తిరుమలలో ఆర్టీసీ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2022-07-06T05:56:41+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆర్టీసీ అఽధికారులు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు.

తిరుమలలో ఆర్టీసీ అధికారుల తనిఖీలు
రాంభగీచా బస్టాండ్‌లో తనిఖీ చేస్తున్న ఆర్టీసీ అధికారులు

తిరుమల, జూలై5(ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆర్టీసీ అఽధికారులు తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. తిరుమలకు ఆర్టీసీ బస్సులు నడిపే డిపో మేనేజర్లతో తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు టీటీడీ ఏకాంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో ఈ సారి ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలను నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముందన్నారు. ఈ క్రమంలో రద్దీకి అనుగుణంగా బస్సుల ట్రిప్పులను పెంచాల్సిన అవసరముందన్నారు. గరుడసేవ రోజు తీసుకోవాల్సిన చర్యలతో పాటు దూరప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో బస్సుల కండిషన్లను మరింత మెరుగు పరుచుకోవాలన్నారు.  బ్రహ్మోత్సవాలను గత తరహాలోనే విజయవంతం చేయాలని డిపో మేనేజర్లను కోరారు. అలాగే వారాంతపు రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తిరుమలలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు రాంభగీచా బస్టాండ్‌ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం భాస్కర్‌, తిరుమల డీఎం విశ్వనాథ్‌, అలిపిరి డీఎం హరిబాబు, మంగళం డీఎం రాజవర్థన్‌రెడ్డి, తిరుపతి డీఎం బాలాజీ, తిరుపతి బస్టాండ్‌ ఏటీఎం డీఆర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T05:56:41+05:30 IST