చంద్రగిరి నుంచి నానీకి పచ్చజెండా

ABN , First Publish Date - 2022-10-01T07:44:06+05:30 IST

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఽభ్యర్థిగా పులివర్తి నానీయే పోటీ చేయనున్నారు.

చంద్రగిరి నుంచి నానీకి పచ్చజెండా
చంద్రగిరి సెగ్మెంట్‌పై నానీతో సమీక్షిస్తున్న చంద్రబాబు

టీడీపీ నియోజకవర్గ సమీక్షలో అధినేత స్పష్టత


తిరుపతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఽభ్యర్థిగా పులివర్తి నానీయే పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టత లభించింది.తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేశామని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని, అనుమానాలు పెట్టుకోకుండా జనంలోకి వెళ్లాలని ఆయన్నుంచి స్పష్టమైన దిశా నిర్దేశం అందడంతో నానీ ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు.శుక్రవారం మధ్యాహ్నం 12.10 నుంచి 1.50 గంటల వరకూ గంటా నలభై నిమిషాలపాటు నానీతో చంద్రబాబు సమావేశమయ్యారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంతోపాటు చంద్రగిరి సెగ్మెంట్‌పైనా సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా అడిగి తెలుసుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిపై చంద్రబాబు గతానికి భిన్నంగా ఈ పర్యాయం ప్రత్యేక ఆసక్తి కనబరిచినట్టు సమాచారం. మండలస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసేందుకు యత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగిరి నుంచి ఈసార్టి గెలవాలని స్పష్టం చేశారు. పార్టీ పరంగానూ, తన స్థాయిలోనూ అవసరమైన సహకారం పూర్తిగా అందుతుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఇన్‌చార్జిగా పూర్తి శక్తియుక్తులన్నీ వినియోగించి ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ శ్రేణులకు పూర్తిస్థాయిలో అందుబాటులో వుండాలని నానీని ఆదేశించారు. నానీ చిత్తూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున ఆ మేరకు స్థాయికి తగ్గట్టుగా చంద్రగిరిలో పార్టీని పటిష్ఠంగా నిలపాలని సూచించారు. గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోవాలని, అక్కడ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు. పులివర్తి నాని చంద్రగిరి కంటే చిత్తూరు నుంచి పోటీకే మొగ్గు చూపుతున్నారని, ఆ మేరకు అధిష్ఠానం కూడా సుముఖంగా వుందని కొంతకాలంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. చంద్రగిరిలో నానీ స్థానంలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించుతారన్న ఊహాగానాలు సాగాయి. వీటన్నింటికీ శుక్రవారం అధినేత స్పష్టీకరణతో చెక్‌ పడింది. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇదివరకే పీలేరు అసెంబ్లీ సీటుకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన అధినేత చంద్రబాబు తాజాగా చంద్రగిరి సీటు విషయంలోనూ నానీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండు స్థానాలకు లైన్‌ క్లియర్‌ చేసినట్టయింది. త్వరలో జరగనున్న తిరుపతి జిల్లా మినీ మహానాడులో మరిన్ని స్థానాల విషయంలో అధినేత స్పష్టత ఇచ్చే అవకాశముంది.

Updated Date - 2022-10-01T07:44:06+05:30 IST