ష్‌... గప్‌చుప్‌!

ABN , First Publish Date - 2022-02-23T07:02:18+05:30 IST

కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలోని అక్కమహాదేవి వసతి గృహంలోని విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం వెనుక ఏం జరిగిందనేది రహస్యంగానే ఉండిపోతోంది.

ష్‌... గప్‌చుప్‌!
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

ద్రావిడ వర్శిటీలో విద్యార్థినుల అస్వస్థతకు

ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణం కాదట

మరింకేమిటంటే తెలియదట

అధికారుల వింత వాదన నోరు తెరవని విద్యార్థినులు

 

 కుప్పం, ఫిబ్రవరి 22 : కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలోని అక్కమహాదేవి వసతి గృహంలోని విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం వెనుక ఏం జరిగిందనేది రహస్యంగానే ఉండిపోతోంది.ఫుడ్‌ పాయిజనింగ్‌ కావడంవల్లే ఇది జరిగిందని ప్రాథమికంగా వైద్యులు ఒక అంచనాకు వచ్చారు. అయితే అలా ఎలా... ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే మిగిలిన విద్యార్థులు కూడా అస్వస్థత పాలు కావాలి కదా అని అధికారులంటున్నారు. మరి కారణమేమిటంటే, తమకేం తెలుసంటూ చేతులెత్తేస్తున్నారు. మరి ఫుడ్‌ పాయిజనింగూ కాక, వేరే ఇతర కారణమూ లేక ఏకంగా 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు ఎలా గురయ్యారో మిస్టరీగా ఉంది.

       ద్రావిడ విశ్వవిద్యాలయంలోని అక్కమహాదేవి మహిళా వసతి గృహంలో సుమారు 270 మంది యూజీ, పీజీ విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం మంగళవారం ఉదయం వీరికి టిఫిన్‌గా ఇడ్లీ, సాంబారు ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం పెట్టారు.నూల్‌కోల్‌,బంగాళాదుంప,క్యాలీఫ్లవర్‌ కూరగాయలు వేసి కాసిన సాంబారు, బీన్స్‌ తాలింపు, రసం, మజ్జిగ భోజనంలో వడ్డించారు. ఉదయం మిగిలిన పిండితో చేసిన దోసెలు, దానితోపాటు ఉదయానిదే సాంబారు కూడా కొద్దిమంది విద్యార్థులు మధ్యాహ్నం కూడా తీసుకున్నారంటున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యార్థినుల్లో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఐదున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు పూర్తి నిస్సత్తువగా మారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటిదాకా పట్టించుకోని అధికారులు, వీరిద్దరినీ హుటాహుటిన కుప్పం పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆపైన కూడా హాస్టల్లోని విద్యార్థినుల్లో చాలామందికి వాంతులు, విరేచనాలు మొదలై తగ్గకపోవడంతో హాస్పిటల్లో చేరేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 7 గంటలకు 17మందిని చేర్చగా 8 గంటలకు ఆ సంఖ్య 26కు పెరిగింది. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు చేరుతూనే ఉన్నారు.కొద్దిమందికి శ్వాస తీసుకోవడం కష్టమైపోతుండడంతో ఆస్పత్రి సిబ్బంది వారికి ఆక్సిజన్‌ మాస్క్‌లు అమర్చడం, ఇతర చికిత్సలు చేయడానికి బాగా హడావుడి పడాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినులను స్ట్రెచర్లలో తీసుకెళ్లడం, వారి వెంట ఆక్సిజన్‌ సిలిండర్లు పట్టుకోవడం వంటి హడావుడితో ఆస్పత్రి మొత్తం గందరగోళంగా తయారైంది. అయితే విద్యార్థినుల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల్లో ఉండడంతో వారెవరూ స్థానికంగా కనిపించలేదు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న వారిలో చాలామంది కుప్పం బయలుదేరినట్లు చెబుతున్నారు.


 ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమం

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి తొలుత బాగా విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురై, శ్వాస తీసుకోవడానికి  ప్రయాస పడుతున్న సహన, సౌమ్య అనే పీజీ విద్యార్థినులతోపాటు భానుప్రియ అనే యూజీ విద్యార్థినిని ఐసీయూకు తరలించి చికిత్స కొనసాగించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం కాస్త నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే రాత్రి గడిస్తే కానీ, వారి పరిస్థితి పూర్తిగా బాగుపడిందని చెప్పలేమన్నారు. హఠాత్తుగా తమలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి విద్యార్థినులు కూడా భయపడిపోయారు.అయితే ఈ విషయంలో అధికారులు స్పందించాల్సినంతగా స్పందించలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ముందుగా హాస్టల్‌ వార్డెన్‌ విజయవర్ధినితో పాటు యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ వేణుగోపాల్‌రెడ్డి, మరికొందరు అధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆపైన వీసీ తుమ్మల రామకృష్ణ వచ్చి చికిత్స పొందుతున్న విద్యార్థిన్థులను పరామర్శించారు. అయితే హాస్టల్లో ఏం జరిగిందన్న విషయంపై విద్యార్థినులు కానీ, అటు అఽధికారులు కానీ నోరు విప్పి చెప్పడంలేదు. ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే అందరూ అనారోగ్యం పాలు కావాలి కదా అన్నది అధికారుల వాదన. మరి అది కానప్పుడు ఇంకే కారణంతో ఇంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారంటే వారి వద్ద సమాధానం లేదు. విద్యార్థులు ప్యానిక్‌ కావడంవల్లే ఒకరిని చూసి ఒకరు భయంతో అస్వస్థతపాలయ్యుంటారని చెబుతున్నారు. పోనీ హాస్టల్‌ విద్యార్థినులను ఆరా తీయబోతే వారు పెదవి విప్పడంలేదు.అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో కొద్దిమంది హాస్టల్‌ భోజనం కాకుండా బయటినుంచి భోజనం తెప్పించుకుని తిన్నారని, అందువల్లనే అస్వస్థత పాలయ్యారన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. అయితే దీన్ని నిర్ధారించేవారు మాత్రం లేరు. 


విచారించి నివేదిక అందజేయండి:మంత్రి ఆదేశం

 ద్రావిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. వర్శిటీ అధికారులతో, విద్యార్థినులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అస్వస్థతకు కారణాలు ఏమిటో గుర్తించాలని, మెరుగైన వైద్యం అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రేమచంద్రారెడ్డిని, వర్శిటీ వీసీ రామకృష్ణను ఆదేశించారు.


 బాధాకరం: చంద్రబాబు

  ద్రావిడ విశ్వవిద్యాలయంలో విషాహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం చాలా బాధాకరమైన సంఘటన అని చంద్రబాబు పేర్కొన్నారు. వారికి సరైన వైద్యం అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. అంతేకాక ఈ దుర్ఘటనపై సత్వరం విచారణ చేపట్టి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్సీ భరత్‌ కూడా వర్శిటీ అధికారులతోపాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.



Updated Date - 2022-02-23T07:02:18+05:30 IST