కొంచెం బ్రేక్‌ ఇచ్చి.. మళ్లీ మొదలెట్టి..!

ABN , First Publish Date - 2022-03-16T06:10:37+05:30 IST

వారం రోజులు ఆపారు. మళ్లీ అక్రమంగా మట్టి తరలిస్తున్నారు.

కొంచెం బ్రేక్‌ ఇచ్చి.. మళ్లీ మొదలెట్టి..!

యథేచ్ఛగా బండపల్లె కొండ మట్టి తరలింపు 


చిత్తూరు, మార్చి 15: వారం రోజులు ఆపారు. మళ్లీ అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అధికారుల అండతో అధికార పార్టీ నాయకులు ఇలా మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. ‘బండపల్లె కొండ కరిగిపోతోంది’ అంటూ వారం రోజులకు ముందు ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దాంతో కొండపై ఉన్న ఎక్స్‌కవేటర్‌ను, పది టిప్పర్లను కిందకు దించేశారు. అనుమతి లేకుండా మట్టి తీస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌, వీఆర్వో హెచ్చరించారు. ఎక్సవేటర్‌, టిప్పర్లను రెండు రోజుల పాటు ఓ మామిడితోపులో ఉంచి.. తీసుకెళ్లిపోయారు. వారం గడిచిందో లేదో.. తిరిగి అధికార పార్టీకే చెందిన ఓ చోటా నాయకుడు అక్కడ నుంచి మట్టి తరలిస్తున్నాడు. కొండపై నుంచి ట్రాక్టర్ల ద్వారా మట్టిని కిలో మీటరు దూరం వరకు తీసుకెళ్లి.. అక్కడ టిప్పర్లకు నింపుతున్నారు. డిమాండును బట్టి టిప్పర్‌ మట్టి రూ.6500 నుంచి రూ. 7500 వరకు ధర పలకడంతో రెండు రోజులుగా మట్టిని జోరుగా తరలిస్తున్నారు. ఇదివరకే మట్టి తరలిస్తున్న కొండ ప్రాంతంలో రెండు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మిగిలిన ప్రాంతం మేతభూమి. దీనిని చదును చేస్తే మూగజీవాలను ఎలా మేపుకోవాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read more