ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-12-13T02:14:01+05:30 IST

మాండస్‌ తుఫాను ప్రభావంతో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదయ్యింది.

ముంచెత్తిన వాన
వాకాడు మండలం తిరుమూరులో నీట మునిగిన పొలాలు

తిరుపతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాండస్‌ తుఫాను ప్రభావంతో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాళహస్తి మండలంలో ఏకంగా 31.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఎర్రావారిపాలెం మండలంలో 10.5 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. మొత్తం మీద 17 మండలాల్లో 20-31 సెంటీమీటర్ల నడుమ వర్షాలు కురవగా మిగిలిన 17 మండలాల్లో 10-20 సెంటీమీటర్ల నడుమ కురిశాయి. కాగా జిల్లాలో ఈ నెల 122.7 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా మాండుస్‌ తుఫాను వల్ల ఐదు రోజుల్లోనే 205 మిల్లీమీటర్ల వర్షం కురవడం గమనార్హం.

మాండస్‌ ధాటికి కోలుకునేదెప్పుడు?

మాండస్‌ తుఫాను ప్రభావం వల్ల సోమవారం కూడా కొన్ని మండలాల్లో వానలు జోరుగా పడ్డాయి. దీంతో వాగులు, వంకల ఉధృతి కొనసాగుతునే వుంది. పలుచోట్ల గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకుని వున్నాయి. ప్రవాహాలు తగ్గకపోవడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.పలు మండలాల్లో పంట పొలాలుఇంకా నీటమునిగే వున్నాయి.జిల్లా అధికార యంత్రాం గం ఓ వైపు సహాయక చర్యలు కొనసాగిస్తుండడంతో పాటు నష్టం అంచనా వివరాలనూ సేకరించే పనిలో నిమగ్నమై వుంది.

స్పందనకు తగ్గిన ఫిర్యాదులు

జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వర్షాలు కురుస్తుండడంతో పాటు ప్రత్యేకించి తిరుపతిలో భారీ వర్షం సంభవించడంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయి.ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసు స్పందనలోనూ అదే పరిస్థితి కనిపించింది.

తిప్పగుంటపాలేన్ని చుట్టుముట్టిన వరద నీరు

చిల్లకూరు మండలంలో కండలేరు నుంచీ వచ్చే వరద నీరు, అలాగే పంబలేరు వాగు, చల్ల కాలువల నీరంతా తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరులో కలుస్తాయి. తాజా వర్షాలకు వీటి ద్వారా భారీగా నీరు వచ్చి చేరడంతో తిప్పగుంటపాలెం వరద నీటిలో చిక్కుకుంది. పారిచర్లవారిపాలెం నుంచీ తిప్పగుంటపాలెం వెళ్ళే రోడ్డులో కాజ్‌వేపై ప్రవాహ ఉధృతి ఎక్కువగా వుండడంతో మూడు రోజులుగా ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కూడా పరిస్థితిలో మార్పు లేదు. గ్రామంలోని గర్భవతి స్వరూపకు, డయాలసిస్‌ రోగి శ్రీనివాసులురెడ్డికి వైద్య సేవలు అవసరం కావడంతో ఆర్డీవో కిరణ్‌కుమార్‌ సిబ్బందితో కలసి సోమవారం ఉదయం బోటుపై గ్రామానికి చేరుకుని వారిద్దరినీ బోటులో వెలుపలికి తీసుకొచ్చారు. తర్వాత 108 అంబులెన్సులో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.కోట మండలంలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందపల్లి, గోవిందపల్లిపాలెం గ్రామాల మధ్య శనివారం నుంచీ రాకపోకలు స్తంభించాయి. దీంతో సోమవారం మత్స్యకారులు సొంత పడవల్లో కోటకు వచ్చి సరుకులు తీసుకుని తిరిగి వెళ్లారు.ఏర్పేడు మండలంలోనూ పలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బండారుపల్లెలో మిల్లు వీధితో పాటు ప్రధాన వీధుల్లోకి ఇళ్ళలోకి వస్తున్న నీటిని జనం బిందెలు, బక్కెట్లతో ఎత్తి దిగువకు పోసుకుంటున్నారు. పాగాలి పంచాయతీ కుమ్మరగుంట ఎస్టీ కాలనీలో ఇళ్ళలోకి కూడా వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే పంచాయతీ పరిధిలోని రాజులపాలెం ఎస్టీ కాలనీ చుట్టూ ఏడాది కిందట రోడ్డు ఙపనికోసం ఓ కాంట్రాక్టరు మట్టి తవ్వించారు. దీంతో గ్రామం చుట్టూ కందకం లాగా ఏర్పడిపోయింది. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇందులో నీరు చేరి గ్రామానికి బయటికి రాకపోకలు ఆగిపోతున్నాయి. తాజా వర్షాలకు అదే పరిస్థితి ఏర్పడింది. చింతలపాలెం పంచాయతీ ఎస్టీ కాలనీ చెరువు కట్ట పక్కనే వుంది. బాగా పల్లంలో వుండడంతో చెరువు నీరు కాలనీలోని ఇళ్ళలోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థ పడుతున్నారు.ఏర్పేడు నుంచీ కొత్తవీరాపురం మీదుగా మోదుగులపాలెం వెళ్ళే మార్గంలో స్వర్ణముఖి నది ఉధృతి కారణంగా నాలుగు రోజుల నుంచీ రాకపోకలు స్తంభించిపోయాయి.

