దసరా ముందు జెండా పండుగ

ABN , First Publish Date - 2022-09-24T07:04:22+05:30 IST

సమైక్యతకు చిహ్నంగా భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా సంబరంగా జరుపుకునే పండుగ దసరా. గూడూరులో జెండా పండుగను ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు.

దసరా ముందు జెండా పండుగ
ఆంజనేయస్వామిని చిత్రీకరిస్తున్న ఆర్టిస్టు

గూడూరు, సెప్టెంబర్‌ 23 : సమైక్యతకు చిహ్నంగా భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా సంబరంగా జరుపుకునే పండుగ దసరా. గూడూరులో జెండా పండుగను ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఇందుకు స్థానికులు కోట్లాది రూపాయలు వెచ్చిస్తారు. దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకంగా జరుపుకునే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గూడూరులో విశిష్టంగా జరుపుకుంటారు. కొవిడ్‌ వల్ల రెండేళ్లు ఈ పండుగ జరుగలేదు. దీంతో ఈసారి సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.జెండాలు రూపుదిద్దుకుంటున్నాయి.భారీగా ఆకట్టుకునేలా దేవుళ్ల హోర్డింగ్‌లు ఏర్పాటవుతున్నాయి. వీధుల్లో విద్యుదీపాలంకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంబరమంటే సంబరం

కాలక్రమంలో జెండా పండుగ పెద్ద సంబరంగా మారింది. గూడూరు పట్టణ ప్రజలకు ప్రతిష్టాత్మకమైన పండుగగా మారింది. వీధివీధినా జెండాలు ప్రతిష్టించేలా సంబరం విస్తరించింది. ప్రస్తుతం దాదాపు 40 ప్రాంతాల్లో జెండాఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయా వీధులవారు పోటీలు పడి ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.  బొగ్గు బొమ్మ వర్ణచిత్రంగా మారింది. సంజీవిని పర్వతాన్ని మోసుకువెళ్లే ఆంజనేయుని చిత్రాలతో పెద్ద పెద్ద జెండాలను, చాందినీలతో అలంకరిచిన ట్రాక్టర్ల మీద ఊరేగిస్తున్నారు. కళ్లు మిరుమిట్లు గొలుపేలా విద్యుత్‌ దీపాలంకరణ ఉంటుంది. టపాసులు హోరెత్తుతాయి. ఊరేగింపు ముందు తెనాలి బ్యాండు, భేతాళనృత్యాలు, జింగిరి మేళం, తప్పెట్లు, తాళాలు, కోలాట నృత్యాలు, బొట్టబొమ్మల వేషధారణలు, పార్వతీమహిషాసురుల యుద్ధనాట్యాలు ఉంటాయి. దరువుకు అనుగుణంగా యువత డ్యాన్సులు వేస్తారు. ఈ విధంగా గమళ్లపాళెం, తూర్పువీధి, కరణాలవీధి, కోనేటిమిట్ట, అళఘనాధస్వామి దేవస్థానం, వీరారెడ్డిపల్లి, కుమ్మరవీధి, మహలక్ష్మమ్మ దేవాలయం, నరసింగరావుపేట, తిలక్‌నగర్‌సెంటర్‌, ఇందిరానగర్‌, అశోక్‌నగర్‌ , అరుంధతీయనగర్‌ తదితర ప్రాంతాల్లో జెండా పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ నెల 25న జెండా పండుగ ముగిసిన అనంతరం 26వ తేదిన కలశ స్థాపన జరిపి శరన్నవరాత్రులను మొదలుపెడతారు.

జెండా పండగ వెనుక..

గూడూరు పట్టణాన్ని రోగాలు ముంచెత్తి, మనుషులు చచ్చిపోతున్న సమయంలో ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని పట్టణానికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత రోగాలు తగ్గుముఖం పట్టాయని ప్రజల నమ్మకం.ఈ నమ్మకమే జెండా పండుగగా రూపుదిద్దుకుంది. 74 ఏళ్ల క్రితం తొలి జెండా ఎగిరిందని చెబుతారు. గూడూరు పట్టణంలోని కరణాలవీధిలో వున్న బొడ్డుచౌకు శక్తిరాయి వద్ద ఆంజనేయస్వామి జెండాను తొలిసారిగా ప్రతిష్టించినట్లు చెబుతారు. ఆరు గజాల తెల్లని గుడ్డపై సంజీవని పర్వతాన్ని మోసుకుని వెళ్తున్న ఆంజనేయుని చిత్రాన్ని బొగ్గుతో చిత్రించి దానిని జెండాగా ఎగరేసేవారు. విజయదశమికి ముందు వచ్చే అమావాస్యనాడు అసుర  సంధ్యవేళలో కాగడాల వెలుగులో ఈ జెండా ఎగురవేస్తారు. తప్పెట్ల హోరు నడుమ అంజనేయ స్వామి స్తోత్రాలను వల్లెవేస్తూ గ్రామోత్సవం నిర్వహిస్తారు.

Read more