భూమి మాదైతే పరిహారం వారికిస్తారా?

ABN , First Publish Date - 2022-11-30T23:40:37+05:30 IST

హంద్రీ-నీవా కాలువ నిర్మాణంకోసం సేకరించిన భూములకు ప్రభుత్వమిచ్చే నష్టపరిహారాలు వివాదమవుతున్నాయి. భూములు తమ మీదుంటే వేరేవారికి పరిహారం అందివ్వడాన్ని నిరశిస్తూ శాంతిపురం మండల సచివాలయం ఎదుట బుధవారం చౌడమ్మ, మునెప్ప అనే రైతులు ధర్నా చేశారు.

భూమి మాదైతే పరిహారం వారికిస్తారా?
మండల సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

శాంతిపురం మండల సచివాలయం ఎదుట రైతుల ధర్నా

కుప్పం, నవంబరు 30: హంద్రీ-నీవా కాలువ నిర్మాణంకోసం సేకరించిన భూములకు ప్రభుత్వమిచ్చే నష్టపరిహారాలు వివాదమవుతున్నాయి. భూములు తమ మీదుంటే వేరేవారికి పరిహారం అందివ్వడాన్ని నిరశిస్తూ శాంతిపురం మండల సచివాలయం ఎదుట బుధవారం చౌడమ్మ, మునెప్ప అనే రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హంద్రీ-నీవా కాలువకోసం కర్లగట్ట గ్రామ పరిధిలో తమకు సంబంధించిన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దీనికిగాను నష్టపరిహారం కూడా మంజూరైందన్నారు. అయితే మంజూరైన నష్టపరిహారాన్ని భూ యజమానులైన తమకు కాకుండా, గ్రామంలోని వెంకటప్ప, చిన్నస్వామి, రామప్ప అనే వారికి చేరిందని ఫిర్యాదు చేశారు. సదరు భూమికి సంబంధించిన ప్రభుత్వ రికార్డుల్లో సైతం మునెప్ప, చౌడప్ప అనే పేర్లే యజమానులుగా ఉన్నాయన్నారు. అటువంటప్పుడు తమను కాదని ఇతరులకు నష్టపరిహారం ఎలా ఇస్తారని రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఈ విషయాన్ని ఇదివరకే గుర్తించి మండల తహసిల్దారుకు అనేకమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికి ఇచ్చినది కాకుండా తమ భూములకు సంబంధించి ఇంకా సుమారు రూ.10 లక్షలదాకా నష్టపరిహారం మంజూరు కావాల్సి ఉందన్నారు. ఇప్పటికే వేరేవారికి చెల్లించిన పరిహారం సొమ్ముతోపాటు ఇకమీదట మంజూరు కానున్న సొమ్మును కూడా తమకే అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ధర్నా చేసిన రైతులకు మాలమహానాడు జాతీయ ఉపాధ్యాక్షులు కన్నన్‌, చిత్తూరు జిల్లా అధ్యక్షులు కందస్వామిలు మద్దతు ప్రకటించారు. అధికారులు ప్రభుత్వ రికార్డులు పరిశీలించి, మరోసారి సర్వే చేసి పూర్తి విచారణ జరపాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈమేరకు రైతులు డిప్యూటీ తహసిల్దారుకు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-11-30T23:40:37+05:30 IST

Read more