వైభవంగా జెండా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T07:59:12+05:30 IST

గూడూరులో ఆంజనేయస్వామి జెండా ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ముందుగా కలశంకొట్టు వద్ద ఆంజనేయస్వామి జెండాకు పూజలు నిర్వహించారు.

వైభవంగా జెండా ఉత్సవాలు

గూడూరు, సెప్టెంబరు 25: గూడూరులో ఆంజనేయస్వామి జెండా ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ముందుగా కలశంకొట్టు వద్ద ఆంజనేయస్వామి జెండాకు పూజలు నిర్వహించారు. తర్వాత పట్టణ పొలిమేర్లలో జెండాను తిప్పి తిరిగి తీసుకొచ్చి.. కలశం కొట్టు వద్ద ప్రతిష్ఠించడంతో జెండా పండుగ ప్రారంభమైంది. తర్వాత పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాలను ట్రాక్టర్లపై అలంకరించిన ఆర్చిలో ఉంచి ఊరేగించారు. ఈ ఊరేగింపు ముందు తెనాలి బ్యాండు, డీజే, బేతాళ, హనుమ నృత్యాలు, విద్యుదీపాలంకరణలు, జింగిరి మేళం, తప్పెట్లు, తాళాలు, బాణాసంచా పేలుళ్లు, కోలాట నృత్యాలు, బుట్టబొమ్మల వేషధారణలు, పార్వతీమహిషాసురుల యుద్ధనాట్యాలు, యువకుల చిందుల మధ్య సందడిగా సాగింది. రాత్రయ్యేకొద్దీ పట్టణంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసరెడ్డి, హజరత్‌బాబు, వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నేటినుంచి కలశాలు: పట్టణంలోని నారాయణమ్మ పేరంటాళ్లు, మహాలక్ష్మమ్మ, కన్యకాపరమేశ్వరి, రాజరాజేశ్వరి, గంగమ్మ, మాళవ్యనగర్‌ మహాలక్ష్మమ్మ, ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి, తదితర ఆలయాల్లో సోమవారం కలశ స్థాపన జరిపి శరన్నవరాత్రులను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే సాయి సత్సంగ నిలయంలో హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కోట సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో శ్రీవిజయదుర్గా దేవికి కలశస్థాపన కార్యక్రమం చేపట్టారు.  

Read more