17 సెంట్ల స్థలం కోసం నిండు ప్రాణం బలి!

ABN , First Publish Date - 2022-10-04T06:21:00+05:30 IST

నాగలాపురం మండలం బీరకుప్పం దళితవాడలో పదహారు సెంట్ల స్థలం కోసం ఓ నిండు ప్రాణం బలైంది

17 సెంట్ల స్థలం కోసం నిండు ప్రాణం బలి!
హతుడు ఏలుమలై

రికార్డుల్లో పట్టాదారుగా మృతుడి తండ్రి పేరు

అనుభవదారుగా దాడి చేసిన వ్యక్తి తండ్రి పేరు

ఏడాదిగా వివాదం... కోర్టులో సివిల్‌ కేసు పెండింగ్‌

పలుమార్లు పోలీసులకూ పరస్పర ఫిర్యాదులు

రెవిన్యూ నిర్వాకంతోనే పెద్దదైన వివాదం

దాడి చేసినవారిలో తండ్రి వైసీపీ నేత, 

కొడుకు వలంటీరు


నాగలాపురం/తిరుపతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): నాగలాపురం మండలం బీరకుప్పం దళితవాడలో  పదహారు సెంట్ల స్థలం కోసం ఓ నిండు ప్రాణం బలైంది. అధికార పార్టీ నాయకుడి భూదాహానికి రెవిన్యూ అధికారుల నిర్వాకం తోడు కావడంతోనే ఈ స్థల వివాదం ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకుల నుంచీ వారసత్వంగా అందిన స్థలాన్ని రికార్డుల్లో పట్టాదారుగా వారిపేర్లే వున్నప్పటికీ అనుభవదారుగా వైసీపీ నాయకుడి కుటుంబీకుని పేరును రెవిన్యూ అధికారులు నమోదు చేయడంతోనే వివాదం పెరిగి ఘర్షణలకు దారి తీసిందని సమాచారం. దీనికి సంబంధించి బాధితులు, పోలీసుల కథనం మేరకు .....బీరకుప్పం దళితవాడలో ఏలుమలై కుటుంబానికి తమ ఇంటి పక్కనే పూర్వీకుల నుంచీ వారసత్వంగా వచ్చిన స్థలం వుంది. సర్వే నెంబరు 129-8లోని ఈ 17 సెంట్ల స్థలం అక్కడి ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ. 12లక్షల పైనే చేస్తుంది. ఏడాది కిందటి వరకూ దీనిపై ఎలాంటి వివాదం లేదు. ఏలుమలై కుటుంబం ఆధీనంలోనే స్థలం వుండేది. వారింటికి వెనుకవైపు వున్న విజయన్‌ స్థానికంగా వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తుం టారు. అతడి కుమారుడు జగన్‌ గ్రామ వలంటీరుగా వున్నారు. వారు ఏడాదిగా సంబంధిత స్థలం తమదంటూ ముందుకు రావడంతో ఏలుమలై కుటుంబంతో వివాదం ఏర్పడింది. రెవిన్యూ రికార్డులు పరిశీలిస్తే పట్టాదారుగా ఏలుమలై తండ్రి పీరయ్య పేరు నమోదై వుంది. కానీ అదే రికార్డుల్లో అనుభవదారుగా మాత్రం విజయన్‌ తండ్రి అట్టాలు వేణు పేరు నమోదై వుంది. ఏడాది కిందట విజయన్‌, అతడి కొడుకు జగన్‌ రెవిన్యూ అధికారుల సహకారంతో రికార్డుల్లో ఆ మేరకు మార్పులు చేయించుకున్నారని, నకిలీ పట్టా సృష్టించారనేది ఏలుమలై కుటుంబం వాదన. ఆ మేరకు వారు సత్యవేడు కోర్టులో సివిల్‌ కేసు కూడా వేశారు. ఏడాదిగా అడపాదడపా ఇరు కుటుంబాల నడుమా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నాగలాపురం స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా సోమవారం విజయన్‌ కుటుంబీకులు వివాదాస్పద స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ నిర్వహించాలని వెళ్ళారు. ఏలుమలై కుటుంబీకులు అడ్డుకున్నారు. వివాదం కోర్టులో వున్నందున అక్కడే తేల్చుకుందామని, అప్పటిదాకా స్థలంలోకి రావద్దని అభ్యంతరం చెప్పారు. దీంతో విజయన్‌, అతడి కుటుంబీకులు కర్రలతో దాడి చేయడంతో ఏలుమలై, భార్య లలిత, కుమారుడు రాంకీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రాధమిక చికిత్స అనంతరం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.అక్కడ చికిత్స పొందుతూ ఏలుమలై (65)మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ఏలుమలై కుమారుడు నరేష్‌ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ శివకుమార్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా వైసీపీ నాయకుడి కుటుంబం ఆ ప్రాంతంలో ఇప్పటికే పలు భూ వివాదాల్లో తలదూర్చి, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. తాజా ఘటనలో రెవిన్యూ అధికారుల తీరే ఘర్షణకు, ఓ మనిషి ప్రాణం పోవడానికి, ఇద్దరు తీవ్రంగా గాయపడడానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణాల్లో అయినా భూ వివాదాలు శాంతిభద్రతల సమస్యకు దారి తీయడానికి ప్రధానంగా రెవిన్యూ యంత్రాంగం తీరే కారణమన్న విమర్శలు, ఆరోపణలూ తొలినుంచీ వున్నవే. తాజా ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మీ భూమి పోర్టల్‌లో పరిశీలించి చూడగా సంబంధిత స్థలం పట్టాదారుగా ఏలుమలై తండ్రి పేరు, అనుభవదారుగా వారి ప్రత్యర్థి కుటుంబీకుడి పేరుండడం గమనార్హం. ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు పట్టాదారుగా, అనుభవదారుగా వుంటాయి తప్ప సంబంధమే లేని వేర్వేరు కుటుబీకుల పేర్లు ఒకే రికార్డులో ఎలా చోటుచేసుకున్నాయో రెవిన్యూ అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది.

Updated Date - 2022-10-04T06:21:00+05:30 IST