గొట్టికాడు చెరువుకు రైతులతో కలసి ఆర్డీవో మరమ్మతులు

బాలాయపల్లి మండలంలో ప్రమాదకర స్థితిలో వున్న గొట్టికాడు చెరువుకు రైతులతో కలసి ఆర్డీవో కిరణ్‌కుమార్‌ మరమ్మతు పనులు చేపట్టారు.చెరువులోకి దిగి ఆవలివైపుకు చేరుకుని తెలుగు గంగ కాలువ నీరు చెరువులోకి రాకుండా కాలువను దారి మళ్ళించారు. వాకాడు మండలం ముట్టెంబాక గ్రామం వరద నీటిలో మునిగిపోకుండా కాపాడేందుకు అధికారులు రోడ్డును తెగ్టొట్టారు. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా పులి కాలువ, స్వర్ణముఖి నది నీరు ఈ గ్రామంలోకి వచ్చేస్తాయి. తాజా వర్షాలకు కూడా అదే పరిస్థితి తలెత్తడంతో ముట్టెంబాక-చిట్టమూరు రోడ్డును అధికారులు తెగ్గొట్టారు. దీంతో గ్రామం ప్రమాదం నుంచీ బయటపడినప్పటికీ నీరంతా తిరుమూరు, దుగ్గవరం, పల్లిపాలెం, దుగరాజపట్నం గ్రామాల పొలాల్లోకి వెళ్ళిపోయాయి. ఫలితంగా సుమారు 3 వేల ఎకరాల్లో వరి పైరు నీట మునిగింది.శ్రీకాళహస్తి పట్టణంలో చెంచులక్ష్మి కాలనీ, శ్రీరామనగర్‌ కాలనీ ఇంకా నీటిలోనే వున్నాయి. చెంచులక్ష్మి కాలనీ నుంచీ గత శనివారం 24 మందిని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌కు తరలించారు. ఆదివారం ఇళ్ళకు పంపించారు. తిరిగి సోమవారం వర్షాలకు నీరు పెరగడంతో మళ్ళీ వారిని హాస్టల్‌కు తరలించారు. గంగలపూడి ఎస్టీ కాలనీలో ఏడు గుడిసెలు దెబ్బతిన్నాయి.గంగలపూడి, ఓబులాయపల్లి, ముళ్లపూడి, ఎర్రగుడిపాడు, ఉడవలపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల వద్ద ప్రవహించే వాగులు పొంగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత శనివారం రాకపోకలు పునరుద్ధరించగా సోమవారం కురిసిన వర్షాలకు ప్రవాహాలు పెరగడంతో మళ్ళీ రాకపోకలు ఆగిపోయాయి. కేవీబీపురం మండలంలో అతి పెద్ద చెరువైన రాయల చెరువుకు బొగడ పడింది.ఇది పెద్దదైతే చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలు ముంపు ప్రమాదంలో పడే అవకాశముంది.వేరుశనగ,వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలుచోట్ల నీటిలోనే పంటపొలాలు

