ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

ABN , First Publish Date - 2022-02-20T05:26:33+05:30 IST

అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ భారీ శబ్ధం. ఏం జరిగిందోనని గ్రామస్థులు బయటకు వచ్చారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ
ఇంట్లోకి వెళ్లిన లారీ

ఇద్దరు నడిమిచెర్లవాసుల దుర్మరణం 

ప్రాణాలతో బయటపడ్డ మరొకరు

8 గంటలపాటు లారీలోనే బిక్కుబిక్కుమంటూ.. 


గుర్రంకొండ, ఫిబ్రవరి 19: అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ భారీ శబ్ధం. ఏం జరిగిందోనని గ్రామస్థులు బయటకు వచ్చారు. మలుపు వద్ద అదుపుతప్పిన సిమెంటు లారీ ఓ ఇంట్లోకి దూసుకెళ్లడాన్ని చూశారు. లారీలో ఇరుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇంట్లో ఎవరూ లేరు. పోలీసులు తెలిపిన ప్రకారం.. కలకడ మండలం నడిమిచెర్లకు చెందిన పి.సదాశివ(29), టి.నాగరాజ(35), టి.కుమార్‌(20) లారీ డ్రైవర్లు. ఈ నేపథ్యంలో సదాశివ శుక్రవారం రాత్రి కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి సిమెంట్‌ లోడ్‌తో స్వగ్రామానికి బయలుదేరారు. రాయచోటికి రాగా తానూ గ్రామానికి వస్తున్నట్లు నాగరాజ ఫోను చేశారు. కాసేపు ఉండి అతడిని లారీలో ఎక్కించుకొని బయలుదేరారు. తనకు నిద్ర వస్తోందని సదాశివ చెప్పడంతో నాగరాజ లారీని డ్రైవింగ్‌ చేశారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ కోన క్రాస్‌ వద్ద వేచి ఉన్న టి.కుమార్‌ను అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో లారీలో ఎక్కించుకొన్నారు. కాసేపటికి (ఒంటి గంట సమయంలో) ఈ లారీ నడిమికండ్రిగకు చేరింది. మలుపు తిరగాల్సిన చోట అదుపుతప్పి నేరుగా ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఇంటి పైకప్పు మొత్తం లారీ క్యాబిన్‌పై పడడంతో నుజ్జునుజ్జుగా మారింది. లారీని నడుపుతున్న నాగరాజ, పక్కనే ఉన్న సదాశివ మృతి చెందగా, ఎడమ వైపు కూర్చుని ఉన్న కుమార్‌ ప్రాణాలతో ఇరుక్కుపోయారు. భారీ శబ్ధం రావడంతో అప్పటికే చుట్టు పక్కల ఇళ్ల వారు లేచి వచ్చారు. కుమార్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించినా కుదరలేదు. ఉదయం 9 గంటలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి కుమార్‌ను ప్రాణాలతో బయటకు తీశారు. ఇలా 8 గంటలపాటు ఇతడు లారీలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం క్రేన్‌, ఎక్స్‌కవేటర్‌ సాయంతో లారీని బయటకు లాగి సదాశివ, నాగరాజ మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సుంకర రామచంద్రకు చెందిన బండ్ల మిద్దె ధ్వంసమైంది. ప్రస్తుతం వీరు మదనపల్లెలో కాపురముంటున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు. కాగా, పది నిమిషాల్లో గ్రామానికి  చేరుకోనుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను చూసి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు యువకుల మృతితో నడిమిచెర్లలో విషాదం నెలకొంది. సదాశివకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 









Updated Date - 2022-02-20T05:26:33+05:30 IST