జామియా మసీదు ఆస్తుల లావాదేవీల్లో రూ.2కోట్లకుపైగా గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-03-16T06:10:01+05:30 IST

పట్టణంలోని జామియా మసీదు ఆస్తులు, ఆదాయాలు, బ్యాంకుల లావాదేవీల్లో దాదాపు రూ.రెండు కోట్లకు పైగా గోల్‌మాల్‌ జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా ఆరోపించారు.

జామియా మసీదు ఆస్తుల లావాదేవీల్లో   రూ.2కోట్లకుపైగా గోల్‌మాల్‌
మసీదుకమిటీ లావాదేవీలకు చెందిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూపిస్తున్న షాజహాన్‌బాషా

మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె రూరల్‌, మార్చి 15: పట్టణంలోని జామియా మసీదు ఆస్తులు, ఆదాయాలు, బ్యాంకుల లావాదేవీల్లో దాదాపు రూ.రెండు కోట్లకు పైగా గోల్‌మాల్‌ జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా ఆరోపించారు. మంగళవారం ఆయన కాంగ్రె్‌స కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని జామియా మసీదుకు చెందిన 48ఎకరాల భూమి ఇతరుల ఆధీనంలో ఉండగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వంతో చర్చించి, ఆ భూమిని మసీదుకు అప్పగించామన్నారు. ముస్లింల సహాయసహకారాలతో, చందాలు వేసుకుని  ఆ భూముల్లో గదులు నిర్మించి కులమతాలకతీతంగా బాడుగలకు ఇచ్చామన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మసీదుకు చెందిన ఖాళీస్థలంలో షెడ్లు వేసుకుని వెల్డింగ్‌, మెకానిక్‌ వంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి కడుపుకొడుతూ వాటిని దుర్మార్గంగా తొలగించారన్నారు. వైసీపీ అధికారం చేప్పటి నుంచి ఇంతవరకు ఆ భూముల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా మసీదుకు వస్తున్న ఆదాయాన్ని సైతం బ్యాంకులో జమచేయడంలేదన్నారు. 2020 ఫిబ్రవరి 20వతేదీ  బ్యాంకులో రూ.96లక్షలు ఉండగా, 2022 జనవరి 21వతేదీ బ్యాంకులో స్టేట్‌మెంట్‌ చూడగా రూ.1,14,96,030 మాత్రమే ఉందన్నారు. దుకాణ గదుల ద్వారా నెలకు రూ.7లక్షల వరకు వచ్చే బాడుగలతో కలిపితే దాదాపు రూ.2.70కోట్లు బ్యాంకులో ఉండాలన్నారు. అదేవిధంగా బెంగళూరు బస్టాండులోని బడేమకాన్‌కు చెందిన లావాదేవీల్లో రూ.కోటికిపైగా లెక్కలు లేవన్నారు. టిప్పుసుల్తాన్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో మామిడికాయల మండీ యజమానులు రూ.40లక్షలు ఇచ్చినట్లు చెబుతున్నారన్నారు. ఈ డబ్బు బ్యాంకులో జమకాకుంటే ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వీటన్నిటిపైన వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టరు లెక్కలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. మసీదుకు చెందిన, కమ్యూనిటీ ఆస్తులపై తాము వివరణ అడిగితే వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఆర్థం కావడం లేదన్నారు. ఇటీవల పట్టణంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జి.ముజీబ్‌హుస్సేన్‌ అక్రమలేఅవుట్లపై అవినీతి ఆరోపణలు చేస్తే ఆయన మెడికల్‌ షాపుపై అధికారులు దాడులు చేసి సీజ్‌ చేయడం పద్ధతి కాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు షంషీర్‌, నాగూర్‌వలీ, రెడ్డిసాహెబ్‌, గిరీష్‌, ఇంతియాజ్‌, జబీ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-16T06:10:01+05:30 IST