జలదిగ్భందంలో ఏటిగడ్డ కమ్మపల్లె

ABN , First Publish Date - 2022-12-12T23:56:31+05:30 IST

జల దిగ్భందంలో పుంగనూరు మండలం ఏటిగడ్డకమ్మపల్లె సోమవారం చిక్కుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతోట మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామానికి వెళ్లే దారిపై నడుంలోతు నీరు ప్రవహిస్తోంది.

జలదిగ్భందంలో ఏటిగడ్డ కమ్మపల్లె
ట్రాక్టర్‌పై వెళ్తున్న ఏటిగడ్డకమ్మపల్లెవాసులు

పుంగనూరు, డిసెంబరు 12: జల దిగ్భందంలో పుంగనూరు మండలం ఏటిగడ్డకమ్మపల్లె సోమవారం చిక్కుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతోట మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామానికి వెళ్లే దారిపై నడుంలోతు నీరు ప్రవహిస్తోంది. రామసముద్రం, చెంబకూరు, అడ్డకొండ ప్రాంతాల నుంచి వర్షంనీరు ఉదృతంగా నేతిగుట్లపల్లె ప్రాజెక్టుకు చేరుతోంది. 1970లో మదనపల్లె మండలం నందిరెడ్డిగారిపల్లె నుంచి పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె సమీపంలోని ఏటిగడ్డకమ్మపల్లె(జోగులగడ్డ)కు వచ్చి స్ధిరపడగా ప్రస్తుతం గ్రామంలో 16 ఇళ్లు, 80 మంది జనాభా ఉన్నారు. అందురూ వ్యవసాయంపై ఆధారపడి ఇళ్లు నిర్మించుకుని 78 ఎకరాల్లో 19 బోర్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం నేతిగుట్లపల్లె వద్ద టీఎంసీ సామర్థ్యంతో దాదాపు రూ.700 కోట్లతో ప్రభుత్వం ప్రాజెక్టు మంజూరు చేయగా 70 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని పొలాలు, ఇళ్లు, ఆస్తులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. పలుమార్లు ఆర్డీవోలు, తహసీల్దార్లు, తదితర అఽధికారులు సమావేశాలు నిర్వహించడం తప్ప పరిహారం మాత్రం ఇవ్వలేదు. గత నెల చివరికే నష్టపరిహారం, పునరావాస ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఏటిగడ్డకమ్మపల్లెతో బాటు పరిసర గ్రామాలకు చెందిన 793 ఎకరాల భూములకు సంబంధించి 150 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిఉంది. గతంలో గ్రామానికి వెళ్లే దారిలో నీరు నిండిపోయి రాకపోకలు స్తంభించాయని రోడ్డు సమస్యపై ఈఏడాది అక్టోబరు 18న ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు రిజర్వాయర్‌ తూమును తెరచి నీటిని వదలడంతో సమస్య తీరింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ తూము చిన్నదిగా ఉండటంతో ఎగువ భాగం నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో రిజర్వాయర్‌ నిండుతోంది. ఆదివారం నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటం, గ్రామానికి చెందిన ఎస్‌.కృష్ణమూర్తికి చెందిన ఒకటిన్నర ఎకరంలోని క్యాబేజీ నీటితో నిండటంతో దాదాపు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. నడుంలోతు నీరు వెళ్తుండటం, ముందుగానే వంక ఉండటంతో గ్రామానికి వచ్చే మోటర్‌ సైకిళ్లు, కార్లు బయటే పెట్టేశారు. ట్రాక్టర్‌పై దాటుతున్నారు. సోమవారం విషయం తెలుసుకుని తహసీల్దార్‌ సీతారాం వెళ్లి వర్షం తగ్గగానే రోడ్డు సమస్య తీరుస్తామని, అంతవరకు వెళ్లేందుకు ట్రాక్టర్‌ ఉపయోగించాలని అందుకు డీజిల్‌ సమకూర్చుతామన్నారు. తమకు ఇళ్లు, ఆస్తులకు మార్కెట్‌ విలువ మేరకు పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని కోరగా తాను కొత్తగా వచ్చానని, మూడు రోజుల క్రితమే పెండింగ్‌ ఫైళ్లు కలెక్టర్‌కు పంపామని వివరించారు.

Updated Date - 2022-12-12T23:56:34+05:30 IST