వందేళ్ల బడిలో.. విశ్వమంత ఉత్సాహం

ABN , First Publish Date - 2022-08-15T06:38:06+05:30 IST

ఏరా మామా.. ఎలా ఉన్నావ్‌.. బావా నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదురా.. చిన్నప్పుడు స్టెప్‌ కటింగ్‌, కోరమీసాలతో ఉండేవాడివి.. ఇప్పుడు మీసాలు, తల తెల్లపడిపోయి తళతళలాడుతూ ఉండాయి.. ఒరే వీడి తలమీద క్రికెట్‌ ఆడుకునేంత గ్రౌండ్‌ ఉందిరా మనకు..

వందేళ్ల బడిలో.. విశ్వమంత ఉత్సాహం
సావనీర్‌ ఆవిష్కరిస్తున్న పూర్వ విద్యార్థులు

  - సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత 

పాఠశాలలో అట్టహాసంగా శతాబ్ది వేడుకలు

ఏరా మామా.. ఎలా ఉన్నావ్‌.. బావా నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదురా.. చిన్నప్పుడు స్టెప్‌ కటింగ్‌, కోరమీసాలతో ఉండేవాడివి.. ఇప్పుడు మీసాలు, తల తెల్లపడిపోయి తళతళలాడుతూ ఉండాయి.. ఒరే వీడి తలమీద క్రికెట్‌ ఆడుకునేంత గ్రౌండ్‌ ఉందిరా మనకు.. ఎన్నేళ్లు అయ్యిందిమే నిన్నుచూసి.. ఎలా ఉండావు.. ముఖంలో భాగా ముడతలొచ్చేశాయ్‌.. ఎంత అందంగా ఉండేదానివి చదువుకునేటప్పుడు.. నీవేంది ఇంత లావైపోయావు.. పిల్లలెంతమంది... ఏం చేస్తా ఉండారు.. ఇలా.. ఇప్పుడిప్పుడే పొట్టలు పొడుచుకొస్తున్న యువత నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అల్లరిగా.. ఆప్యాయంగా.. ఆనందంగా.. ఒకరినొకరు పలకరించుకుంటుంటే ఆ వందేళ్ల బడిలో విశ్వమంత ఉత్సాహం పరవళ్లు తొక్కింది. 


సూళ్లూరుపేట, ఆగస్టు 14: సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి వందేళ్లు.. అక్కడి జూనియర్‌ కళాశాలకి 50 ఏళ్లు నిండిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆదివారం శతాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల నేపథ్యంలో ఈ సంబరాలు జరిగాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని, ముచ్చట్లు పంచుకోవాలని ఈ బడిలో చదివి పలు దేశాల్లో స్థిరపడిన ఎందరో రెక్కలు కట్టుకొని వచ్చివాలిపోయారు. అమ్మమ్మలు, తాతయ్యలైన నాటి అమ్మాయిలు.. అబ్బాయిలు.. తమ వయసును మరచిపోయి చిన్ననాటి జ్ఞాపకాల దొంతరలలో విహరించారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం... అంటూ సినీ, బుల్లితెర నేపథ్య గాయకుడైన ఈ  పాఠశాల పూర్వ విద్యార్థి రాము ఆలాపనకి పూర్వ విద్యార్థులైన స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, చెంగాళమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ కాళంగి ప్రభాకర్‌, స్థానిక తహసీల్దారు కన్నంబాక రవికుమార్‌ తమ హోదాలను పక్కనబెట్టి వేదికపైన గొంతు కలిపారు.  ఆశీనులైనవారు కూడా డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే కిలివేటి బ్యాండ్‌ వాయిస్తూ హుషారెత్తించారు. ఈ వేడుకలకు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఆదూరు శ్రీనివాసులు సభకు అధ్యక్షత వహించారు. ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులను పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. షార్‌ డీజీఎం ఎల్‌.శ్రీనివాసులు కార్యక్రమ నిర్వహణకు సారథ్యం వహించారు. ఉపాధ్యాయుడు షేక్‌ ఉస్మాన్‌బాషా యాంకరింగ్‌ చేస్తూ సభలో జోష్‌ తెచ్చారు. సావనీర్‌ను డాక్టర్‌ కె.నారాయణ ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ అనురాధ,  స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు శ్రీహరిలు కళాశాలకు కావాల్సిన సదుపాయాలను తెలిపారు. పూర్వపు విద్యార్థులు 15 కమిటీలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

సన్మానాలు, సత్కారాలు

ప్రముఖులైన పూర్వ విద్యార్థులు.. డాక్టర్‌ కె.నారాయణ, రవీంద్ర సన్నారెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాళంగి ప్రభాకర్‌లతోపాటు భౌతిక శాస్త్రవేత్త డాక్టర్‌ షేక్‌ జమీరుద్దీన్‌, విశ్రాంత జిల్లా జడ్జి ఎంఆర్‌ శరవణకుమార్‌, కడప అడిషనల్‌ డీఎంహెచ్‌వో ఉమామహేశ్వరకుమార్‌,  ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాము, ప్రముఖ జర్నలిస్టు కాళహస్తి వాసుదేవ్‌, డాక్టర్‌ శ్రీనివాసకుమార్‌, తహసీల్దార్లు కె.రవికుమార్‌, లాజర్‌సలను సన్మానించారు. అలాగే ఈ కళాశాల పూర్వపు గురువులు జనార్దనరావు, రామగోపాల్‌రెడ్డి, రామసుబ్బయ్యలను సత్కరించారు. నేతాజీ సుబాష్‌ చంద్రబోస్‌ అంగరక్షకుడైన గోపరాజు అనంతవెంకటశర్మ కుమారుడు షార్‌ విశ్రాంత ఉద్యోగి శ్యామ్‌సుందర్‌ను సన్మానించారు. 


‘ అంతరిక్ష శాస్త్రవేత్త షార్‌ మాజీ డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ కె.నారాయణ తన వృద్ధాప్యాన్ని పక్కనబెట్టి గంటలకు గంటలు వేదికపైనే గడిపారు. తనకు క్రమశిక్షణ,  మానవతా విలువలు నేర్పిన బడి ఈ గుడి అంటూ గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. 


‘ శ్రీసిటీ అధినేత రవీంద్ర సన్నారెడ్డి ఈ కళాశాల తన అభివృద్ధికి మార్గం చూపిందంటూ ఈ పాఠశాల, కళాశాల అభివృద్ధికి నేను సైతం అంటూ హామీ ఇచ్చారు. ఓ నిల్వనిధి సమకూర్చుకుని భవిష్యత్తు విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు ఇస్తామని పూర్వపు విద్యార్థులకు సూచించారు. ఇక్కడి విద్యార్థులకు డైనింగ్‌ హాల్‌ కానీ,  లైబ్రరీ కానీ నిర్మించి ఇస్తానని చెప్పారు. 


‘ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తాను హాస్టల్‌లో ఉంటూ ఈ స్కూల్‌లో చదువుకున్నానని ప్రభుత్వ పరంగా ఈ పాఠశాల అభివృద్ధికి నేనున్నానంటూ చెప్పారు. ఈ పాఠశాల ఆవరణలో హాస్టల్‌ నిర్మింపచేస్తామని అన్నారు. 






Read more