రేపు తిరుపతిలో కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2022-11-17T01:42:01+05:30 IST

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో ఈనెల 18న కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీపోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

రేపు తిరుపతిలో కార్తీక దీపోత్సవం

తిరుమల, నవంబరు16(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో ఈనెల 18న కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీపోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. జేఈవో బుధవారం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులకు తెలిపేందుకు, దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారు,మహాలక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు దీపోత్సవం జరుగుతుందన్నారు. మైదానంలో 1,800 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీపోత్సవానికి వచ్చే మహిళలకు తులసి మొక్కలు అందించాలన్నారు. అలాగే అష్టలక్ష్మీ వైభవం నృత్యరూపకం, సామూహిక లక్ష్మీనీరాజనం(దీపాలు వెలిగించడం)తో పాటు నక్షత్ర హారతి, మంగళహారతి నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్తీకమాసం విశిష్టతను తెలియజేసేలా స్టేజ్‌పై సుందరంగా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు, మైదానంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌కుమార్‌, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T01:42:01+05:30 IST

Read more