రైతు మరణించినా రెవెన్యూ తీరు మారలేదు

ABN , First Publish Date - 2022-10-01T06:48:24+05:30 IST

‘మీ నిర్లక్ష్యంతో తహసీల్దారు కార్యాలయం వద్దే నిరసన చేపడుతూ రత్నం అనే రైతు మృతిచెందారు. అయినా రెవెన్యూ సిబ్బందిలో మార్పు రాలేదు.

రైతు మరణించినా రెవెన్యూ తీరు మారలేదు
ధర్నా నిర్వహిస్తున్న దళిత సంఘాలు

పెనుమూరు, సెప్టెంబరు 30: ‘మీ నిర్లక్ష్యంతో తహసీల్దారు కార్యాలయం వద్దే నిరసన చేపడుతూ రత్నం అనే రైతు మృతిచెందారు. అయినా రెవెన్యూ సిబ్బందిలో మార్పు రాలేదు. ఇప్పుడు నాగరాజు అనే రైతు విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు’ అంటూ ఎల్‌కేపీ ఊరు గ్రామస్తులు ధ్వజమెత్తారు. సీపీఎం, దళిత నేతలతో కలిసి శుక్రవారం పెనుమూరు తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ‘కలికిరి రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 411-1లో 1.28 ఎకరాల భూమి 35 ఏళ్లుగా నాగరాజు అనుభవంలో ఉంది. అతడికి డీకేటీ పట్టా కూడా ఇచ్చారు. అందులో ఆయన వేరుశనగ పండిస్తున్నారు. గతేడాది 411ను 413గా మార్చి ఇళ్ల స్థలాలకు కేటాయించారు. దీనిపై నాగరాజు హైకోర్టుకు వెళ్లగా 411-1లో తనకి ఉన్న 1.28 ఎకరాలు భూమిని సర్వే చేసి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంతవరకు సర్వే చేయలేదు. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కోర్టు ఉత్తర్వులనూ అమలు చేయని స్థితిలో ఉన్నారు’ అంటూ దళిత నాయకులు మండిపడ్డారు. వారం రోజుల్లోగా నాగరాజు భూమిని సర్వే చేసివ్వకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని సీపీఎం నేతలు హెచ్చరించారు. దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయరావు, సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, సురేంద్రన్‌, జ్యోతినాథ్‌, మునికృష్ణ, సరస్వతి, మణి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మాకు ప్రాణహాని ఉంది: సరస్వతి

‘ఈ స్థలంపై మేము పలుమార్లు తహసీల్దారుకు వినతిపత్రాలు ఇచ్చాం. అక్కడ ఇళ్ల పట్టాలు పొందిన మహేష్‌, వెంకటాద్రి, మధు, వీరాస్వామినాయుడు చాలాసార్లు మాపై దాడులు చేశారు. కేసులు కూడా పెట్టారు. వాళ్లు కొట్టినందుకు నా భర్త మెంటల్‌గా మారిపోయాడు. రాత్రి పూట భయంతో బతకుతున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి’ అంటూ నాగరాజు భార్య సరస్వతి కన్నీరు మున్నీరయ్యారు. 

Updated Date - 2022-10-01T06:48:24+05:30 IST