గజలక్ష్మీ నమోస్తుతే!

ABN , First Publish Date - 2022-11-25T00:15:57+05:30 IST

:కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతీ దేవి గురువారం ఉదయం పల్లకీలో మోహిని రూపంలో.. రాత్రి బంగారు కాసులహారాన్ని ధరించి మహాలక్ష్మి రూపంలో గజ వాహనంపై భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.

గజలక్ష్మీ నమోస్తుతే!

తిరుచానూరు, నవంబరు 24:కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతీ దేవి గురువారం ఉదయం పల్లకీలో మోహిని రూపంలో.. రాత్రి బంగారు కాసులహారాన్ని ధరించి మహాలక్ష్మి రూపంలో గజ వాహనంపై భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, జీయర్ల పరివారం ప్రబంధ పారాయణం చేస్తుండగా గజవాహన సేవ నయనానందకరంగా ఆలయ మాడవీధుల్లో సాగింది. అమ్మవారికి హారతులిచ్చేందుకు భక్తులు పోటీపడ్డారు.వందలాదిమంది భక్తులతో ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి.సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన గజవాహన సేవ రాత్రి 10.50గంటలక ముగిసింది.రికార్డు స్థాయిలో అమ్మవారికి ఏడు వేల హారతుచ్చినట్లు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. గురువారం వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు అద్దాల మండపంలో పట్టుపీతాంబరం, వజ్రవైఢూర్య ఆభరణాలు, అభయహస్తంతో వయ్యారంగా కూర్చొని దివ్యమోహిని రూపంలో భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. పల్లకీ వాహనంలో వయ్యారంగా కూర్చున్న అమ్మవారు తన సుందర మనోహర సౌందర్యాన్ని ఎదురుగా ఉన్న దర్పణంలో చూసుకుని మురిసిపోతున్నట్లు కదులుతూ పరవశింపచేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.మధ్యాహ్నం స్నపన తిరుమంజనం తరువాత అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా సన్నిధి మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. పూజలు నిర్వహించాక సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారిని స్వర్ణకమల తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగిస్తూ అర్చకులు, టీటీడీ అధికారులు, అర్చకులు చందనం కలిపిన నీటిని భక్తులపై చల్లుతూ వసంతోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.పెద్ద, చిన్న జీయర్‌స్వాములు, టీటీడీ ఛైర్మన్‌ సుబ్మారెడ్డి,ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం,సదాభార్గవి,కలెక్టర్‌ వెంకట్రమణా రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా సహస్ర లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

పున్నమి గరుడసేవలో శ్రీవారికి అలంకరించే సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని గజవాహన సేవలో అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. ఇందుకోసం శ్రీవారి ఆలయం నుంచి టీటీడీ ఈవో ధర్మారెడ్డి లక్ష్మీకాసుల హారాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శిల్పారామం వద్ద జేఈవో వీరబ్రహ్మానికి అందజేశారు. అక్కడి నుంచి తిరుచానూరు పసుపు మండపం వద్ద జేఈవో ఆ హారాన్ని అర్చకులకు అందజేశారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర మాడవీధుల నుంచి అమ్మవారి ఆలయం వరకు వేడుకగా సాగింది. ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి మూలవర్లకు అలంకరించారు. రాత్రి గజవాహనసేవలో అమ్మవారు సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని ధరించి ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి గురువారం చెన్నై తిరునిండ్రకు చెందిన శ్రీరామానుజ కైంకర్య ట్రస్టు ఆర్గనైజింగ్‌ ట్రస్టీ రామ్మూర్తి ఆధ్వర్యంలో రెండు గొడుగులను ఆలయం ఎదుట అందజేశారు.అలాగే గురువారం ఉదయం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దంపతులు తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం తరపున పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించారు.

Updated Date - 2022-11-25T00:15:57+05:30 IST

Read more