డీలర్‌ నిర్లక్ష్యం.. ఎండీయూ సహాయకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-11T06:35:42+05:30 IST

రేషన్‌ డీలర్‌ నిర్లక్ష్యంతో ఎండీయూ (ఇంటింటికీ రేషన్‌ సరపరా చేసే వాహనం) సహాయకుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు.

డీలర్‌ నిర్లక్ష్యం.. ఎండీయూ సహాయకుడి మృతి
: మృతి చెందిన శివశంకర్‌

తిరుచానూరు, సెప్టెంబరు 10: రేషన్‌ డీలర్‌ నిర్లక్ష్యంతో ఎండీయూ (ఇంటింటికీ రేషన్‌ సరపరా చేసే వాహనం) సహాయకుడు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. ఈ సంఘటన తిరుపతి రూరల్‌ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. పద్మావతిపురానికి చెందిన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ రెడ్డెప్ప కుమారుడు శివశంకర్‌ (18). ఇతడు కొంతకాలంగా శ్రీనివాసపురం పంచాయతీ సుబ్బారావుకు చెందిన ఎండీయూలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం యథావిధిగా ఇద్దరూ రేషన్‌ బియ్యం కోసం వాహనం తీసుకెళ్లారు. డీలర్‌ షాపు వద్ద బియ్యం లోడు చేశాక శివశంకర్‌ డోరు వేసే క్రమంలో అక్కడ ఉన్న విద్యుత్‌ తీగలు డోరుకు తగిలి దాని ద్వారా కరెంటు షాక్‌కు గురయ్యాడు. సుబ్బారావు వెంటనే అతడిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డీలర్‌ షాపు వద్ద విద్యుత్‌ తీగలు సరిగా లేవని షాక్‌ కొడుతోందని గతంలో స్థానికులు చెప్పినా డీలర్‌ పట్టించుకోలేదని అందువల్లే ఇప్పుడు తమ బిడ్డ మృతిచెందాడని మృతుడి కుటుంబసభ్యులు విలపించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ తహసీల్దార్‌ లోకేశ్వరిని విచారణకు ఆదేశించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శ్రీనివాసపురం, పద్మావతిపురం వైసీపీ నాయకులైన గణపతినాయుడు, పవన్‌కుమార్‌, రాజేంద్ర, మహి, సురే్‌షలను ఆదేశించారు.  

Updated Date - 2022-09-11T06:35:42+05:30 IST