గోవిందా..! ఏంటిది?

ABN , First Publish Date - 2022-05-30T07:44:21+05:30 IST

దశాబ్దం కిందటి ఆలోచనకు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ పుణ్యమా అని గత టీడీపీ ప్రభుత్వం చొరవతో గరుడ వారధి పట్టాలెక్కింది.

గోవిందా..! ఏంటిది?

దశాబ్దం కిందటి ఆలోచనకు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ పుణ్యమా అని గత టీడీపీ ప్రభుత్వం చొరవతో గరుడ వారధి పట్టాలెక్కింది. శంకుస్థాపన జరిగిన కొద్దిరోజులకే రాత్రికి రాత్రే వారధి నిర్మాణ సన్నాహాలు మొదలయ్యాయి. రెండేళ్ల నిర్మాణ గడువున్నా, ముందే వారధి పూర్తి చేయాలని ఆ సమయంలో ఆఫ్కాన్స్‌ కృషిచేసింది. రూ.684 కోట్ల బడ్జెట్‌తో తిరుచానూరు రోడ్డు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు దాదాపు ఏడు కి.మీ ఫ్లైఓవర్‌ తొలుత డిజైన్‌ చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిజైన్‌లో మార్పులు చేయడంతో రూ.585కోట్ల బడ్జెట్‌కు కుదించారు. ఇప్పటివరకు రూ.425కోట్ల విలువచేసే నిర్మాణం జరిగింది. అయితే కాంట్రాక్ట్‌ సంస్థ చేతికొచ్చింది మాత్రం రూ.275కోట్లు  (స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ నుంచి మొబలైజేషన్‌ నిధుల కింద రూ.195 కోట్లు, టీటీడీ నుంచి రూ.80 కోట్లు) మాత్రమే. 


లైట్‌ తీసుకున్నారా?

2020 డిసెంబర్‌ కల్లా పూర్తికావాల్సిన వారధి అనేక అవాంతరాల వలన 2022 డిసెంబర్‌ లోపు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌, టీటీడీ పెద్దలు మాత్రం అప్పుడు అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. శ్రీనివాసం నుంచి అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ వరకు పాక్షికంగా వారధి ప్రారంభమైపోయిందన్న ధీమాతో లైట్‌ తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో వారధి అందుబాటులోకి వస్తేనా ట్రాఫిక్‌ కష్టాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు కాంట్రాక్టు సంస్థకు ఈపాటికే నిధులు అందాల్సి ఉంది. 


సొంత నిధులు వెచ్చించిన సంస్థ!

ఆఫ్కాన్స్‌ సంస్థ సొంత నిధులు రూ.150 కోట్లకుపైగా వెచ్చించినట్టు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌కు లెక్కలు సమర్చించినట్టు సమాచారం. టీటీడీ గత నెలలో జరిగిన పాలకమండలి సమావేశంలో మూడో విడత వాటా కింద రూ.100 కోట్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు రూపాయి కూడా ఆఫ్కాన్స్‌కు చేరలేదు. దీంతో ఇక చేతినుంచి పెట్టుకునే పరిస్థితి లేదని ఆఫ్కాన్స్‌ మేనేజ్‌మెంట్‌ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 500 మంది కార్మికులకు జీతాలు అందక వెళ్లిపోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరాలో ఇబ్బందులు రావడంతో ‘ఇక పనిచేయలేం’ అన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


ప్రజలు పోరాటాలు చేయాలా?

పాలకుల సమన్వయలోపం, అనాలోచిన నిర్ణయాలకు విసిగిన ప్రజలు గతంలో వారధిని పాక్షికంగా వారే ప్రారంభించుకున్న విషయం 

తెలిసిందే. ఇపుడు నిర్మాణ పనులు వేగవంతం అయ్యేందుకు 

పోరాటాలు చేసే పరిస్థితి తీసుకురాకుండా చర్యలు 

తీసుకుంటారని ఆశిద్దాం. 

Updated Date - 2022-05-30T07:44:21+05:30 IST