రగిరి బస్టాండు, డిపో, లక్ష్మీపురం కూడలిలోని మఠం భూముల్లో తాత్కాలిక బస్టాండు ఏర్పాటుకూ ప్రతిపాదనలు పంపారు. ఇవన్నీ మూడునెలల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలుయని యంత్రాంగం పేర్కొంటోంది. కాగా.. ఇప్పటికే తిరుపతి సెంట్రల్‌ బస్టాండు స్థానంలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్‌ బస్సుస్టేషన్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి వివిధ నిపుణుల బృందాలు వేర్వేరుగా పరిశీలించాయి. సాయిల్‌టెస్ట్‌, విస్తీర్ణం, ట్రాఫిక్‌, స్టేషన్‌కు ఇన్‌, అవుట్‌ రూట్‌మ్యాప్‌, చుట్టుపక్కల భవంతులు, రైల్వేస్టేషన్‌, ఫ్లైఓవర్‌, తదితరాలను డ్రోన్‌ కెమెరాల్లో చిత్రీకరించారు. నివేదికను కేంద్రం రోడ్డు రవాణాశాఖకు అందజేశారు. మరిన్ని సర్వేలు పూర్తయ్యాక రాష్ట్రప్రభుత్వం సౌజన్యంతో తుది నమూనా ఖరారుచేయనున్నారు. ఈ కార్యచరణ ఆచరణలోకి వచ్చేందుకు దాదాపు ఏడాది సమయం పడుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-10T00:26:41+05:30 IST

Read more