‘స్పందన’ అర్జీలకు అధిక ప్రాధాన్యం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-04-26T07:49:34+05:30 IST

స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

‘స్పందన’ అర్జీలకు అధిక ప్రాధాన్యం: కలెక్టర్‌
సర్వర్‌ డౌన్‌ కావడంతో బారులు తీరిన జనం - అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుచానూరు, ఏప్రిల్‌ 25: స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌  వెంకటరమణారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావులతో కలిసి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. 


వచ్చిన అర్జీలు 125 

కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమానికి మొత్తం 125 అర్జీలు వచ్చాయి. వీటిల్లో.. రెవెన్యూశాఖకు 90, హౌసింగ్‌, పోలీసు, పౌరసరఫరాలు, మున్సిపల్‌శాఖలకు నాలుగుచొప్పున, విద్యుత్‌శాఖకు రెండు, మిగిలిన శాఖలకు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 


సర్వర్‌ డౌన్‌తో ఇబ్బందిపడ్డ జనం

జనం నుంచి అర్జీలు స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదుచేశాక బాధితులను అధికారుల వద్దకు పంపుతారు. అయితే సర్వర్‌ డౌన్‌ కారణంగా రిసెప్షన్‌ కార్యాలయంలోని మూడు కంప్యూటర్లు కూడా సరిగా పనిచేయలేదు. దీనివల్ల వృద్ధులు, చంటిపిల్లల తల్లులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ కౌంటర్లు, కంప్యూటర్ల సంఖ్యను పెంచి.. సర్వర్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు. 


‘మెటర్నిటీ’ అధికారులు అన్యాయం చేశారు

‘అయ్యా మేము చాలా పేదవాళ్లం. మాది శ్రీకాళహస్తి భాస్కరపేట. గత ఏడాది నవంబరులో తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తు చేశాను. మెరిట్‌లిస్టు విడుదలైంది. అందులో నాకు 14 నెంబరులో 65.94శాతం చూపారు. ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డాను. కానీ ఆస్పత్రి అధికారులు 57.19 శాతం మెరిట్‌ ఉన్న 45వ నెంబరు కల్గిన నెల్లూరు మహిళకు ఆ పోస్టు ఇచ్చారు. తక్కువ మెరిట్‌ ఉన్న మరో మహిళకు ఉద్యోగం ఎలా ఇస్తారు’ అంటూ కౌముది విలపించారు. తక్షణం దీనిపైన విచారణ జరపాలని డీఆర్వో శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. 


పింఛన్‌ ఇప్పించండయ్యా

‘మాది తిరుపతిలోని గిరిపురం. గతంలో పెయింటర్‌గా ఉండేవాడిని. నాలుగేళ్ల కిందట పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయింది. పింఛన్‌ ఇప్పించండని అధికారుల వద్దకెళితే రుయాస్పత్రిలో సదరన్‌ సర్టిఫికెట్‌ తీసుకుని రమ్మన్నారు. నడవలేని స్థితిలోనూ ఏడాదిగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మీరైనా సాయం చేసి, పింఛన్‌ ఇప్పించండయ్యా. కుటుంబ పోషణ కష్టంగా ఉంది’ అంటూ దొరైరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 


షుగర్‌ ఫ్యాక్టరీ మోసం చేసింది 

‘ఆరుగాలం కష్టపడి చెరుకు పంట వేశాను. పంట చేతికొచ్చాక మయూరి షుగర్‌ ఫ్యాక్టర్‌కి ఇచ్చాం. నాలుగేళ్లు గడిచినా ఇంతవరకు మా డబ్బులు ఇవ్వలేదు. పంటకోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఎకరా భూమి అమ్మేశాను. చేతికొచ్చిన పిల్లల పెళ్లిళ్లు చేయాలి. అధికారులు చొరవ తీసుకుని ఫ్యాక్టరీవారి నుంచి డబ్బులు ఇప్పించేలా చూడండి’ అని ఏర్పేడు సదాశివపురానికి చెందిన రైతు రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Read more