జిల్లాలో పలు చోట్ల ఇంకా పంటపొలాలు వరద నీటిలోనూ, వర్షపు నీటిలోనూ మునిగి వున్నాయి. కోట మండలం గూడలి, గూడలి దక్షిణ పొలం, రాజుపాలెం, సింగలపూడి, వెంకన్న పాలెం, ఊలుగుంటపాలెం, రుద్రవరం గ్రామాల్లో వరి పైరు నీట మునిగే వున్నాయి. అధికారిక సమాచారం ప్రకారమే ఈ మండలంలో 5700ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తడ మండలం గ్రద్దగుంట, చేనిగుంట, కొండూరు, వాటంబేడు, కాదలూరు గ్రామాల్లో పొలాలు నీట మునిగి వున్నాయి. మండలం మొత్తం మీద 1080 ఎకరాలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించగా కేవలం ఈ ఐదు గ్రామాల్లోనే 500 ఎకరాలు నీట మునిగాయి. మరోవైపు వేనాడు, ఇరకం దీవుల్లోని పొలాల్లోకి పులికాట్‌ ఉప్పునీరు చేరడంతో 300 ఎకరాల వరి పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది. సోమవారం రాత్రికల్లా నీరు తగ్గితే పంట ఎంతోకొంత చేతికొస్తుంది. లేదంటే పనికిరాదు. అయితే సోమవారం గంటన్నర పాటు భారీ వర్షం పడింది. అందువల్ల చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీఎన్‌ కండ్రిగ మండలం పల్లమాల గ్రామంలో కాళంగి వరద నీటితో 60 ఎకరాలు నీట మునిగాయి. వరి పంట సాగవుతూన్న ఈ పొలాల్లో పది ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బ తింది.

నష్ట అంచనాల్లో అధికారులు

మాండస్‌ తుఫానుతో ఏర్పడిన నష్టాన్ని యంత్రాంగం అంచనా వేస్తోంది.ఇప్పటివరకు 7 పశువులు, 9 దూడలు, 13 గొర్రెలు చనిపోయినట్టు తేలింది.159 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.పంట నష్ట అంచనాలను ఈనెల 21లోపు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశించారు.వరదల నేపథ్యం లో పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టిపెట్టాలని కలెక్టర్‌ వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయక చర్యలు, అందించాల్సిన పరిహారాలపై దిశానిర్దేశం చేశారు.జేసీ బాలాజీ మాట్లాడుతూ వర్ష బాధితులకు నిత్యావసరవస్తువులు సక్రమంగా అందేలా చూడాలన్నారు.

తిరుపతిలో మళ్లీ కుండపోత

తిరుపతిలో ఆదివారం కాస్త తెరపిచ్చిన వాన సోమవారం మళ్లీ ముంచెత్తింది.రోడ్లపై వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయలచెరువు, కల్యాణీ డ్యామ్‌ నిండుకుండలా మారింది. కొన్ని గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో సోమవారం కూడా వర్షం కురిసింది. ఘాట్‌రోడ్డులో పలుచోట్ల వృక్షాలు కూలుతున్నాయి. కొండచరియలు విరిగిపడనప్పటికీ చిన్నపాటి రాళ్ళు రోడ్డుపైకి వచ్చి పడుతుండడంతో టీటీడీ యంత్రాంగం ఘాట్‌ రోడ్లలో నిఘా, పర్యవేక్షణను మరింత పెంచింది. కొండపై నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలి తీవ్రత పెరిగిపోయింది. చలిగాలులతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

మండలం వర్షపాతం

(మిల్లీమీటర్లలో)

శ్రీకాళహస్తి 312.8

తొట్టంబేడు 308.4

నాయుడుపేట 303.6

కేవీబీపురం 298.6

బీఎన్‌ కండ్రిగ 284.8

ఓజిలి 276.8

వాకాడు 262.6

కోట 261

చిల్లకూరు 256.4

బాలాయపల్లి 263.2

గూడూరు 243.4

సూళ్ళూరుపేట 233.6

పెళ్ళకూరు 229

దొరవారిసత్రం 219.6

వరదయ్యపాలెం 215

ఏర్పేడు 209.8

సత్యవేడు 209.4

చిట్టమూరు 198.4

వెంకటగిరి 197

డక్కిలి 188.4

తడ 188.4

నారాయణవనం 182.4

పుత్తూరు 175.2

పిచ్చాటూరు 170.4

వడమాలపేట 167.2

రేణిగుంట 159

తిరుపతి అర్బన్‌ 141.2

చిన్నగొట్టిగల్లు 137

రామచంద్రాపురం 129.4

తిరుపతి రూరల్‌ 125.6

చంద్రగిరి 114.2

నాగలాపురం 111.6

పాకాల 109.2

ఎర్రావారిపాలెం 105

జిల్లా సగటు 205.2

Updated Date - 2022-12-13T02:14:03+05:30 IST