వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...

ABN , First Publish Date - 2022-10-02T05:13:36+05:30 IST

తమ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన భార్య ఉదంతమిది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

భర్తను హత్య చేయించిన భార్య


ఛేదించిన పోలీసులు


కుప్పం, అక్టోబరు 1: తమ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యువకులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన భార్య ఉదంతమిది. కుప్పం మండలం కె.కృష్ణాపురం సమీపంలో గతనెల 28వ తేదీన వెలుగుచూసిన హరీష్‌కుమార్‌(30) హత్య వెనుక ఉన్న కథ ఇది.  హత్య కారణాలను శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలమనేరు డీఎస్పీ గంగయ్య వెల్లడించారు. కుప్పం మండలం గరిగచీనేపల్లెకు చెందిన హరీష్‌కుమార్‌ (30), స్నేహ (24) భార్యాభర్తలు. రామకుప్పం మండలం టేకుమానుతాండాకు చెందిన బి.సతీష్‌నాయక్‌తో స్నేహ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి  హరీష్‌ అడ్డువస్తున్నాడని భావించిన స్నేహ... సతీష్‌నాయక్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఇద్దరూ కలిసి రామకుప్పం మండలం రామాపురం తాండాకు చెందిన ఎం.అనిల్‌కుమార్‌ నాయక్‌, వీర్నమల తాండాకు చెందిన ఎం.శ్రీధర్‌నాయక్‌, బీఎన్‌.చరణ్‌కుమార్‌ నాయక్‌, ఎం.బాలాజీనాయక్‌తో హరీష్‌కుమార్‌ హత్యకు రూ.5 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో రూ.30 వేలు అడ్వాన్సుగా చెల్లించారు. ఈ క్రమంలో  సెప్టెంబరు 25తేదీన తన స్నేహితురాలి తమ్ముడు తనకు డబ్బులు ఇవ్వాల్సిఉందని అతనెక్కడుంటాడో గుర్తులు తెలుపుతూ హరీష్‌ను పంపింది స్నేహ. కె.కృష్ణాపురంలో వేచి ఉన్న నలుగురు నిందితులు డబ్బు తీసి ఇస్తామని చెప్పి హరీష్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి  గొంతుకోసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహ ఏమీ తెలియనట్లుగా గతనెల 28న కుప్పం పోలీసు స్టేషన్‌కు వచ్చి తన భర్త హరీష్‌కుమార్‌ గత నెల 25వ తేదీనుంచి కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. అదే నెల 28న కె.కృష్ణాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం ఉన్నట్టు పశువులకాపర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఎం.అనిల్‌కుమార్‌, ఎం.శ్రీధర్‌నాయక్‌, బీఎన్‌.చరణ్‌కుమార్‌ నాయక్‌, ఎం.బాలాజీ నాయక్‌... హరీష్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేల్చారు. హత్యకు స్నేహ, ఆమె ప్రియుడు సతీష్‌నాయక్‌లు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. మొత్తం ఆరుగురు నిందితులను శనివారం గరిగచీనేపల్లె  వద్ద అరెస్టు చేసి కోర్టు ఆదేశాల ప్రకారం రిమాండ్‌కు తరలించారు. హరీష్‌కుమార్‌ హత్య చేసు ఛేదనలో సమర్థంగా వ్యవహరించిన కుప్పం అర్బన్‌ సీఐ టి.శ్రీధర్‌, ఎస్‌ఐలు శ్రీధర్‌, కేబీ.శివకుమార్‌; పీఆర్‌.లక్ష్మీరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనంద, పీసీలు ఎం.సుందరరాజు, చంద్రశేఖర్‌, జయప్ప, క్రైమ్‌ పార్టీ నటరాజ్‌, రత్నప్పను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.



Updated Date - 2022-10-02T05:13:36+05:30 IST