కల్యాణ వైభోగమే

ABN , First Publish Date - 2022-03-04T05:43:46+05:30 IST

దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ వచ్చింది.

కల్యాణ వైభోగమే
శివపార్వతుల కల్యాణానికి విచ్చేసిన భక్తులతో నిండిన వీధులు

ఆదిదంపతుల వివాహ వేడుకకు పెండ్లిమండపం ముస్తాబు


శ్రీకాళహస్తి, మార్చి 3: దక్షిణ కైలాసానికి కల్యాణ శోభ వచ్చింది.  శ్రీకాళహస్తిలో ఎక్కడ చూసినా ఆది దంపతుల పెళ్లి సందడే కన్పించింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగే పెళ్లికి గురువారం రాత్రి నుంచే సంబరం ప్రారంభమైంది.పట్టణంలోని కైకాలవారి పెండ్లిమండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. మామిడి తోరణాలు కట్టి అరటి చెట్లు ఏర్పాటు చేశారు. నెహ్రూవీధి, నగిరివీధుల్లో భక్తజనులు, పెళ్లిబృందాలు విడిది చేయడానికి బారికేడ్లను ఏర్పాటు చేశారు.బ్యాలవివాహాలు జరగకుండా గట్టి నిఘా పెట్టారు.పట్టణంలోకి ప్రవేశించే అన్ని దారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.గురువారం రాత్రి పరమశివుడు, జ్ఞానప్రసూనాంబ ఉత్సవమూర్తులకు అలంకార మండపంలో టీటీడీ అందజేసిన పట్టువస్త్రాలను కట్టి  స్వర్ణాభరణాలతో అలంకరించాక పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తీశ్వరుని గజవాహనంపైనా... జ్ఞానప్రసూనాంబదేవిని సింహవాహనంపై అధిష్టింపజేసి పెండ్లిమండపం వద్దకు బయల్దేరారు.వేకువజామున 3గంటల ప్రాంతంలో కల్యాణం నిర్వహించాలని ఆలయ పండితులు నిర్ణయించారు.మంగళవాయిద్యాలు, మేళతాళాలు మోగుతుండగా... పరివారం ముందు నడుస్తుండగా స్వామి అమ్మవార్లు పెండ్లిమండపం వద్దకు చేరుకున్నారు.పార్వతీ పరమేశ్వరులు దంపతులయ్యే కల్యాణఘడియలో వివాహం చేసుకునేందుకు పలు జంటలు శ్రీకాళహస్తికి తరలివచ్చాయి. Read more