అప్పుల కుప్పం

ABN , First Publish Date - 2022-11-03T01:21:35+05:30 IST

చేసిన అరకొర పనులకోసం వందల రూపాయల బిల్లులు కూడా కాకుండా అధికార పార్టీ కౌన్సిలర్లే దేబిరించాల్సి రావడం. ఇదే అంశంపై సాక్షాత్తు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మునస్వామి కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం.. ఈ పరిణామాలతో కుప్పం పురపాలక సంఘం ఆర్థిక దుస్థితి తెరమీదకు వచ్చింది.

అప్పుల కుప్పం
మున్సిపల్‌ కమిషనర్‌ రవిరెడ్డి

చాలని సిబ్బంది.. బకాయిలతో ఇబ్బంది

అభివృద్ధి వొట్టిమాటేనా

చేసిన అరకొర పనులకోసం వందల రూపాయల బిల్లులు కూడా కాకుండా అధికార పార్టీ కౌన్సిలర్లే దేబిరించాల్సి రావడం. ఇదే అంశంపై సాక్షాత్తు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మునస్వామి కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం.. ఈ పరిణామాలతో కుప్పం పురపాలక సంఘం ఆర్థిక దుస్థితి తెరమీదకు వచ్చింది.

- కుప్పం

కుప్పం మేజర్‌ పంచాయతీ, చుట్టూ ఉన్న మరో 8 పంచాయతీలను కలుపుకొని 2019 జనవరి 24వ తేదీన పురపాలక సంఘంగా ఏర్పడింది. అంతకుముందు తెలుగుదేశం హయాంలోనే ‘మున్సిపాలిటీ’ ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, పన్నులు పెరిగి, అభివృద్ధి తగ్గుతుందని నాటి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు భావించారు. పైగా అదే దశలో కేంద్రప్రభుత్వ ‘రూర్బన్‌’ పథకానికి కుప్పం ఎంపికైంది. కేవలం అది గ్రామీణ ప్రాంతాలను ఉద్దేశించిన పథకం. అంతకుముందు మున్సిపల్‌ ప్రతిపాదనల్లో చేర్చిన 8 పంచాయతీలనే కుప్పం క్లస్టర్‌ కింద చూపించి నిధులు తెప్పించి అభివృద్ధికి బాటలు వేశారు. మున్సిపాలిటీగా మారుంటే ఆ పథకం అమలుకు కుప్పం ఎంపికయ్యేది కాదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పాన్ని పురపాలక సంఘం చేసిన ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి చకచకా ప్రక్రియ పూర్తి చేసింది. ఎట్టకేలకు కుప్పం మున్సిపాలిటీ అనిపించుకుంది. కానీ, మున్సిపాలిటీ చెల్లించాల్సిన.. రావాల్సిన పన్ను బకాయిలు, ప్రభుత్వంనుంచి రాలని నిధులు, జరగని అభివృద్ధి పనులు పాలకులను, అధికారులను నిలదీస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 15వ ఆర్థిక సంఘం నిధులు లేకపోతే మున్సిపాలిటీది దీనస్థితే. మరోవైపు ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన పన్ను పోట్లు.. కానరాని అభివృద్ధి చూసి తాము కోరుకున్న మున్సిపాలిటీ ఇది కాదని జనం అంటున్నారు. తమ బతుకులు అతలాకుతలం అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు.

బకాయిల గుదిబండ

కుప్పం పురపాలక సంఘం అయితే అయింది కానీ, అంతకుముందు మేజర్‌ గ్రామ పంచాయతీల బకాయిలు అలాగే బదిలీ అయ్యాయి. తర్వాతి రెండున్నరేళ్ల బకాయిలు కూడా దీనికి తోడయ్యాయి. ఐదారు సంవత్సరాలవి కలిపి మొత్తం విద్యుత్తు బకాయిలు ఏకంగా రూ.17 కోట్లకు చేరాయి. మిగిలిన బకాయిలన్నీ కలిపి ఆ మొత్తం సుమారు రూ.20 కోట్లకు పెరిగింది. బకాయిల చెల్లింపు జరగకపోగా, ఏటా ఈ మొత్తం పెరుగుతూ పోతోంది. దీంతో పాటు ప్రజలు చెల్లించాల్సిన పన్ను బకాయిలు మరో రూ.7 కోట్లకు చేరాయి.

