గారాబం.. కాకూడదు విషాదం

ABN , First Publish Date - 2022-06-12T07:35:58+05:30 IST

నిత్యం పుస్తకాల్లోకి మాత్రమే తొంగిచూసే విద్యార్థులు.. తమ తల్లిదండ్రుల కష్టనష్టాల్లోకి చూడడం లేదు. తామేమి అడిగినా కాదనకుండా అప్పు చేసైనా కొనిస్తారనే నమ్మకంతో తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు.

గారాబం.. కాకూడదు విషాదం
చిత్తూరులో శుక్రవారం నాటి ప్రమాదంలో దెబ్బతిన్న బైకు.. రోడ్డు పక్కనున్న ఈ రాతిబండలపై పడటంతో మృతిచెందిన విద్యార్థులు

 ఖరీదైన బైకులు కొనిస్తున్న తల్లిదండ్రులు 

 పెరుగుతున్న విద్యార్థుల బైక్‌ ప్రమాదాలు

 దూకుడు డ్రైవింగ్‌తో ఛిద్రమవుతున్న బతుకులు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి

నిత్యం పుస్తకాల్లోకి మాత్రమే తొంగిచూసే విద్యార్థులు.. తమ తల్లిదండ్రుల కష్టనష్టాల్లోకి చూడడం లేదు. తామేమి అడిగినా కాదనకుండా అప్పు చేసైనా కొనిస్తారనే నమ్మకంతో తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. సుతిమెత్తగా మందలించి పర్యవసానాల్ని విడమర్చి చెప్పాల్సిన తల్లిదండ్రులు అతి గారాబంతో పిల్లల మాటల్ని కాదనలేకపోతున్నారు. పిల్లల కళ్లల్లో ఆనందమే ధ్యేయంగా వారు చూపిస్తున్న అతి గారాబం చాలా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. మితిమీరిన వేగంతోనో.. దురుసు డ్రైవింగ్‌తోనో ప్రాణాలు పోగొట్టుకుంటున్న విద్యార్థులు.. వారి కుటుంబాలను శోకసముద్రంలోకి నెడుతున్నారు. ఎదిగిన బిడ్డలు జీవితంలో స్థిరపడి రాణిస్తారన్న తల్లిదండ్రుల కలలు కల్లలవుతున్నాయి. పుస్తక జ్ఞానం మాత్రమే వంట పట్టించుకుని జల్సాలు చేయడం ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత జీవితాలను చదువుకోవాల్సిన, వాస్తవ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కూడా ఒత్తిళ్లకు లోనయితే జీవితకాల దుఃఖాలను భరించాల్సి వస్తుంది. 


ఊర్లో అందరికీ బైక్‌ ఉందని తమ బిడ్డకూ కొనిచ్చి.. 

రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు చెందిన సావిత్రమ్మ, సహదేవయ్య కుమారుడు గిరిచందు. పీలేరులో ఐటీఐ చదివాడు. బైక్‌ కావాలని తల్లిదండ్రులను అడిగాడు. ఊర్లో అందరు పిల్లలకూ ఉంది.. మనోడికి కూడా కొందామని భావించి తల్లిదండ్రులు రూ.1.30 లక్షలతో బైక్‌ కొనిచ్చారు. రెండు నెలల పాటు బైక్‌లోనే కళాశాలకు వెళ్లి వచ్చాడు. ఐటీఐ పరీక్షలు రాసి వస్తుండగా పీలేరు- రొంపిచెర్ల మార్గమధ్యలో ట్రాక్టరు ఢీకొని గతేడాది జనవరి ఒకటో తేదీన గిరిచందు మరణించాడు. ‘నాకు పరీక్షలు అయిపోయాయి. ఇక బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తాన’ని చెప్పిన కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ శోకంలోనే ఉన్నారు. ప్రస్తుతం కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.

గుంటూరు నుంచి బైక్‌లో వచ్చి ఆశ్చర్యపరుద్దామని..

పలమనేరు పట్టణం రంగాపురం వీధికి చెందిన సూరి కుమారుడు అనిల్‌ చదువులో బాగా రాణించేవాడు. తల్లిదండ్రులు తాము తినీతినక పొదుపు చేసుకున్న సొమ్ముతో గుంటూరులోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో సీఏ కోర్సులో చేర్పించారు. సీఏ పూర్తి చేసుకుని ఇక ఉద్యోగంలో స్థిరపడతాడని, తమకు బాసటగా నిలుస్తాడని తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలో గుంటూరు నుంచి పలమనేరుకు బైక్‌లో వచ్చి ఆశ్చర్యపరచాలన్న అత్యుత్సాహంతో తన స్నేహితుడి కొత్తబైకులో ఎక్కాడు అనిల్‌. పది రోజుల కిందట గుంటూరు నుంచి అర్ధరాత్రి బయల్దేరిన వారు వేకువజామున నెల్లూరు వద్ద హైవేలో డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే అసువులు బాసారు. తండ్రి టైలర్‌ కాగా, తల్లి కండక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ పరిస్థితి ఎవరికీ రాకూడదని వారు ఆవేదన చెందుతున్నారు.

ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం

శ్రీహరి, వినీత దంపతుల కుమారుడు రాహుల్‌. చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బీటెక్‌లో చేరినప్పటి నుంచి రేస్‌ బైక్‌ కచ్చితంగా కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. బైక్‌ కొనకుంటే ఊరొదిలి వెళ్లిపోతానని బెదిరించేవాడు. దీంతో చేసేదేమీలేక అప్పు చేసి మరీ జూన్‌ ఒకటో తేదీన రూ.3.80 లక్షల ఖరీదైన పెద్ద బైక్‌ను కొనిచ్చారు. కచ్చితంగా పది రోజులకు, అంటే జూన్‌ పదో తేదీన కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా చిత్తూరు బైపా్‌సలో కుక్క అడ్డు రావడం, తప్పించే ప్రయత్నంలో గట్టిగా బ్రేక్‌ కొట్టడం, రోడ్డు మీద ఇసుక ఉండడం.. వంటి కారణాలతో బైక్‌ అదుపు తప్పింది. బైక్‌లో ఉన్న రాహుల్‌ అతని స్నేహితుడు తేజస్‌.. ఇద్దరూ రోడ్డు పక్కనున్న బండరాళ్ల మీద పడ్డారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాహుల్‌ తండ్రి శ్రీహరి 18 ఏళ్లకిందట రోడ్డు ప్రమాదానికి గురై వందశాతం వికలత్వంతో ఇబ్బంది పడుతున్నారు. అప్పట్నుంచి కుమారుడు రాహుల్‌పై ఆశలు పెట్టుకుని వినీత జీవిస్తున్నారు. రాహుల్‌ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇంకెవ్వరి కోసం బతకాలని ఆమె వేదన చెందుతున్నారు.


బైక్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

చిత్తూరు కట్టమంచిలోని రవికమార్‌రెడ్డి కుమారుడు కుస్లు. వేలూరులోని ఓ విద్యా సంస్థలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. రెండేళ్ల కిందట బైక్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం చిత్తూరు బైపా్‌సలో మరణించిన రాహుల్‌ తండ్రి, కుస్లు తండ్రి.. ఇద్దరూ అన్నదమ్ములు. ఒకే ఇంట్లో బైక్‌ కారణంగా భవిష్యత్తు ఉన్న ఇద్దరు విద్యార్థులకు జీవితమే లేకుండా పోయింది.


కుటుంబాన్ని మర్చిపోవద్దు 

విద్యార్థులు బైక్‌ కొనడం, అందులో కాలేజీకి వెళ్లడం వరకు ఇబ్బంది లేదు. బాధ్యతారాహిత్యంతో డ్రైవింగ్‌ చేసి కుటుంబాలను విషాదంలో నింపుతున్నారు. హెల్మెట్‌ పెట్టుకుంటే  99 శాతం వరకు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. వచ్చేవారం నుంచి విద్యార్థుల బైకుల అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అన్ని కాలేజీల వద్ద పోలీసులను పహరా ఉంచి, హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపేవారిని పట్టుకుని జరిమానా విధిస్తాం. వెంటనే బైక్‌ను సీజ్‌ చేసేస్తాం. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే యువత దారి తప్పుతుంది. తల్లిదండ్రులు బాధ్యత వహించి, పిల్లులు ఎలా డ్రైవ్‌ చేస్తున్నారు? బయట ఎలా మసులుతున్నారు? అనే కోణాల్లో పర్యవేక్షించాలి. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు మీ పిల్లలు టిఫిన్‌ చేయకుంటే ఎలా పంపించరో.. హెల్మెట్‌ లేకున్నా పంపించొద్దు.

- రిషాంత్‌రెడ్డి, ఎస్పీబైకు కొనకుండా నచ్చజెప్పండి 

బైక్‌ కొనాలని చాలాకాలంగా అడిగేసరికి చేసేదేమిలేక మా అబ్బాయి రాహుల్‌కు ఈ నెల ఒకటో తేదీన కొనిచ్చాం. కొనకుంటే ఊరొదిలి వెళ్లిపోతానన్నాడు. కొనిచ్చాక పది రోజులకే లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుని ఎలా బతకాలో తెలియడం లేదు. పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు పెద్ద పెద్ద బైకులు కొనాల్సిన అవసరం లేదు. దాని పర్యవసానాలు వివరించి నచ్చజెప్పండి. లేకుంటే నాలా చేతికంది వచ్చిన కొడుకును పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాలేజీకి వెళ్లేటప్పుడు బైక్‌కు ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవడం మంచిది. 

- ఎం.వినీత, చిత్తూరులో బైక్‌ ప్రమాదంలో మరణించిన రాహుల్‌ తల్లి


Read more