నోటిఫికేషన్‌ ఇవ్వకుండా మోసం: బీజేపీ

ABN , First Publish Date - 2022-08-29T05:39:34+05:30 IST

పోలీసు శాఖలో 25 వేల ఖాళీలు ఉంటే, ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా మోసం: బీజేపీ
మీడియాతో మాట్లాడుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 28: పోలీసు శాఖలో 25 వేల ఖాళీలు ఉంటే, ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేక ఉద్యోగ వయోపరిమితిని పెంచారన్నారు. మద్యపాన నిషేదమంటూ అడ్డగోలుగా బార్లు తెరచి మహిళలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో నిరసన తెలియజేసే హక్కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా, ఇది ప్రజా రాజ్యమా? నిరంకుశ రాజ్యమా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో రాష్ట్రం నాశనమైందన్నారు. బీజేపీని, మోదీని దించాలని తోకపార్టీలు సీపీఐ, సీపీఎం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య సఖ్యత లేని పార్టీలు, ఉనికి కోసం ఉండే పార్టీలు మీవి కాదా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి, జిల్లా ఇన్‌చార్జి కోలా ఆనంద్‌, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, నాయకులు దుర్గా, బాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-29T05:39:34+05:30 IST