రూ.10 లక్షల మద్యం, కారు స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-26T06:15:41+05:30 IST

కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 4వేల బాటిళ్ల మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు.

రూ.10 లక్షల మద్యం, కారు స్వాధీనం
నిందితుడు, మద్యం, కారును మీడియాకు చూపిస్తున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

ఒకరు అరెస్టు..ఐదుగురి పరారీ

మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

చిత్తూరు, సెప్టెంబరు 25: కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 4వేల బాటిళ్ల మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వివరాలను చిత్తూరు తాలూకా సీఐ మద్ధయ్య ఆచారితో కలిసి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు తాలూకా సీఐ మద్దయ్యాచారి, ఎస్‌ఐ వి.రామకృష్ణ, ఎన్‌ఆర్‌పేట ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం 7 గంటలకు చెర్లోపల్లె(హయ్యత్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీ) వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. చెర్లోపల్లె సర్వీస్‌ రోడ్డులో వచ్చిన హుండై సాంట్రో కారును తనిఖీ చేశారు. 40 కేసుల కర్ణాటక మద్యం బయటపడింది. చిత్తూరు నగరం తేనబండ వీరభద్రకాలనీకి చెందిన ఎం.అన్సర్‌(26)ను అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన గణేష్‌, రాము, యాదమరి మండలం దళవాయిపల్లెకు చెందిన హరీష్‌, రసూల్‌ నగర్‌కు చెందిన దాహీద్‌, నంగిలి బాలాజీ వైన్స్‌షాపునకు చెందిన ఓ వ్యక్తి పరారయ్యారు. రూ.5 లక్షల మద్యం, రూ.5 లక్షల కారును సీజ్‌ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


Read more