ఇంకా మొదలుకాని ఇళ్లకు 15న మెగా గ్రౌండింగ్‌ మేళా: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-04-24T08:51:40+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకూ నిర్మాణం మొదలుపెట్టని పక్కా ఇళ్లకు సంబంధించి మే 15వ తేదీన మెగా గ్రౌండింగ్‌ మేళా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ చెప్పారు.

ఇంకా మొదలుకాని ఇళ్లకు 15న మెగా గ్రౌండింగ్‌ మేళా: కలెక్టర్‌
ఇళ్ల నిర్మాణాల స్థితిని తెలుసుకుంటున్న వెంకట రమణారెడ్డి

తిరుపతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటి వరకూ నిర్మాణం మొదలుపెట్టని పక్కా ఇళ్లకు సంబంధించి మే 15వ తేదీన మెగా గ్రౌండింగ్‌ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం హౌసింగ్‌ శాఖపై సమీక్షించారు. జిల్లాకు తొలిదశలో ప్రభుత్వం 66,098 పక్కా ఇళ్లను మంజూరు చేయగా.. 12,860 ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ మొదలు కాలేదని గుర్తించామన్నారు. వీటి నిర్మాణం ఒకేసారి మొదలుపెట్టేలా వచ్చేనెల 15వ తేదీన మెగా గ్రౌండింగ్‌ మేళా ఏర్పాటు చేయాలని చెప్పారు. పేదల కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు మనసు పెట్టి పనిచేస్తే విజయవంతం అవుతుందన్నారు.  మొదటగా లే అవుట్‌ సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి సీ కేటగిరీ కింద చేపట్టే నిర్మాణాలకు కాంట్రాక్టర్లను గుర్తించడం, లబ్ధిదారులతో ఎంవోయూ వంటివి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రతి లే అవుట్‌కూ ఓ నోడల్‌ అధికారిని నియమిస్తామన్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు విద్యుత్‌ మీటరు, తాగునీటి కొళాయి ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు శుక్రవారమే చెల్లించామని గుర్తుచేశారు. పెండింగ్‌లోని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లు, బీఎంసీయూల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో శ్రీనివాసరావు, హౌసింగ్‌ పీడీ అమరనాథరెడ్డి, ఓఎ్‌సడీ రామచంద్రారెడ్డి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీవోలు కనకనరసారెడ్డి, హరిత, రోజ్‌మాండ్‌, మురళీకృష్ణ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు, తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్‌ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T08:51:40+05:30 IST