ఇలాగైతే.. పోషకాహారమెలా?

ABN , First Publish Date - 2022-07-18T06:22:58+05:30 IST

బియ్యం, కంది పప్పులు, కోడిగుడ్డులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అన్నంలలుఓఓకి మంచి పోషకాలున్న ఆకుకూరలు, కూరగాయలతో వండి పెట్టాలని మెనూ ఇచ్చింది. దీనికిగాను ఒక్కొక్కరికి రూ.1.40 చొప్పున ఇస్తోంది. ఈ డబ్బుతో పోషకారం సాధ్యమేనా? కరోనా తర్వాత అమాంతం పెరిగిన ధరలతో ఎలా వండి పెట్టాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

ఇలాగైతే.. పోషకాహారమెలా?
అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం తింటున్న గర్భిణులు, బాలింతలు

రేటు పెంచకనే.. కొత్తమెనూ ఇచ్చిన ప్రభుత్వం 

భారమవుతోందంటున్న అంగన్‌వాడీలు 


బియ్యం, కంది పప్పులు, కోడిగుడ్డులను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అన్నంలోకి మంచి పోషకాలున్న ఆకుకూరలు, కూరగాయలతో వండి పెట్టాలని మెనూ ఇచ్చింది. దీనికిగాను ఒక్కొక్కరికి రూ.1.40 చొప్పున ఇస్తోంది. ఈ డబ్బుతో పోషకారం సాధ్యమేనా? కరోనా తర్వాత అమాంతం పెరిగిన ధరలతో ఎలా వండి పెట్టాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. 


చిత్తూరు, జూలై 17: జిల్లాలోని 22 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1768  అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.  36,928 మంది గర్భిణులు, 27,242 మంది బాలింతలు ఉన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 2,03,274 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు  28,546 మంది ఉన్నారు.  కొత్త మెనూ ప్రకారం ఈ నెల ఒకటో తేది నుంచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలలకు కేంద్రాల్లోనూ మధ్యాహ్నం వేడివేడిగా ఆహారం వడ్డించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు మాత్రమే సరఫరా చేస్తుంది. మిగిలిన ఆకు కూరలు, కూరగాయలు, చింత పండు, ఉప్పు, కారం, మసాల దినుసులు తదితరాలను అంగన్‌వాడీ కార్యకర్తలే కొనుక్కోవాలి. ఒక్కొక్కరికి పాత బిల్లు ప్రకారం రూ.1.40, గ్యాస్‌ కోసం రూ.50 పైసలు చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఈ ఛార్జీలు ఏ మాత్రం సరిపోవని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. కొత్త మెనూ ప్రకారం ధరలకు అనుగుణంగా కొత్త బిల్లులను పెడితే తప్ప మెనూను అమలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. రెండేళ్లలో వంటగ్యాస్‌ ధరలు నాలుగింతలు పెరిగాయి. ఇవన్నీ పట్టించుకోకుండా పాత ధరలకే కొత్త మెనూను పెట్టాలని ప్రభుత్వం చెబుతుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వసతులు మెరుగు పరచకనే.. 


అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులను మెరుగుపరచకుండా  ప్రభుత్వం ఆదరాబాదరాగా వంట చేయాలని ఆదేశాలిచ్చింది. గ్యాస్‌ స్టవ్‌లు, కుక్కర్లు, వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు లేకుండా ఎలాగని వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది గర్భిణులు పనులకు వెళుతున్నారు. ఒకవేళ వచ్చినా కేంద్రాల్లో కింద కూర్చొని భోజనం తినలేకపోతున్నారు. సిజేరియన్‌ చేసుకున్న వారు ఆస్పత్రిలోనే వారం రోజుల పాటు ఉండాల్సి ఉంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన 15 రోజుల తరువాత ఎత్తు పల్లాలతో నడవకూడదని డాక్టర్లు చెబుతుండటంతో రాలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో గర్భిణులు, బాలింతలు హాజరవడం లేదని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చెప్పడం విశేషం.


యాప్‌ కష్టాలు 


అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం చేస్తున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఫొటోలను ప్రతి రోజు వైఎస్సార్‌ సంపూర్ణ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. చాలా కేంద్రాలలో నెట్‌వర్క్‌ పనిచేయకపోవడంతో అప్‌లోడ్‌ చేయలేని పరిస్థితి. దీంతో భోజనాలు పెట్టినా రికార్డుల్లో ఆబ్సెంట్‌ పడే పరిస్థితి ఉంది. 



ఇదీ కొత్త మెనూ 


ఉడికించిన కోడిగుడ్డు, అన్నం, దోసకాయపప్పు, కోడిగుడ్డుకూర, ఆకు కూరలతో పప్పు, సాంబారు, వెజిటేబుల్‌ రైస్‌, బీరకాయ, సొరకాయ వంటివాటిని మెనూలో చేర్చారు. ఏ రోజు ఏం పెట్టాలన్నా దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. గతంలో ఆకు కూరలు, కూరగాయలతో భోజనానికి అవస్థలు పడ్డారు. ఇప్పుడు కొత్తమెనూ ప్రకారం పెట్టాలన్నా ఏ మాత్రం డబ్బులు చాలవని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు.


ఈ డబ్బులు సరిపోతాయా!


గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.1.40 ఇస్తోంది. ఈ డబ్బుతో ఆకు కూరలు, టమోటా, మసాలా దినుసులను అంగన్‌వాడీ వర్కర్లే కొనాలి. ఆకు కూర కట్ట తక్కువంటే రూ.10, కిలో టమోటా రూ.15, పోపు దినుసులన్నీ కలిపి మరో రూ.5 అవుతాయి. ఉదాహరణకు ఒక కేంద్రంలో 15 మంది ఉన్నారనుకుంటే.. వారికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.40 కలిపితే రూ.21 అవుతుంది. ఈ డబ్బులతో ముగ్గురి నుంచి నలుగురికి మాత్రమే పోషకాహారం పెట్టగలమని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు అంటున్నారు. పోషకాహారం పెట్టాలని పదేపదే చెప్పే ప్రభుత్వం.. ఈ విషయాన్నీ గుర్తించాలని వారు కోరుతున్నారు. 


ఇంతటి భారమా? 


పాత బిల్లు ప్రకారం ఇచ్చే డబ్బుతో కొత్త మెనూ అమలు చేయాలని ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లకు స్పష్టంచేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచర్చరిస్తోంది. కొవిడ్‌ తరువాత నిత్యావసర వస్తువుల ధరలు మూడింతలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలతో సంపూర్ణ పౌష్టికాహారాన్ని ఎలా పెట్టగలమని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు. ఇది తమకు తలకుమించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-18T06:22:58+05:30 IST