మీటర్లు బిగిస్తామని వస్తే కట్టేయండి

ABN , First Publish Date - 2022-09-29T06:06:58+05:30 IST

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఎవరైనా వస్తే అక్కడే కట్టేయండని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రైతులకు పిలుపునిచ్చారు.

మీటర్లు బిగిస్తామని వస్తే కట్టేయండి
రైతు సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

రైతులకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 28: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఎవరైనా వస్తే అక్కడే కట్టేయండని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రైతులకు పిలుపునిచ్చారు. మీటర్ల ఏర్పాటుపై బుధవారం చిత్తూరులో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టనివద్దని రైతులకు సూచించారు. రైతులకు అండగా సీపీఐ ఉంటుందన్నారు. ఒకసారి మీటర్లు పెట్టనిస్తే వంట గ్యాస్‌ పరిస్థితే వస్తుందన్నారు. తొలుత వంట గ్యాస్‌కు సబ్సిడీ బ్యాంకు అకౌంట్‌లో జమచేస్తామని చెప్పి, చివరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీనే లేకుండా చేసిందని గుర్తు చేశారు. కార్మిక చట్టాలను అడ్డుకున్నట్టే ఈ మీటర్లు పెట్టే ప్రక్రియను కూడా అడ్డుకోవాలని కోరారు. దీనికోసం ప్రత్యేక కమిటీ నియమించి ఎక్కడ మీటర్లు బిగిస్తామని వచ్చిన వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనికోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం ఉన్నామని సీపీపీ జిల్లా కార్యదర్శి నాగరాజు చెప్పారు. ఈ సదస్సులో సీపీఐ, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.


Read more