స్త్రీ నిధి, ఉన్నతి రుణాలలో రూ.40 లక్షల గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-09-14T04:55:48+05:30 IST

మండలంలోని వెలుగు కార్యాలయం పరిధిలోగల బాలాయపల్లి క్లస్టర్‌లో స్త్రీనిధి, ఉన్నతి రుణాలకు సంబంధించి దాదాపు రూ.40 లక్షల వరకు గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్త్రీ నిధి, ఉన్నతి రుణాలలో రూ.40 లక్షల గోల్‌మాల్‌

రుణాలు చెల్లించామంటున్న పొదుపు సభ్యులు

లేదంటున్న సీసీ

ఆదుకోవాలంటున్న సభ్యులు

బాలాయపల్లి, సెప్టెంబరు13: మండలంలోని వెలుగు కార్యాలయం పరిధిలోగల బాలాయపల్లి క్లస్టర్‌లో స్త్రీనిధి, ఉన్నతి రుణాలకు సంబంధించి దాదాపు రూ.40 లక్షల వరకు గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్లస్టర్‌ పరిధిలో అలిమిలి, బాలాయపల్లి, మన్నూరు, కడగుంట, నిండలి పంచాయతీలలోని కొన్ని పొదుపు సంఘాల సభ్యులు ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలను తీసుకున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా పూర్తిగా చెల్లించారు. తిరిగి రుణం కోసం పది రోజుల క్రితం బాలాయపల్లిలోని వెలుగు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కొత్త సీసీని సంప్రదించగా గ్రూపుల వారీగా ఎవరెవరు బకాయిల వివరాలు చెప్పడంతో సభ్యులు కంగుతున్నారు. తాము పూర్తిగా కట్టేశామని రశీదులు సైతం చూపించారు. అయితే ఆన్‌లైన్‌లో బకాయిలు అలాగే ఉన్నాయని సీసీ వివరించడంతో సభ్యులు లబోదిబోమంటున్నారు.

అప్పులు...తప్పులు..

అలిమిలి సంఘ బంధం పరిధిలోని సాయికృష్ణ గ్రూఫులోని ఓ సభ్యురాలు ఉన్నతి ద్వారా రూ.2 లక్షలు రుణం తీసుకున్నారు. వడ్డీతో సహా చెల్లించారు. అయినా రూ.1.40 లక్షలు బకాయి చెల్లించాలని చెప్పారు. వెంకటరెడ్డిపల్లిలోని నరసింహ గ్రూఫులోని మరో సభ్యురాలు స్త్రీనిధి ద్వారా రూ.లక్ష తీసుకుని పూర్తిగా చెల్లించినా ఇంకా రూ.40వేలు కట్టాలని చెబుతున్నారు.  ఇదే గ్రామంలోని వెంకటేశ్వర గ్రూఫు సభ్యులు ఇద్దరు రూ.లక్ష చొప్పున రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారు. అయినా ఒకరు రూ.37 వేలు, మరొకరు రూ.27 వేలు బకాయి ఉందని అంటున్నారు. ఇలా దాదాపు రూ.40 లక్షల వరకు అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. వీవోఏల సహకారంతో గతంలో ఉన్న సీసీ అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గత సీసీ కాలంలో జరిగిన నగదు లావాదేవీలపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-14T04:55:48+05:30 IST