అరకొరగా అభివృద్ధి పనులు

ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూర్బన్‌ పథకం కింద విడుదలై.. ఆ తర్వాత వెనక్కు వెళ్లిన నిధులే దిక్కయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత, ఆ నిధులను అతి ప్రయాసమీద తెప్పించుకుని అక్కడక్కడా సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించారు. సాధారణ నిధుల్లో సుమారు రూ.30 లక్షలు వెచ్చించి అక్కడక్కడా అరాకొరా పనులు చేపట్టారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులపైనే పాలకులు, అధికారుల దృష్టి ఉంది. దీనికింద కుప్పం మున్సిపాలిటీకి రూ.1.21 కోట్లు మంజూరయ్యాయి. దీనికి తగిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపారు.

సిబ్బంది కొరత

కుప్పం పురపాలక సంఘంలోని 25 వార్డుల్లో 46,598 మంది జనాభా నివశిస్తున్నారు. వీరిలో 23,377 మంది పురుషులు కాగా, 23221 మంది మహిళలు. అధికారిక లెక్కల ప్రకారం 10,800 ఇళ్లు, 1,250 వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య 30 శాతం వరకు ఎక్కువే ఉండొచ్చని అంచనా. వీటన్నింటినుంచి రోజుకు సుమారు 13-15 టన్నుల చెత్త చేరుతోంది. ఇంతటి మున్సిపాలిటీ నిర్వహణకు గల సిబ్బంది మాత్రం చాలా పరిమితం. కమిషనర్‌తోపాటు ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఏఈ, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు. వీరిలోనూ ఏఈ పలమనేరు నుంచి డిప్యుటేషన్‌ మీద వారానికి రెండు రోజులు మాత్రం వచ్చివెళ్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సైతం పుత్తూరు నుంచి డిప్యుటేషన్‌పై వారంలో రెండురోజులుంటారిక్కడ. ఆ రెండురోజులు కూడా తమ మాతృ మున్సిపాలిటీల్లో పని ఒత్తిడి ఉన్నా లేక ఏదైనా అవసరమై సెలవు పెట్టినా అంతే సంగతులు. ఇక, 130 మందిదాకా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు.

బకాయిలివీ

విద్యుత్తు బిల్లులు: రూ.7 కోట్లు

ఇతరాలు: రూ.3 కోట్లు

రావాల్సిన పన్ను బకాయిలు

ఆస్తి పన్ను: రూ.5.25 కోట్లు

నీటి పన్ను: రూ.కోటి

ఇతర పన్నులు: రూ.50 లక్షలు

------------------------------------------

పన్ను వసూళ్లకు ప్రయత్నిస్తున్నాం

కుప్పం పురపాలక సంఘం ఏర్పడి కేవలం రెండున్నరేళ్లయింది. పంచాయతీగా ఉన్నప్పటి బకాయిలు కూడా దానితోపాటు బదిలీ అయ్యాయి. మున్సిపాలిటీ చెల్లించాల్సిన ఆరేడేళ్ల విద్యుత్తు బకాయిలు ఏకంగా రూ.7 కోట్లు అలాగే ఉన్నాయి. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నుబకాయిలు మరో రూ.7 కోట్ల దాకా పెండింగులోనే ఉన్నాయి. మొన్న ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ పూర్తయింది. ప్రజలందరికీ డిమాండ్‌ నోటీసులు పంపాం. ఇప్పుడిప్పుడే వసూళ్లు జరుగుతున్నాయి. వందశాతం పన్ను బకాయిల వసూళ్లకు కసరత్తు చేస్తున్నాం.

- రవిరెడ్డి, కమిషనరు

Updated Date - 2022-11-03T01:22:00+05:30 IST