-
-
Home » Andhra Pradesh » Chittoor » Even in death be careful for the younger brother-NGTS-AndhraPradesh
-
మృత్యువులోనూ... తమ్ముడి కోసం జాగ్రత్తగా!
ABN , First Publish Date - 2022-02-23T05:46:46+05:30 IST
మృత్యువులోనూ తన తమ్ముడికి ఏం కాకూడదనుకున్నాడు... అలాగే ఎదురుగా వస్తున్న వాహనదారుల గురించి ఆలోచించాడు... వాహనం నడుపుతూ గుండెపోటు రావడంతో రోడ్డు పక్కన నిలిపి క్షణాల్లో మృతి చెందాడు.

వాహనం నడుపుతుండగా కర్నూలు జిల్లా డ్రైవర్‌కు గుండెనొప్పి
క్షణాల్లోనే మృతి
బురకాయలకోట వద్ద ఘటన
ములకలచెరువు, ఫిబ్రవరి 22: మృత్యువులోనూ తన తమ్ముడికి ఏం కాకూడదనుకున్నాడు... అలాగే ఎదురుగా వస్తున్న వాహనదారుల గురించి ఆలోచించాడు... వాహనం నడుపుతూ గుండెపోటు రావడంతో రోడ్డు పక్కన నిలిపి క్షణాల్లో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన సత్యం(36) రెండు రోజుల క్రితం కొత్త మినీ లగేజీ వాహనం కొన్నాడు. వాహనానికి బాడీ కట్టిద్దామనిసోమవారంరాత్రి తన తమ్ముడు రాఘవతో కలిసి తానే వాహనం నడుపుకుంటూ మదనపల్లెకు బయలుదేరాడు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సయమంలో బురకాయలకోట వద్దకు వచ్చేసరికి వాహనం నడుపుతున్న సత్యంకు గుండెనొప్పి వచ్చింది. దీంతో వాహనాన్ని జాతీయ రహదారి పక్కన నిలబెట్టి గుండెనొప్పితో క్షణాల్లోనే మృతి చెందాడు. 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కళ్ళ ముందే క్షణాల్లో అన్న మృతి చెందడంతో తమ్ముడు భోరున విలపించాడు. గుండెనొప్పి వచ్చిన సమయంలో ఎదురుగా వచ్చిన వాహనాల మీదకు వెళ్తే తనకు, ఇతర డ్రైవర్లకు ప్రమాదం జరుగుతుందని భావించి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడని తమ్ముడు రాఘవ తెలిపాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని అంబులెన్సులో స్వగ్రామానికి తీసుకెళ్లారు.